తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు అన్నాడు వేమన ఒక పద్యంలో. కొందరు ఎదుటివారిని నువ్వు ఆ తప్పు చేశావు … ఈ తప్పు చేశావు అని తెగ విమర్శిస్తుంటారు. కానీ తాము చేస్తున్న తప్పులను గుర్తించలేరు. గురివిందగింజ తన కింద ఉన్న నలుపును చూసుకోలేదు అనే సామెత ఉంది. సామాన్యుల సంగతి అలా పక్కన పెడితే ఈ పద్యాలు, సామెతలు రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తాయి.
రాజకీయ నాయకులు రోజూ పొద్దున్నే లేస్తే ఎవరినో ఒకరిని తిడుతూనే ఉంటారు. ఇదంతా రాజకీయాల్లో ఒక భాగం. తమ తప్పులు దాచుకోవడం, ఎదుటివారి తప్పులను ప్రచారం చేయడం పొలిటికల్ గేమ్. ఇప్పుడు తెలంగాణా సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నాయకులు, మంత్రులు ఆడుతున్న పొలిటికల్ గేమ్ ఇలాంటిదే. తెలంగాణలో అధికార పార్టీ నిరంతరం కేంద్రాన్ని, ప్రధాని మోడీని తిడుతూ, ఆందోళనలు, ఉద్యమాలు చేయడం ఈమధ్య ఎక్కువైపోయింది. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రతిపక్షాలు ఆందోళన చేస్తే వెంటనే అరెస్టులు చేస్తారు.
అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షాలకు ఒక న్యాయం అన్న మాట. సరే …అదలా పక్కన పెడదాం. ఈ మధ్య గ్యాస్, పెట్రోల్ ధరలు పెరిగాయి. వెంటనే టీఆర్ఎస్ పార్టీ నాయకులు వీధి పోరాటాలు ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. ఎక్కడికక్కడ మోదీ దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు. మోదీ డౌన్ డౌన్ అంటూ నినదిస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై గులాబీ కేడర్ రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. మోడీని తిడుతున్నారు.
ఇక, వరి కొనుగోలుపై కేంద్రానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఉద్యమిస్తోంది. అది తెలిసిన సంగతే. పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినప్పుడల్లా ఆందోళన చేయడం అన్ని పార్టీలకు సహజంగా మారింది. పెట్రో ధరల పెంపు మీద ఆందోళన చేస్తున్న గులాబీ పార్టీ నాయకులు తమ ప్రభుత్వమే కరెంటు చార్జీలను పెంచి ప్రజలపై భారం మోపిన సంగతి ఎందుకు గుర్తించడంలేదు? బస్సు చార్జీలు పెంచిన విషయం ఎందుకు మర్చిపోయింది ?
కేంద్రం తప్పు చేసిందని చెబుతున్నప్పుడు కేసీఆర్ చేసింది తప్పే కదా. పెట్రోల్, గ్యాస్ ధరలు ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల పెరిగాయంటున్నారు. మరి, మీ చేతిలోనే ఉన్న విద్యుత్ ఛార్జీలను ఎందుకు పెంచారో రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలికదా. ఏకంగా యూనిట్‌కు 50 పైసలు పెంచేసి.. ఇండస్ట్రీలకైతే 1 రూపాయి బాదేసి.. అన్ని వర్గాల ప్రజలకు కరెంట్ షాక్ ఇచ్చిన కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా ముందు ఉద్యమించాలంటూ కొందరు అంటున్నారు. కరెంటు బిల్లులు భారీగా బాదేసిన కేసీఆర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ ధర్నాలు, ఆందోళనలు చేసేందుకు సిద్ధమవుతున్నారు సామాన్యులు.
ఇంకా చెప్పాలంటే, భవిష్యత్తులో అంతర్జాతీయ పరిస్థితులు చక్కబడితే పెట్రోల్, గ్యాస్ రేట్లు మళ్లీ తగ్గిస్తారు కూడా. అదే ఇప్పుడు పెంచిన కరెంట్ ఛార్జీలు మాత్రం పర్మినెంట్. సో.. ఇంధన ధరలకంటే కూడా కరెంట్ భారమే తడిసిమోపడవుతుంది. ఇంత చిన్న లాజిక్ మరిచి.. గులాబీ శ్రేణులు పెట్రోల్, గ్యాస్ పెంపుపై రోడ్డెక్కడం కామెడీగా ఉందనే విమర్శ వినిపిస్తోంది. అందుకే తప్పులెన్నువారు తమ తప్పులెరుగరు.