‘ఫ్యామిలీ ప్యాకేజీ’: కాంగ్రెస్ బాటలోనే బిజెపి!

భారతీయ జనతా పార్టీ తమ గురించి తాము సిద్ధాంతాలు గల పార్టీ అని చెప్పుకుంటుంది. సిద్ధాంత బలం మీదనే మనుగడ సాగిస్తాం అని కూడా చెప్పుకుంటుంది. మాటల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు గానీ.. అదంతా గతించిపోయిన…

భారతీయ జనతా పార్టీ తమ గురించి తాము సిద్ధాంతాలు గల పార్టీ అని చెప్పుకుంటుంది. సిద్ధాంత బలం మీదనే మనుగడ సాగిస్తాం అని కూడా చెప్పుకుంటుంది. మాటల్లో ఇప్పటికీ చెప్పుకుంటారు గానీ.. అదంతా గతించిపోయిన వైభవం. ఇప్పుడు భాజపా కూడా వ్యక్తిపూజకు పరిమితమైన పార్టీ. అచ్చంగా కాంగ్రెసు బాటలోనే వ్యక్తి ఆరాధనలో తరించిపోతున్న పార్టీగా మారిపోయింది. 

తమకు అడ్డు వచ్చే వారిని పక్కకు తప్పించడానికి 75 ఏళ్ల తర్వాత ఎన్నికల రాజకీయాల్లోకి ఉండొద్దు అనే నిబంధనను ఆ పార్టీ అనుసరిస్తుంది. అదే తరహాలో కుటుంబంలోని వారికి టికెట్లు ఇవ్వడం గురించి కూడా సిద్ధాంతాలు మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు తెలంగాణ ఎన్నికల విషయానికి వచ్చేసరికి అచ్చంగా కాంగ్రెసు బాటలోనే వారు కూడా ఫ్యామిలీ ప్యాకేజీ కింద టికెట్లు ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా కనిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ పైకి కబుర్లు చెప్పడంలో మాత్రం.. ఒక కుటుంబంలో ఒక్కరికే టికెట్ అనే మాట వల్లిస్తుంది. ఈ సారి మాత్రం వేరే గతిలేక దానిని పూర్తిగా తుంగలో తొక్కారు. ఉత్తం కుమార్ రెడ్డి-ఆయన భార్య పద్మావతి, మైనంపల్లి హన్మంతరావు-కొడుకు రాహుల్ లకు టికెట్లు ఇచ్చేశారు. ఇంకా ఎన్ని ఇలాంటివి ఉంటాయో తెలియదు.

కాంగ్రెస్ పార్టీనే తమకు ఆదర్శం అని భాజపా తలపోస్తున్నట్టుగా ఉంది. ఆ పార్టీలో కూడా దంపతులకు టికెట్లు పంచేసే ఆలోచన సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈటల రాజేందర్, ఆయన భార్య జమున ఇద్దరూ కూడా ఎమ్మెల్యే ఎన్నికల్లోనే పోటీచేయాలని అనుకుంటున్నారు. అలాగే కిషన్ రెడ్డి పోటీకి దిగేది కొంత సందేహంగానే ఉంది. పార్టీ ఆదేశాల మేరకు ఆయన ఖచ్చితంగా బరిలోకి దిగాల్సి వచ్చినా కూడా.. భార్య కావ్య రెడ్డికి కూడా ఒక సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. 

అలాగే మునుగోడులో సిటింగ్ స్థానానికి రాజీనామా చేసి, కమలాన్ని నమ్ముకుని పరాభవం పొందిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఎల్బీనగర్, ఆయన భార్య లక్ష్మికి మునుగోడు టికెట్లు ఇస్తారని కూడా అంటున్నారు.

ఫ్యామిలీ ప్యాకేజీలు కాకుండా మరికొన్ని కీలక నిర్ణయాలు బిజెపిలో చోటుచేసుకుంటున్నాయి. ఎంపీ బండి సంజయ్ ను కరీంనగర్ బరిలో దించేందుకు ఆ పార్టీ ఆలోచిస్తోంది. అలాగే మాజీ ఎంపీ విజయశాంతి.. ఏకంగా కేసీఆర్ మీద పోటీచేయడానికి తన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నప్పటికీ.. బిజెపి కూడా.. కాంగ్రెస్ బాటలో కుటుంబాలకు రెండేసి టికెట్లకు సిద్ధపడడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.