అన్న మరణం.. 24 ఏళ్లుగా తమ్ముడు ఉద్యోగం

గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. 24 ఏళ్ల సర్వీసు కూడా పూర్తి చేసుకున్నాడు. అతడి చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకొని బయటకెళ్లారు. కట్ చేస్తే, అతడు అసలు ఉపాధ్యాయుడే కాదని…

గౌరవప్రదమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాడు. 24 ఏళ్ల సర్వీసు కూడా పూర్తి చేసుకున్నాడు. అతడి చేతుల మీదుగా ఎంతోమంది విద్యార్థులు విద్యాసంవత్సరాలు పూర్తి చేసుకొని బయటకెళ్లారు. కట్ చేస్తే, అతడు అసలు ఉపాధ్యాయుడే కాదని తేలింది. 24 ఏళ్ల ఉద్యోగ జీవితం తర్వాత అతడు నకిలీ ఉపాధ్యాయుడిగా తేలాడు. కర్నాటకలో జరిగింది ఈ ఘటన.

పోలికలతో ఉద్యోగం కొట్టేశాడు..

మైసూరు జిల్లాకేఆర్ నగర్ తాలూకా హెబ్బాళు గ్రామానికి చెందిన లోకేష్ గౌడ టీచర్ పోస్టుకు సెలక్ట్ అయ్యాడు. 1994-95 నోటిఫికేషన్ కు సంబంధించి అతడు స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆర్డర్ కూడా వచ్చింది. అయితే విధుల్లోకి చేరడానికి కొన్ని రోజుల ముందు లోకేష్ చనిపోయాడు.

అయితే లోకేష్ తమ్ముడు లక్ష్మణ్ ఈ విషయాన్ని ప్రభుత్వ అధికారులకు చెప్పలేదు. తనే లోకేష్ గా మారిపోయాడు. అన్నదమ్ముల పోలికలు దాదాపు ఒకేలా ఉండడంతో ఎవ్వరూ అనుమానించలేదు. అలా లోకేష్ స్థానంలో లక్ష్మణ్ ఉపాధ్యాయుడు అయిపోయాడు. తనే లోకేష్ అంటూ దాదాపు 24 ఏళ్లుగా మేనేజ్ చేస్తూ వస్తున్నాడు.

అయితే 2000 సంవత్సరంలో ఓ జర్నలిస్టుకు మాత్రం ఎందుకో అనుమానం వచ్చింది. అతడు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు. లోకాయుక్తకు ఫిర్యాదు చేశాడు. లోకాయుక్త ఆదేశంతో లక్ష్మణ గౌడపై విచారణ మొదలైంది. అతడు నకిలీ ఉపాధ్యాయుడు అని తేలింది. ఈ క్రమంలో తను చేసిన తప్పు బయటపడకుండా ఉండేందుకు.. తన వంశంలో లక్ష్మణ గౌడ అనే వ్యక్తి లేకుండా, కేవలం లోకేష్ మాత్రమే ఉన్నట్టు క్రియేట్ చేశాడు.

కానీ లోతైన విచారణతో అసలు మోసం బయటపడింది. లక్ష్మణ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లూ ఓ నకిలీ ఉపాధ్యాయుడు తమ మధ్య ఉన్నాడనే విషయం తెలుసుకొని తోటి టీచర్లు షాక్ అవుతున్నారు.