జనసేనలో ఆ ఒక్కడు.. రంగరంగ ‘మనోహరం’గా!

జనసేనలో జనసేనాని ఒక్కరే. ఆయనే పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు మరో సేనాని కనపడుతున్నారు. దాదాపుగా జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల ఒక్కరే 'మనోహరం'గా చూసుకుంటున్నారు. మూడో మనిషి వేలు పెట్టడానికి లేదన్నట్టు ఆయన పెత్తనం…

జనసేనలో జనసేనాని ఒక్కరే. ఆయనే పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు మరో సేనాని కనపడుతున్నారు. దాదాపుగా జనసేన వ్యవహారాలన్నీ నాదెండ్ల ఒక్కరే 'మనోహరం'గా చూసుకుంటున్నారు. మూడో మనిషి వేలు పెట్టడానికి లేదన్నట్టు ఆయన పెత్తనం చెలాయిస్తున్నారు. కొంతమందికి ఇది కంటగింపుగా ఉన్నా కూడా పవన్ కల్యాణ్ కి చెప్పే సాహసం ఎవరూ చేయడంలేదు. చేసినా ఆయన పట్టించుకోరనే సంగతి వారికి బాగా తెలుసు.

అప్పుడప్పుడూ తెరపైకి వస్తున్న పవన్ కల్యాణ్, సడన్ గా మీటింగ్ లు పెట్టి హడావిడి చేస్తున్నారు కానీ, పూర్తి స్థాయిలో ప్రజల్లోకి రావడంలేదు. ఓవైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండు పడవలపై ఆయన కాలు పెట్టారు. షూటింగ్ గ్యాప్ లో రాజకీయాలు చేస్తారు. కొత్త సినిమాలకు కూడా కాల్షీట్లు ఇవ్వగా, డైట్స్ మిగిలితే రాజకీయాలకు కేటాయిస్తున్నారు.

సినిమాల్లో ఆయనే తెరపై కనిపించాలి, దానికి ఆల్టర్నేట్ లేదు, కానీ రాజకీయాల్లో ఆయన మాటగా ఇంకెవరైనా పనులు చక్కబెట్టొచ్చు. ఇక్కడ ప్రత్యామ్నాయం ఉంది. ఎన్నికలు, పొత్తుల సమయంలో పవన్ తెరపైకి వస్తే చాలు. అందుకే ఇప్పుడు ఆ పనులన్నీ నాదెండ్ల మనోహర్ కే అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయన కూడా పవన్ పరోక్షంలో అన్నీ చక్కబెడుతున్నారు. 

దాదాపుగా పవన్ కల్యాణ్ పార్టీని నాదెండ్ల చేతుల్లో పెట్టేసినట్టుంది. కీలక నిర్ణయాలన్నీ ఆయనే తీసుకుంటున్నారు. జస్ట్ జనసేనానిగా పవన్ వాటిపై ఆమోద ముద్ర వేస్తున్నారంతే. కమిటీల నియామకం, ఇన్ చార్జ్ ల నియామకం, అన్నీ నాదెండ్ల ఇష్టప్రకారమే జరుగుతున్నట్టు సమాచారం. కనీసం ఎవరేంటి అంటూ పవన్ ఆరా తీస్తున్నట్టుగా కూడా కనిపించడం లేదు.

నాగబాబు పెత్తనం లేదా..?

గతంలో ప్రజారాజ్యం సమయంలో గ్రౌండ్ వర్క్ చేసింది నాగబాబే. ఆ తర్వాత అల్లు అరవింద్ తెరపైకి వచ్చి అంతా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. చివరకు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే సందర్భంలో కూడా అరవింద్ మాటే చెల్లుబాటయింది. ఇప్పుడు కూడా జనసేనకు నాగబాబు మెయిన్ పిల్లర్ గా ఉండాలి కానీ, ఆయన ఎందుకో దూరమైపోయారు. 

పవన్ కల్యాణ్ కూడా నాగబాబుని పూర్తిగా నమ్మేలా లేరు. దీంతో నాగబాబు కూడా పార్టీకి అంటీ ముట్టనట్టుగానే ఉన్నారు. ఆమధ్య చాలా గ్యాప్ తర్వాత జనసేన ఆవిర్భావ సభకు, అంతకు ముందు మత్స్యకార మద్దతు సభకు మాత్రమే వచ్చారు నాగబాబు.

నాదెండ్ల లీడ్ తీసుకుంటున్న తర్వాత నాగబాబు కూడా స్వచ్ఛందంగానే ఆయా పనులకు దూరంగా ఉంటున్నారు. మెగా ఫ్యాన్స్ అందర్నీ ఒకచోటకు చేర్చే సత్తా నాగబాబుకి ఉన్నా కూడా ఆయన జనసేన విషయంలో ఆ చొరవ చూపడంలేదు. జనసేన వేరు, మెగా ఫ్యాన్స్ వేరు అన్నట్టుగానే ఉన్నారు. దీంతో ప్రస్తుతం జనసేనలో నాదెండ్ల మాట మాత్రమే చెల్లుబాటవుతోంది. పవన్ కల్యాణ్ కూడా నాదెండ్ల ఇచ్చే ఫీడ్ బ్యాక్ పైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.