నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెలరోజులపాటు తన ఇంటికి తాను వెళ్లనంటున్నారు. నెలరోజులపాటు తన నియోజకవర్గంలో పర్యటిస్తారట. ఎక్కడికక్కడ ఆ రోజు కార్యకర్తల ఇంటిలోనే బస, టిఫిన్, భోజనం.. అన్నీ. ఏప్రిల్ 11తో ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండుసార్లు ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ప్రతి వీధీ తిరిగారు, కార్యకర్తలను కలిశారు, ప్రజల కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. ఇది మూడో దఫా. ప్రతి ఇంటికి.. ప్రతి గడపకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి.. అనే పేరుతో ఈ కార్యక్రమం మొదలు పెట్టబోతున్నారు.
జగన్ ఆదేశించక ముందే..
“ఎమ్మెల్యేలు ఇంటిలో కూర్చోవద్దు, ప్రజలు ఎమ్మెల్యే ఇంటికి వచ్చి కష్టాలు చెప్పుకునే పరిస్థితి రావొద్దు, ఎమ్మెల్యేలే ప్రజల వద్దకు వెళ్లండి, వారి ఇంటికి వెళ్లండి, వారి సమస్యలు అడిగి తెలుసుకోండి, సచివాలయాలను సందర్శించి ప్రజల సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు వేయండి..” అంటూ ఇటీవల వైసీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు సూచించారు జగన్. వచ్చే రెండేళ్లు ఎమ్మెల్యేలంతా ప్రజల్లో ఉండాలని ఆదేశించారు. అలాంటి వారికే సర్వేలో మంచి మార్కులు పడతాయని, వారికే టికెట్లు ఇవ్వాల్సి వస్తుందని పరోక్షంగా హెచ్చరించారు.
ఈ క్రమంలో చాలామంది తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలాంటి వాళ్లు ఇదివరకే జనాల్లో ఉండటం అలవాటు చేసుకున్నారు, ఇప్పుడు దాన్ని కొనసాగిస్తున్నారు.
జగనే అందరికీ ఆదర్శం..
ఎన్నికల వేళ మాత్రమే నాయకులకు జనం గుర్తుకొస్తారు, మిగతా సమయాల్లో ఎవరి వ్యాపకాలు వారివి, ఎవరి వ్యాపారాలు వారివి. ఇప్పటి వరకూ ప్రజల్లో ఈ అపోహ ఉండేది. కానీ జగన్ ఆ చరిత్ర మార్చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జనంలోనే ఉన్నారు, అధికారంలోకి వచ్చాక నిత్యం జనం గురించే ఆలోచిస్తున్నారు.
కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలకు లోటు లేకుండా చేశారు. రచ్చబండతో తాను జనంలోకి వెళ్దామనుకుంటున్నా ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమం వాయిదా పడుతోంది. అందుకే ఎమ్మెల్యేలను ప్రజలకు అందుబాటులో ఉండాలని చెబుతున్నారు జగన్.
ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచీ ఎమ్మెల్యేలంతా జనంలోకి వెళ్తే.. మరోసారి వారికి గెలుపు నల్లేరుమీద నడక అవుతుంది. దీని కోసం కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటినుంచే కసరత్తులు చేస్తున్నారు. జగన్ చెప్పకముందే రెండుసార్లు నియోజకవర్గాన్ని చుట్టేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, ఇప్పుడు మూడోసారి యాత్రకు రెడీ అవుతున్నారు.
నెలరోజులపాటు ఇంటికి దూరంగా కేవలం కార్యకర్తల ఇళ్లలోనే బస చేస్తూ ప్రజల్లోకి వెళ్లడానికి రెడీ అయ్యారు. రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మిగతా ఎమ్మెల్యేలు కూడా ఇప్పటినుంచే ప్రజాబాట మొదలు పెడితే.. టీడీపీ గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ఖాయం.