గుంటూరు తూర్పు డివిజన్ లో ఆదివారం ఉదయం పది గంటల సమయంలో ఒక దేవాలయంలో విగ్రహాలు మాయం అయ్యాయి… వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. గంటల వ్యవధిలోనే నిందితుడిని పట్టుకున్నారు. అతడో బాల నేరస్తుడు. నేరాలనే వృత్తిగా సాగిస్తున్న వాడు. పేరు దుర్గా రావు.. రౌడీగా పేరును దుర్గాగా మార్చుకున్నాడు. తాగి మరీ ఆలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లాడు.
ఇక్కడ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి, నిందితుడిని పట్టుకున్నారు కాబట్టి.. సరిపోయింది. ఒకవేళ అతడు దొరక్కపోయి ఉంటే..? ఈ పాటికి రచ్చ ఏ స్థాయిలో జరిగేదో వేరే చెప్పనక్కర్లేదు!
దొంగతనాలకు అలవాటు పడిన ఒక వ్యక్తి, ఆలయంలో విగ్రహాలను ఎత్తుకెళ్లాడు. ఆ సంఘటనను పూజారి భార్య కూడా చూసిందట. అలాగే ఆలయ పరిసరాల్లో చాలా మంది ఉన్నారు. వారు కూడా చూశారు. అయితే దొంగ తాగి ఉన్నాడు.. అతడు ఎత్తుకెళుతున్నది దేవుడి విగ్రహాలే అయినప్పటికీ.. వాళ్లెవరూ అడ్డు వెళ్లలేదు. ఎందుకంటే తాగి ఉన్నాడు కాబట్టి ఏమైనా చేస్తాడని భయం!
ఈ కేసులో పోలీసులు రంగంలోకి వెంటనే రంగంలోకి దిగి.. ఆ దొంగను పట్టుకున్నారు. లేకపోతే.. ఇది ఏపీలో ఇలాంటి అంశాల కోసం వేచి చూస్తున్న రాజకీయ పార్టీలకు పెద్ద ఆయుధం దొరికేసేది.
ఒక దొంగ తాగి.. విగ్రహాలను ఎత్తుకెళ్లిన వైనాన్ని కూడా హిందూ మతంపై దాడిగా అభివర్ణించడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, సోమూ వీర్రాజు వంటి మహా నేతలు వెనుకాడేవారు. వారు చెబుతున్న ఏపీలో ఆలయాలపై వందల దాడుల్లో ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి!
ఇలాంటి ఉదంతాల గురించినే ఎంతో రాజకీయం జరుగుతూ ఉంది. సిమెంట్ పెచ్చులూడి నిర్మాణాలపై విగ్రహాలు ఏవైనా దెబ్బతిన్నా దాన్ని కూడా హిందుత్వ వాదంపై దాడిగా చెప్పడానికి సోషల్ మీడియాను కొంతమంది గట్టిగా ఉపయోగించుకుంటున్నారు.
ఈ క్రమంలో గుంటూరు ఉదంతం కూడా మరో పెద్ద సంచలనం అయ్యేది. ఎటొచ్చీ దొంగ దొరికిపోయాడు. ఎత్తుకెళ్లిన విగ్రహాలను షర్టు లోపల దాచుకుని వెళ్తూ అతడు దొరికిపోయినట్టున్నాడు. ఈ దొంగ ఎవరూ మరీ వీక్ కాబట్టి.. సరిపోయింది, లేకపోతే గుంటూర్లో ఈ పాటికి బీజేపీ, తెలుగుదేశం, జనసేనలు పోటాపోటీ యాత్రలు ప్లాన్ చేసేవి!