ప‌వ‌న్‌లో భ‌యం…పొత్తుల‌పై మారిన స్వ‌రం!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో భ‌యం ప‌ట్టుకుంది. ఇటీవ‌ల పొత్తుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా న‌ష్టం చేస్తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విష‌యం ఆయ‌న దృష్టికి జ‌న‌సేన నాయ‌కులు తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. దీంతో పొత్తుల‌పై ఆయ‌న…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌లో భ‌యం ప‌ట్టుకుంది. ఇటీవ‌ల పొత్తుల‌పై ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా న‌ష్టం చేస్తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ విష‌యం ఆయ‌న దృష్టికి జ‌న‌సేన నాయ‌కులు తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం. దీంతో పొత్తుల‌పై ఆయ‌న పెద్ద‌గా మాట్లాడ‌లేదు. కేవ‌లం ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో మాత్ర‌మే ఎలా పోటీ చేయాల‌నేది నిర్ణ‌యించుకోలేద‌న్నారు. సింగిల్‌గా పోటీ చేయాల‌ని త‌న‌ను వైసీపీ డిమాండ్ చేస్తోంద‌ని, బ‌రిలో ఎలా వుంటే మీకెందుకు అని మాత్ర‌మే ప్ర‌శ్నించారు.

సుదీర్ఘ ప్ర‌సంగంలో జ‌న‌సేన‌కు అధికారం ఇవ్వాల‌ని, తమ పాల‌న‌లో పేద‌లు, అణ‌గారిన వ‌ర్గాల కోసం ఏం చేయ‌నున్నారో చెప్పుకొచ్చారు. ఇది ఆయ‌న ప్ర‌సంగంలో వ‌చ్చిన మార్పుగా గ‌మ‌నించొచ్చు. గ‌తంలో ఖ‌చ్చితంగా పొత్తుల‌తోనే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని, సింగిల్‌గా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే వైసీపీ ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీల‌నివ్వ‌న‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. త‌న‌కు సీఎం ప‌ద‌విని చంద్ర‌బాబు ఎందుకిస్తార‌నే ప్ర‌శ్న ప‌వ‌న్ నుంచే రావ‌డంతో జ‌న‌సేన శ్రేణుల నుంచే వ్య‌తిరేక‌త ఎదురైంది.

ఇలాగైతే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలనివ్వ‌కుండా అడ్డుకోవ‌డం దేవుడెరుగు, మ‌న ఓట్లే వైసీపీ వైపు పోతాయ‌నే హెచ్చ‌రిక శ్రేయోభిలాషుల నుంచి ప‌వ‌న్‌కు వెళ్లింది. దీంతో ఆయ‌న అప్ర‌మ‌త్తం అయిన‌ట్టు నిన్న‌టి ప్ర‌సంగంలో క‌నిపించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల ముందు పొత్తుల గురించి మాట్లాడుకోవ‌చ్చ‌ని, అంత వ‌ర‌కూ జ‌న‌సేనే బ‌రిలో వుంటుంద‌నే సంకేతాలు ఇవ్వ‌డం ద్వారా శ్రేణుల్లో జోష్ నింపొచ్చ‌నే స‌ల‌హా ప‌వ‌న్‌కు ఇచ్చిన‌ట్టు తెలిసింది. అందుకే వైసీపీకి ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్థి జ‌న‌సేనే అని ప‌వ‌న్ బ‌లంగా నిన్న‌టి స‌భ‌లో చెప్పారు.

శుభ‌మా అని వారాహి యాత్ర ప్రారంభం సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో మ‌రోసారి చంద్ర‌బాబు ప‌ల్ల‌కీ మోయాల‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌పోవ‌డంతో జ‌న‌సేన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఊపిరి పీల్చుకున్నారు. ఎప్ప‌ట్లాగే సీఎం వైఎస్ జ‌గ‌న్ టార్గెట్‌గా ప‌వ‌న్ ప్ర‌సంగం సాగింది. చంద్ర‌బాబు ఊసే ఎత్త‌లేదు. మొత్తానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ పొత్తుల‌పై ఎంతో నిగ్ర‌హాన్ని పాటించార‌ని జ‌న‌సేన నేత‌లు చెబుతున్నారు. కానీ ప‌వ‌న్ ప్ర‌సంగం టీడీపీకి అంతగా రుచించ‌డం లేదు.

జ‌గ‌న్‌ను విమ‌ర్శించిన‌ప్ప‌టికీ, త‌మ ప‌ల్ల‌కీ మోస్తాన‌ని ప‌వ‌న్ చెప్ప‌క‌పోవ‌డం టీడీపీని స‌హ‌జంగానే నిరుత్సాహానికి గురి చేస్తోంది. ఎన్నిక‌ల్లో ఎలా పోటీ చేయాలో ఇంకా నిర్ణ‌యించుకోలేద‌ని ప‌వ‌న్ చెప్ప‌డాన్ని టీడీపీ త‌ప్పు ప‌డుతోంది. ఇదే రీతిలో ప‌వ‌న్ పొత్తుల ఊసే ఎత్త‌క‌పోతే టీడీపీ మీడియా మ‌రో ర‌కంగా ప‌వ‌న్‌ను అభాసుపాలు చేస్తుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.