అతి వృష్టి..అనావృష్టి అంటే ఇదే. భీమ్లా నాయక్..శ్యామ్ సింగ రాయ్…సినిమాలకు ప్రతి వీఆర్వోకి సినిమా డ్యూటీనే. అదనపు ఆటలు తగవు..అదనపు రేట్లు తగవు. ఇలా నానా యాగీ. ఆర్ఆర్ఆర్ వేళకు అవన్నీ గాల్లో కలిసిపోయాయి. అతి దారుణంగా తయారైపోయింది వ్యవహారం.
ప్రభుత్వం కళ్లు మూసుకోమందో, అధికారులు మూసుకున్నారో, ప్రతి చోటా తెల్లవారు ఝామున, ఉదయం ఆరుగంటలకు షో లు వేసేసారు. టికెట్ లు వెయ్యి రూపాయల వంతున అమ్మేసారు. కౌంటర్లు మూసేసి తమ చిత్తానికి రేట్లు పెంచేసారు.
రోజుకు అయిదు ఆటలు అంటే ఆరు, ఏడు కూడా వేసేసారు. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ వున్నాడనో, కొడాలి నాని స్నేహితుడు ఎన్టీఆర్ వున్నాడనో, మరి ఇంక ఏ కారణం వుందో మొత్తానికి ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు, షో ల అరాచకానికి గేట్లు ఎత్తేసారు.
జనం ఏమనుకుంటారు..పవన్ కళ్యాణ్ సినిమాపై పగబట్టారు అన్నది నిజం అనుకోరా? ప్రెస్ మీట్ లు పెట్టి మరీ వాదించిన మంత్రులు ఇప్పుడు ఎక్కడ వున్నారు.
పోలీసులు పెద్ద ఎత్తున తెల్లవారు ఝాము నుంచీ థియేటర్ల దగ్గర డ్యూటీ చేయాల్సి వచ్చింది. ఇది అధికారికంగానా? అనధికారికంగానా? అధికారికంగా అంటే ప్రభుత్వానికి నిబంధనలు తోసిరాజని షో లు వేస్తున్న సంగతి తెలుసు అనుకోవాలా? జగన్ ప్రభుత్వం ప్రజల్లో పలుచన కావడానికి ఇదో రీజన్ అవుతోందన్న సంగతి ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది.