ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త అవతారం ఎత్తారు. ఆయనలో ఇన్నాళ్లూ మనకు తెలియని ఒక లాయరు కూడా దాగి ఉన్నారా అనిపించేలాగా ఆయన శాసనసభ ప్రసంగం సాగిపోయింది. అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు.. దానిపై శాసనసభలో జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాటలు చాలా ఆశ్చర్య పరిచేలా సాగాయి. హైకోర్టు తీర్పుతో విభేదించిన జగన్మోహన్ రెడ్డి.. ఆ విషయంపై చాలా సాధికారంగా మాట్లాడారు.
తీర్పుతో విభేదించడం అనేది ఎవ్వరైనా చేయొచ్చు. దానికి లాయరు మాత్రమే కావాల్సిన అవసరం లేదు. కానీ.. న్యాయవ్యవస్థ చేసింది తప్పు అని చెప్పడానికి చాలా ఆలోచించాలి. పైగా ఒక శాసన వ్యవస్థకు నాయకుడిగా ఉన్న వ్యక్తి.. నిరాధార కామెంట్లు చేసేయడం కూడా కుదరదు. న్యాయవ్యవస్థతో పెట్టు కోకూడదని ప్రతిఒక్కరూ అనుకుంటారు.
జర్నలిజంలో కూడా కోర్టు తీర్పుల గురించి, న్యాయమూర్తుల గురించి రాసేప్పుడు చాలా అప్రమత్తంగా ఉంటారు. నాయకుల సంగతి సరేసరి. ఒక మాట అనడానికి వారు ఎన్నడూ ప్రయత్నించరు కూడా. కానీ జగన్ ఒక రకంగా చెప్పాలంటే దండయాత్రకు శంఖారావం చేసినట్టుగానే శాసనసభలో ప్రసంగించారు. హైకోర్టు తీర్పుతో విభేదించడం మాత్రమే కాదు.. వారి వైఖరినే ఆయన తప్పుపట్టారు.
మూడు రాజధానులపై నిర్ణయాధికారం మాదే అని అనడంలో పెద్ద విశేషం లేదు. కానీ.. హైకోర్టు పరిధి దాటినట్టుగా అనిపిస్తోందనే మాట వాడడం చాలా కీలకం. శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ తలదూర్చినట్లుగా ఉన్నదనే వ్యాఖ్య కూడా చిన్నది కాదు. ముఖ్యమంత్రి మాటలు గమనించినప్పుడు.. ఈ రెండు రాజ్యాంగ బద్ధ వ్యవస్థల మధ్య సంఘర్షణకు అమరావతి మీద హైకోర్టు తీర్పు.. జగన్ ప్రతిస్పందన ఒక కారణం కాబోతున్నదా అనిపించే స్థాయిలో సాగింది.
ప్రసంగం సందర్భంగా ఆయన రాజ్యాంగంలోని అంశాలను అనేకం వివరించారు. న్యాయవాదుల మాదిరిగా ఇదివరకటి సందర్భాల్లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పులు వంటివి కూడా ఉదాహరించారు. సాధారణంగా ఇలా పాత తీర్పులను కోట్ చేస్తూ.. విరుచుకుపడడం అనేది లాయర్లు చేసే పని.
జగన్ కూడా.. అదే తరహాలో.. న్యాయవ్యవస్థ అమరావతి విషయంలో పరిధి మీరిందనే సంగతిని స్పష్టంగా, సాధికారంగా చెప్పడానికి పాత తీర్పుల మద్దతు అనేకం తీసుకున్నారు. మొత్తానికి ఈ తీర్పు పర్యవసానాల్లో.. ఒక కొత్త సంఘర్షణ ఏపీలో కనిపించబోతున్నట్లుగా ఉంది.