మనిషి కమ్యూనిస్టు, మనసు మాత్రం టీడీపీ. ఎన్ని విమర్శలొచ్చినా తెలుగుదేశంపై ప్రేమను దాచుకోవడం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణకు సాధ్యం కావడం లేదు. ఎర్ర కండువా తీసి, హాయిగా పచ్చ కండువా కప్పుకుని తనకిష్టమైన రాజకీయ అంశాలను మాట్లాడొచ్చు. కానీ ఆ పని మాత్రం చేయడం లేదు. సీపీఐలో ఉంటూ చంద్రబాబు మనిషిగా ఆయన ప్రయోజనాల కోసం మాత్రమే నోరు తెరుస్తారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా…. ఏ మాత్రం వైఖరి మార్చుకోని నిఖార్సైన నాయకుడిగా రామకృష్ణ పేరు గడించారు.
చంద్రబాబు ప్రయోజనాల కోసం మాట్లాడితే పోయేదేం లేదు, కమ్యూనిస్టు పరువు తప్ప అని ఆయన భావించినట్టున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తుంటారు. చంద్రబాబుపై వల్లమాలిన ప్రేమను పెంచుకుంటే నష్టమేమీ లేదు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఎందుకనో ఆయన ఒంటికాలిపై లేస్తుంటారు. ఈ సారి జరిగిన అసెంబ్లీ సమావేశాలు, సభ హుందాను దిగజార్చారని రామకృష్ణ విమర్శించారు.
1953-2022 వరకు జరిగిన సమావేశాలలో ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదని రామకృష్ణ విమర్శించారు. ప్రజల సమస్యలు, పరిష్కారంపై చర్చలు జరగలేదన్నారు. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకోవడం, ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారని మండిపడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెన్షన్ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భజన చేయించు కుంటారా అని ప్రశ్నించారు.
కోర్టులను కూడా తప్పుబట్టి నోటికి వచ్చినట్లు మాట్లాడతారా? అని ప్రశ్నించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా రాకపోతే విమర్శలు చేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ ఏకంగా నాటి ప్రతిపక్ష వైసీపీ బహిష్కరించిన సంగతి రామకృష్ణకు తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
పచ్చ అద్దాలు పెట్టుకుని చూస్తే, లోకమంగా అట్టే కనిపిస్తుందని రామకృష్ణను దెప్పి పొడుస్తున్నారు. అసెంబ్లీలో టీడీపీ సభ్యులు చిడతలు కొట్టడం ఎలాంటి హుందాతనం కిందికి వస్తుందో మహా మేధావి, చంద్రబాబు పరమభక్తుడు రామకృష్ణ చెప్పాలని నెటిజన్లు సెటైర్స్ విసరడం గమనార్హం. సీపీఐలో ఉంటూ టీడీపీ పలుకులేంటో రామకృష్ణకు, ఆ పార్టీ పెద్దలకే తెలియాలనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి.