అఖండ, అనకొండ, పప్పుండ..!

కొడాలి నాని ప్రెస్ మీట్లో రచ్చ రచ్చ చేస్తే, అసెంబ్లీలో రోజా.. అఖండ, అనకొండ, పప్పుండ అంటూ చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ని చెడుగుడు ఆడేసుకున్నారు. అసెంబ్లీ చివరిరోజు ఫైర్ బ్రాండ్ గా మరోసారి…

కొడాలి నాని ప్రెస్ మీట్లో రచ్చ రచ్చ చేస్తే, అసెంబ్లీలో రోజా.. అఖండ, అనకొండ, పప్పుండ అంటూ చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ని చెడుగుడు ఆడేసుకున్నారు. అసెంబ్లీ చివరిరోజు ఫైర్ బ్రాండ్ గా మరోసారి నిరూపించుకున్నారు రోజా. ఆంధ్రప్రదేశ్ అప్రాప్రియేషన్ బిల్ పై మాట్లాడటం మొదలు పెట్టిన రోజా.. మెల్లగా చంద్రబాబు, లోకేష్ పై విరుచుకు పడ్డారు.

టీడీపీలో బాలయ్య అఖండ అని, ఆయన బావ చంద్రబాబు అనకొండ అని, అల్లుడు లోకేష్ పప్పుండ అంటూ ఎద్దేవా చేశారు రోజా. ఈ ముగ్గురూ కలసి వచ్చి మా బంగారు కొండ జగన్ ని ఓడిస్తామని చెబుతున్నారని, కానీ టీడీపీ బ్యాచ్ ని గుండ గుండ చేయడానికి జనాలు రెడీగా ఉన్నారని అన్నారు.

ఎన్నికలు పెట్టండి మేం గెలిచి చూపిస్తామని ఒకరంటున్నారని, మరొకరు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చబోమని చెబుతున్నారని, పొత్తులు లేకుండా పోటీ చేయడానికి ధైర్యం చేయలేని జొన్నపొత్తులన్నీ కలసి జగన్ ని ఏం చేస్తారని ఎద్దేవా చేశారు. మూతి మీద మీసం ఉండే ఏ పార్టీ అయినా సింగిల్ గా వస్తుందా అంటూ సవాల్ విసిరారు. జగన్ సింహంలా సింగిల్ గా వస్తారని, ఆ పార్టీలు కూడా సింగిల్ గా రావాలని సవాల్ చేశారు.

సోషల్ మీడియాలో బతికేస్తూ డిపాజిట్లు రాని పార్టీ ఒకటని, ఎల్లో మీడియాపై ఆధారపడిన ఎల్లో పార్టీ మరొకటని ఎద్దేవా చేశారు. ఎవరెవరు కలసి వచ్చినా.. ఎదిరించి నిలిచే ధైర్యం టన్నుల కొద్దీ తమ నాయకుడికి ఉందన్నారు రోజా.

తిరుపతిలో వెంకన్న ఫేమస్, బెజవాడలో కనకదుర్గమ్మ ఫేమస్, విశాఖలో సింహాద్రి అప్పన్న ఫేమస్, సుపరిపాలనలో జగనన్న ఫేమస్ అని చెప్పారు రోజా. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా జగన్ పాలనను మెచ్చుకుంటున్నారని, ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు.

జె-బ్రాండ్ల పేరుతో టీడీపీ బ్యాచ్ రచ్చ చేస్తోందని, కానీ అవన్నీ సి-బ్రాండ్లేనని అన్నారు రోజా. బీరుని హెల్త్ డ్రింక్ గా ప్రమోట్ చేసింది బాబు కాదా అని ప్రశ్నించారు. సాయంత్రం అయితే పెగ్గేసి పేకాట ఆడండి అని చంద్రబాబు ఉచిత సలహాలిస్తుంటారని చెప్పారు.

మొత్తమ్మీద అసెంబ్లీ చివరి రోజు రోజా మరింత ఘాటుగా మాట్లాడారు. ఓవైపు జగన్ ని ఆకాశానికెత్తేస్తూనే.. మరోవైపు చంద్రబాబుపై మండిపడ్డారు. అఖండ, అనకొండ, పప్పుండ అంటూ సెటైర్లు పేల్చారు.