ఓటీటీ అంటే రెచ్చిపోవడమేనా.. ఫ్రీడమ్ అంటే ఇదేనా

ఆడ-మగ తేడా లేదు.. హీరో-హీరోయిన్ అనే బేధం లేదు. ఓటీటీ అంటే చాలు, అప్పటివరకు మడికట్టుక్కూర్చున్నోళ్లు కూడా రెచ్చిపోతారు. అదేదో ఎక్కడలేని ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. నిజమే.. ఓటీటీలో స్వేచ్ఛ ఎక్కువ, సెన్సార్…

ఆడ-మగ తేడా లేదు.. హీరో-హీరోయిన్ అనే బేధం లేదు. ఓటీటీ అంటే చాలు, అప్పటివరకు మడికట్టుక్కూర్చున్నోళ్లు కూడా రెచ్చిపోతారు. అదేదో ఎక్కడలేని ఫ్రీడమ్ వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. నిజమే.. ఓటీటీలో స్వేచ్ఛ ఎక్కువ, సెన్సార్ లేని తతంగం అది. ఇంతవరకు ఓకే. మరి సదరు నటీనటుల విచక్షణ ఏమైంది? తీసేవాళ్లకు సిగ్గు లేదనుకుందాం, తెరపై కనిపించేవాళ్ల కామన్ సెన్స్ ఏమైంది?

బూతులు మాట్లాడితే ఫ్రీడమ్ వచ్చేసినట్టా..? విచ్చలవిడిగా ఎక్స్ పోజింగ్ చేసి, శృంగార సన్నివేశాల్లో నటిస్తే స్వేచ్ఛ ప్రాప్తించినట్టేనా? ఇదేనా నటీనటుల విచక్షణ? వాళ్ల జ్ఞానం ఇంతేనా? లేక డబ్బులిస్తే దేనికైనా రెడీ అనే మనస్తత్వంతో అంతా కొట్టుమిట్టాడుతున్నారా?

అంతా ఆ తానులో ముక్కలే..

ఈ విషయంలో ఎవరో ఒక్కర్ని నిందించడం లేదు. అందరూ అలానే ఉన్నారు. అందరూ కళ్లు మూసుకొని పాలు తాగుతున్న బాపతే. బయటకొచ్చి భావప్రకటన, బోల్డ్ కంటెంట్ అంటూ కబుర్లు చెబుతున్నవాళ్లే. వెంకటేష్ ఏమైనా నిన్నగాకమొన్నొచ్చిన యంగ్ హీరోనా. పాతికేళ్ల ప్రస్థానాన్ని దాటొచ్చాడు.. ఆడియన్స్ లో తనకు ఎలాంటి ఇమేజ్ ఉందో స్పష్టంగా తెలిసిన హీరో. మరి ఇలాంటి హీరోతో బూతులు చెప్పించొచ్చా.. బెడ్ రూమ్ సీన్స్ తీయొచ్చా.. తీసేవాడికి బుద్ధి లేదనుకుందాం, వెంకీకి ఆలోచన ఉండాలి కదా. అదేదో దేశోద్ధారణ అన్నట్టు మళ్లీ దానికో సమర్థన.

రాత్రి నుంచి తమన్న ట్రెండ్ అవుతోంది. ఇన్నాళ్లూ ఆమెను పవిత్రంగా, ఓ రకమైన ఆరాధన భావంతో చూసిన వాళ్లంతా ముక్కున వేలేసుకోవాల్సిందే. తమన్న లేడీ ఫ్యాన్స్ అయితే కళ్లు మూసుకోవాల్సిందే. తెరపై చిన్న క్లీవేజ్ షోకు కూడా ఇబ్బంది పడతానని, లిప్ కిస్సులైతే చచ్చినా చేయనంటూ స్టేట్ మెంట్స్ ఇచ్చిన మిల్కీబ్యూటీ, ఓటీటీకి వచ్చేసరికి రెచ్చిపోయింది. వెండితెరపై తన సినిమాలు చూసే ఆడియన్స్, ఓటీటీలో తన శృంగార దృశ్యాలు చూడరనే భ్రమలో ఉందేమో ఈ బ్యూటీ. ఆమె భ్రమల సంగతి అటుంచితే, మొన్నటివరకు మడికట్టుక్కూర్చున్న ఆమె సిద్ధాంతాలు ఏమయ్యాయి.. ఆమె ఒంటిపై దుస్తుల్లా, ఇన్నాళ్లూ ఆమె పాటించిన విలువలు ఎందుకలా ఎగిరిపోయాయి.

