అల్లూరి వీరోచిత పోరాటం అక్కడ పదిలం

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను గత ఏడాది జూలై నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చి అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి…

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాలను గత ఏడాది జూలై నాలుగవ తేదీన అంగరంగ వైభవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ భీమవరం వచ్చి అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లూరి పుట్టిన జిల్లా విశాఖ. నడయాడిన ప్రాంతం విశాఖ జిల్లాలోని మారుమూల మన్యం ప్రాంతం. అక్కడ ఆయన సంస్మరణగా కార్యక్రమాలు నిర్వహించాలని అంతా కోరుతున్నారు.

అల్లూరి పోరాటం చేసిన ఆ ప్రాంతంతో పాటు, అల్లూరి బ్రిటిష్ సైనికులతో ఎంతో వీరోచితంగా పోరాడిన విశాఖ ప్రాంతంలో గురుతులు పదిలంగా ఉన్నాయి. అల్లూరి 125వ జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలను విశాఖ మన్యంలో నిర్వహించాలని అల్లూరి సీతారామరాజు జాతీయ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పడాల వీరభద్రరావు కోరుతున్నారు.

ముగింపు ఉత్సవాలను జూలైలో హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారని, అదే విధంగా విశాఖలో కూడా ఘనంగా నిర్వహించాలని ఆయన కోరారు. అల్లూరి చరిత్రకు సంబంధించిన చారిత్రాత్మక ప్రాంతాలు ఎన్నో విశాఖ జిల్లాలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

దాదాపు వందేళ్ల క్రితం అల్లూరి సేనలకు, బ్రిటిష్ సేనలకు మధ్య భీకర యుద్ధం నర్శీపట్నం చింతపల్లి ఘాటు రోడ్డులో జరిగిందని వెల్లడించారు. అలా నేలకొరిగిన బ్రిటిష్ సేనల గుర్తులు అక్కడ ఉన్న సమాధులు ఇవన్నీ విప్లవవీరుడు పౌరుషానికి ప్రతీకలు అంటున్నారు పడాల వీరభద్రరావు.

నర్శీపట్నం దగ్గరలోని కృష్ణదేవి పేట పోలీస్ స్టేషన్ ని అల్లూరి సేనలు దాడి చేసి ఆయుధాలను తీసుకున్నాయని ఆయన గుర్తు చేశారు. అల్లూరి, గంటం దొరల సమాధులు ఉన్న క్రిష్ణదేవి పేటలో అల్లూరి 125వ జయంతి ముగింపు ఉత్సవాలని నిర్వహించాలని ఆయన కోరారు.