ఇటీవల ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ సాఫ్ట్‌వేర్ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ హౌస్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నేతృత్వం వహించనున్నారు. కమిటీ సభ్యులుగా భాగ్యలక్ష్మి, అబ్బయ్య చౌదరి, కె. పార్థసారధి, అమర్నాథ్, మేరుగ నాగార్జున, మద్దాల గిరిధర్‌ను నియమించారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఆ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాలుగేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్‌వేర్ కొనుగోలు చేశారని ఆరోపించారు. మమతాబెనర్జీ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టించాయి. వ్యక్తుల గోప్యతకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
గతంలో తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నట్టు వైసీపీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వివిధ రాజ్యాంగ వ్యవస్థలకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. మమతాబెనర్జీ ఆరోపణలు నాటి వైసీపీ నేతల ఫిర్యాదులకు బలం చేకూర్చాయి. ఈ వ్యవహారంపై ఏపీ అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరిగింది. పెగాసస్ వ్యవహారంపై నిగ్గు తేల్చాల్సిందేనని సభ్యులంతా ముక్తకంఠంతో కోరారు.
ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా మద్దతు పలికారు. అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందిస్తూ సభ్యుల ఆందోళనను, విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని రెండు రోజుల్లో హౌస్ కమిటీ వేస్తానని ప్రకటించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలకు చివరి రోజు కావడంతో స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన నేతృత్వంలో హౌస్ కమిటీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది.