నవీన్ పట్నాయక్, అరవింద్ కేజ్రీవాల్, జగన్మోహన్ రెడ్డి…ఈ ముగ్గురు ముఖ్యమంత్రులు ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో మంచి ముఖ్యమంత్రులుగా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఈ ముగ్గురి వ్యవహారాలను ఓసారి విహంగవీక్షణం చేస్తే కొన్ని కామన్ పాయింట్లు కనిపిస్తాయి.
నవీన్ పట్నాయక్ విదేశాల్లో చదువుకున్నాడు. పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలకు స్నేహితుడు.రాజకీయాల్లోకి తండ్రివారసత్వంగా వచ్చి, స్వంత పార్టీ పెట్టుకుని, మంచి పాలన అందిస్తూ అవిశ్రాంతంగా గెలుస్తూ వస్తున్నారు.
అరవింద్ కేజ్రీవాల్. ఉన్నతమైన చదువులు చదువుకున్నారు. మంచి పరిచయాలు, భావాలు వున్న వ్యక్తి. మంచి పాలన అందించాలనే తపన వున్న నాయకుడు.
జగన్మోహన్ రెడ్డి ఇటు పారిశ్రామికవేత్తగా సక్సెస్ లు చవి చూస్తే, రాజకీయాల్లో కూడా విజయాలు దక్కించుకున్నారు. తండ్రి వారసత్వం తీసుకుని రాజకీయాల్లో తనదంటూ ఒక పార్టీ పెట్టుకుని, అధికారం అందిపుచ్చుకుని, మంచి పాలన అందించాలనే తపన పడుతూ ముందుకు సాగుతున్నారు.
ఈ ముగ్గురికి ప్రజాదరణ దక్కడం అన్న పాయింట్ ను పక్కన పెడితే ముగ్గురి వ్యవహారశైలి కూడా దాదాపు ఒకేమాదిరిగా వుంటుంది. ముఖ్యంగా కొన్ని పాయింట్లలో.
ఈ ముగ్గురూ ప్రాంతీయపార్టీల నేతలు కావడం కీలకమైన సంగతి. ప్రాంతీయపార్టీల నేతలకు వున్న స్వేచ్ఛ జాతీయ పార్టీ ముఖ్యమంత్రులకు వుండదు. ముఖ్యంగా కొత్త కొత్త ఆలోచనలు అమలు చేయడంలో. ఒక్క వైఎస్ మినహా మరే కాంగ్రెస్ ముఖ్యమంత్రి స్వంతంత్రించి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. అయితే జగన్, కేజ్రీవాల్, నవీన్ ల విషయంలో ఇంతకన్నా కీలకమైన పాయింట్ ఏమిటంటే, జాతీయ స్థాయిలో పెద్దగా హడావుడి వుండదు.
నవీన్ పట్నాయక్ గురించిన వార్తలు చాలా తక్కువగా వస్తుంటాయి జాతీయ స్థాయిలో. ఆయన చాలా సైలంట్ గా పని చేసుకుంటూ వెళ్లడం అన్నది స్టయిల్ గా పెట్టుకున్నారు. అసలు నవీన్ పట్నాయక్ ఢిల్లీ వెళ్లారా? జాతీయ మీడియాతో మాట్లాడారా? లేదా జాతీయ మీడియాలో ఎన్నిసార్లు నవీన్ వార్తలు గట్టిగా కనిపించాయి అంటే గూగుల్ లో కాస్త ఎక్సర్ సైజ్ చేయాల్సిందే.
అరవింద్ కేజ్రీవాల్ పేరు, పాలనా వ్యవహారాలు గతంలో కాస్త గట్టిగా వినిపించేవి కానీ రాను రాను ఆయన కూడా సైలంట్ అయిపోయారు. జగన్ మోహన్ రెడ్డి మీడియాతో చాలా తక్కువగా ఇంట్రాక్ట్ అవుతారు. ఆయన వైపు నుంచి కన్నా ఆయన వ్యతిరేక వర్గాల వైపు నుంచే మీడియాలో హడావుడి ఎక్కువ వుంటుంది. తను చేయాలనుకుంటున్నవి చేసుకుంటూ వెళ్లిపోవడం తప్ప ఇంకోటి ఏదీ జగన్ పట్టించుకున్నట్లు కనిపించదు.
ఇక ఈ ముగ్గురి విషయంలో ప్రతిపక్షాల వైపు నుంచి చూస్తే దాదాపు ఒకటే సినేరియా కనిపిస్తుంది. అది వారి వారి ప్రాంతాల్లో ప్రతిపక్షాలు వీక్ కావడం. ముఖ్యంగా ప్రజల సమస్యలపై పోరాటాలు సాగించే అవకాశాలు తక్కువగా వుండడం. ఒరిస్సాలో ఒకప్పుడు బలంగా వుంటే కాంగ్రెస్ ఇప్పుడు వీక్ అయిపోయింది. భాజపా అటు ఇటు ఊగుతూ వుంటుంది.
ఆంధ్రలో తేదేపా ఎంతసేపూ విమర్శలు తప్ప, కనస్ట్రక్టివ్ కార్యాచరణకు దూరంగా వుంది. అమరావతి ఇస్యూ తరువాత చంద్రబాబు కదలివచ్చింది దేనికీ అంటే కేవలం రామతీర్థం సమస్య మీదనే. అంతే తప్ప ప్రజా సమస్యలపై పోరు సాగించే అవకాశం జగన్ ఇవ్వడం లేదు.
సూళ్లు, ఆసుపత్రులు, రోడ్లు చకచకా బాగు చేయిస్తున్నారు. ఇవి జనాలకు కనీసపు సమస్యలు. కరెంట్, వాటర్ సమస్య లేదు. ఇసుక దొరుకుతోంది. ఇక జనాలకు ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమపథకాలు వుండనే వున్నాయి. ఢిల్లీలో కరోనా కాస్త సమస్యగా వుండేది. దానిపై కేజ్రీవాల్ గట్టి పోరే సాగించారు. దాంతో అది అనుకూల అంశమైంది.
ఇంకో ఇంట్రస్టింగ్ అంశం ఏమిటంటే కేజ్రీవాల్ కు భాజపా కీలకప్రతిపక్షం. అదే నవీన్ విషయానికి వస్తే అటు ఇటు దోబూచులాడుతూ, ఎప్పటికైనా అధికారం దొరక్కపోతుందా అని చూస్తున్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రకు వచ్చేసరికి జగన్ తో లోపాయకారీ ఒప్పందం లేదు అని చాటడానికి ప్రయత్నాలు జరుగుతూ వుంటాయి. ప్రధాన ప్రతిపక్షం తామే అని ఫిక్స్ చేసుకునే దిశగా ప్రయత్నాలు వుంటాయి.
సర్వేలో మూడు మంచి ప్లేస్ లు అందుకున్న ఈ ముగ్గురు సిఎమ్ లు పాలించేవి చిన్న రాష్ట్రాలే కావడం విశేషం. తెలంగాణ విడిపోయాక ఆంధ్ర చిన్న రాష్ట్రం అయిపోయింది. అయితే ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా ఢిల్లీ, ఒరిస్సాల కన్నా ఆంధ్రనే పెద్దది. అర్బనైజేషన్ పరంగా చూసుకుంటే ఢిల్లీ ముందు వుంటే ఒరిస్సా చివర్న వుంటుంది. వెనుకబడిన ప్రాంతాలు ఆంధ్ర కన్నా ఒరిస్సాలో ఎక్కువ వుంటాయి.
ఇలాంటి చిన్న చిన్న తేడాలు వున్న చిన్న, మీడియం రాష్ట్రాలకు సిఎమ్ లు అయిన ముగ్గురు పనితీరు విషయంలో పెద్ద పెద్ద రాష్ట్రాల సిఎమ్ ల కన్నా మంచి మార్కులు తెచ్చుకోవడం విశేషం. బహుశా ఈ పనితీరుకు కారణం ముగ్గురు సిఎమ్ ల వ్యక్తిగత వర్కింగ్ స్టయిల్ నే కారణం కావచ్చు. ఇదే రీతిగా ఈ ముగ్గురి పాలన జనామోదం దిశగా సాగితే ముగ్గురూ మరో టెర్న్ సిఎమ్ లు గా వుండే అదృష్టం దక్కించుకుంటారేమో ?