అసలు ఓటీటీ అంటే బూతు అని చెప్పిందెవరు..?

బూతులు లేకపోతే వెబ్ సిరీస్ లేదనే స్థాయికి దిగజారారు ఓటీటీ మేకర్స్. నెరేషన్ స్టేజ్ లోనే ఎన్ని సీన్లు ఉన్నాయి, ఎన్ని బూతులున్నాయని అడిగే దౌర్భాగ్యపు మేకర్స్ ఉన్నారు ఈ వింగ్ లో. తమన్న నటించిన వెబ్ సిరీస్ తో పాటు, సరిగ్గా అదే టైమ్ లో ఇంకో ఓటీటీలో మరో కంటెంట్ ప్రత్యక్షమైంది. మహి వి రాఘవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఒరిజినల్ లో, మహిళలతో విచ్చలవిడిగా బూతులు చెప్పించాడు ఈ దర్శకుడు. ఈ సినిమా ట్రయిలరే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. యూట్యూబ్ లో ఉన్న ఈ ట్రయిలర్ ను సౌండ్ బయటకు వినిపించేలా చూడలేం.

ఇక రానా నాయుడులో వెంకటేష్ సంగతి సరేసరి. ఆ టైమ్ లో వెంకీపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ కూడా నటించింది. ఇలా చెప్పుకుంటూపోతే ఒకరిద్దరు కాదు.. మొన్నటి కియరా అద్వానీ నుంచి నిన్నటి సమంత వరకు అంతా బోల్డ్ పేరిట రెచ్చిపోయినవాళ్లే. శృంగార సన్నివేశాలు లేకపోతే, ఓటీటీ సిరీస్ లేదా ఒరిజినల్ ఫిలిం తీయడం దండగ అన్నట్టు పరిస్థితిని మార్చేశారు ఈ సెక్షన్ మేకర్స్.

నిజానికి స్వేచ్ఛ అంటే ఇది కాదు, బోల్డ్ లేదా సెన్సార్ కంటెంట్ అంటే సెక్స్ మాత్రమే కాదు. సెన్సార్ కత్తెర పడుతుందని భావించే అంశాల్ని ఓటీటీలో చర్చించాలి. శృంగారం, హింస లేకపోతే ఓటీటీ కంటెంట్ క్లిక్ అవ్వదు, ప్రేక్షకులు ఇదే కోరుకుంటున్నారనే భ్రమ నుంచి బయటకు రావాలి. ఎలాంటి అసభ్యత, బోల్డ్ సీన్స్/డైలాగ్స్ లేని సిరీస్ లు కూడా హిట్టయిన విషయాన్ని గుర్తించాలి.

హీరోలు, హీరోయిన్లు, మేకర్స్.. వీటిని ఇలానే ప్రోత్సహిస్తే రాబోయే తరాలు నాశనం అవుతాయనే విషయాన్ని తెలుసుకోవాలి. బోల్డ్ సీన్లు, సెక్స్ వీడియోలు ఇప్పటి తరానికి ఒక్క క్లిక్ తో అందుబాటులోకి వచ్చేశాయనే వితండవాదాన్ని పక్కనపెట్టాలి. నటీనటులు, మేకర్స్, ఓటీటీ సంస్థలు.. తమ వ్యక్తిగత బాధ్యతగా ఫీలై,  ఇలాంటివి అరికట్టినప్పుడు మాత్రమే ఓటీటీ మనుగడ సాధ్యం. లేదంటే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్టే.