తెర కాపాడుకోవాలనుకుంటే, థియేటరే గల్లంతైంది

తానొకటి తలస్తే, దైవం మరొకటి తలచిందనేది సామెత. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ విషయంలో ఇదే జరిగింది. థియేటర్ లో తెరను కాపాడుకునేందుకు స్క్రీన్ ముందు మేకులు ఏర్పాటు చేసింది యాజమాన్యం. అయితే ఊహించని విధంగా…

తానొకటి తలస్తే, దైవం మరొకటి తలచిందనేది సామెత. విజయవాడ అన్నపూర్ణ థియేటర్ విషయంలో ఇదే జరిగింది. థియేటర్ లో తెరను కాపాడుకునేందుకు స్క్రీన్ ముందు మేకులు ఏర్పాటు చేసింది యాజమాన్యం. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఏకంగా థియేటరే ధ్వంసం అయింది. తెరను కాపాడుకుందాం అనుకుంటే, ఏకంగా థియేటరే పోయింది.

ఇంతకీ ఏం జరిగింది..

2 రోజుల కిందటి సంగతి. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కోసం థియేటర్లన్నీ రెడీ అవుతున్నాయి. అభిమాన హీరోలు కలిసి నటించిన సినిమా కావడంతో, ఫ్యాన్స్ ఆటోమేటిగ్గా స్టేజ్ ఎక్కేస్తారు, తెర ముందు గంతులేస్తారు. మొన్నటికిమొన్న రాధేశ్యామ్ సినిమా రిలీజైనప్పుడు, ఓ థియేటర్ లో ప్రభాస్ ఎంట్రీ సీన్ కు తెరపై పాలాభిషేకం చేశారు ప్రభాస్ ఫ్యాన్స్. దీంతో తెర మొత్తం కంపు అయింది. ఓనర్ కు 15 లక్షలు ఖర్చయింది.

ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు విజయవాడలోని గవర్నర్ పేటలో ఉన్న అన్నపూర్ణ థియేటర్ యాజమాన్యం ప్రత్యేక చర్యలు చేపట్టింది. తెరపైకి ఎవ్వరూ ఎక్కకుండా ఉండేందుకు, తెర ముందు మేకులు ఏర్పాటుచేసింది. ఓ ప్లైవుడ్ కు మేకులు కొట్టి, ఆ మేకుల చాపను తెర ముందు పెట్టింది. దీంతో తెరను కాపాడుకున్నామంటూ ఓనర్ ఊపిరి పీల్చుకున్నారు.

టైమ్ రానే వచ్చింది. ఈరోజు ఆర్ఆర్ఆర్ రిలీజైంది. అన్నపూర్ణ థియేటర్ కు జనం పోటెత్తారు. తెర సేఫ్ అని యాజమాన్యం అనుకుంది. కానీ ఊహించని విధంగా సాంకేతిక సమస్య తలెత్తింది. ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తిస్థాయిలో ప్రదర్శించలేకపోయారు. దీంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

కోపోద్రిక్తులైన అభిమానులు అన్నపూర్ణ థియేటర్ ను ధ్వంసం చేశారు. కుర్చీల్ని నాశనం చేశారు. అద్దాల్ని పగలగొట్టారు. రెయిలింగ్ విసిరి అవతల పడేశారు. దొరికిన ప్రతి వస్తువును పాడుచేశారు. స్క్రీన్ పాడవుతుందని మేకుల ఫార్ములా ఫాలో అయితే.. సాంకేతిక సమస్య తలెత్తి షో పడక, ఏకంగా థియేటర్ పాడు చేశారు. థియేటర్ లో ఓ వైపు జాగ్రత్తలు తీసుకుంటే, మరోవైపు నష్టం జరిగిపోయింది.