మరోసారి టాలీవుడ్ లో ‘డ్రగ్స్’ ప్రకంపనలు

టాలీవుడ్ కు డ్రగ్స్ కేసులు కొత్త కాదు. గతంలో చాలామంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. ఇలాంటి కేసులు అంతిమంగా ఏ మలుపు తీసుకుంటాయో కూడా…

టాలీవుడ్ కు డ్రగ్స్ కేసులు కొత్త కాదు. గతంలో చాలామంది సినీ ప్రముఖులు ఇలాంటి డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిట్ విచారణకు కూడా హాజరయ్యారు. ఇలాంటి కేసులు అంతిమంగా ఏ మలుపు తీసుకుంటాయో కూడా అందరికీ తెలిసిందే. ఇవన్నీ బహిరంగ రహస్యాలే.

ఇప్పుడు మరోసారి టాలీవుడ్ లో 'డ్రగ్స్ గుబులు' పట్టుకుంది. కేపీ చౌదరి అరెస్ట్ తో టాలీవుడ్ లో కొంతమందిలో టెన్షన్ మొదలైంది. రోజులు గడిచేకొద్దీ ఈ కేసు కీలక మలుపులు తీసుకునేలా కనిపిస్తోంది.

డ్రగ్స్ తో కేపీ చౌదరి అడ్డంగా దొరికిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో డ్రగ్స్ తో పాటు, అతడి దగ్గర్నుంచి 4 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో, చర్లపల్లి జైలుకు తరలించారు.

తాజా సమాచారం ప్రకారం, ఈ కేసుకు సంబంధించి కేపీ చౌదరి నోరు విప్పడం లేదని తెలుస్తోంది. అయితే అతడు నోరు తెరవకపోయినా, అతడి సెల్ ఫోన్లు తెరుచుకున్నాయి. అందులో ఇద్దరు హీరోయిన్లు ప్రముఖంగా కనిపిస్తున్నారట. వీళ్లతో పాటు మరో నలుగురు మహిళా ఆర్టిస్టులు, ఒక స్టార్ డైరక్టర్ ఆ ఛాటింగ్స్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ డేటాను విశ్లేషించే పనిలో ఉన్నారు పోలీసులు.

టాలీవుడ్ ప్రముఖులపై డ్రగ్స్ ఆరోపణలు కొత్త కాదు. గతంలో చార్మి, రవితేజ, పూరి జగన్నాధ్, నవదీప్, ముమైత్ ఖాన్ లాంటి ఎఁతో మంది ప్రముఖులు సిట్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈసారి మరో ఇద్దరు హీరోయిన్లు అంటూ వార్తలు రావడం టాలీవుడ్ ను హీటెక్కిస్తోంది. 

దీనికి మరింత బలం చేకురుస్తూ.. కేపీ చౌదరి, కొంతమంది టాలీవుడ్ హీరోహీరోయిన్లు, టెక్నీషియన్స్ తో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అటు ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువైన డ్రగ్స్ కింగ్ పిన్ గాబ్రియేల్ కోసం పోలీసులు వేట ముమ్మరం చేశారు.