బాబు టార్గెట్ లక్ష.. కాస్త ఎగస్ట్రాగా లేదూ!?

పులివెందుల సహా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్ధానాలు గెలుస్తున్నాం.. అని చంద్రబాబునాయుడు వేస్తున్న జోకులకే రాష్ట్రప్రజలు నవ్వుకోలేక చచ్చిపోతున్నారు.  Advertisement ఇప్పుడు చంద్రబాబునాయుడు మరో గొప్ప జోకుతో ప్రజలను అలరింపజేయడానికి సిద్ధం…

పులివెందుల సహా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో మొత్తం 175 స్ధానాలు గెలుస్తున్నాం.. అని చంద్రబాబునాయుడు వేస్తున్న జోకులకే రాష్ట్రప్రజలు నవ్వుకోలేక చచ్చిపోతున్నారు. 

ఇప్పుడు చంద్రబాబునాయుడు మరో గొప్ప జోకుతో ప్రజలను అలరింపజేయడానికి సిద్ధం అవుతున్నారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఈసారి చంద్రబాబు గారికి ప్రజలు లక్ష ఓట్ల మెజారిటీ కట్టబెట్టాలట! లక్ష ఓట్ల మెజారిటీతో ఆయన చరిత్ర సృష్టించాలట. ఈ మేరకు అక్కడి ప్రజలతో, పార్టీ కార్యకర్తలతో ప్రమాణాలు కూడా చేయించబోతున్నారు. లక్ష మెజారిటీ లక్ష్యాన్ని అక్కడి కార్యకర్తలకు గుర్తుచేస్తూ ఉండేవిధంగా ఒక ప్రత్యేకమైన లోగోను కూడా తయారుచేశారట. ఈ హడావుడి మొత్తం చూస్తే మీకేం అనిపిస్తోంది. 

సొంత ఊరిలో గెలవలేక కుప్పం నియోజకవర్గం పారిపోయి, అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆధారం చేసుకుని వరుసగా నెగ్గుతూ వస్తున్న చంద్రబాబునాయుడు, ఈసారి ఎన్నికల్లో అక్కడినుంచి గెలుస్తారా? లేదా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుండగా.. ఆయన ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యాన్ని పార్టీ శ్రేణులకు నిర్దేశిస్తూ.. వారితో ప్రమాణాలు చేయించడం అనేది కామెడీగా అనిపించడం లేదా?

కుప్పం నియోజకవర్గం చంద్రబాబునాయుడుకు కంచుకోట అన్నమాట నిజమే. ఆయన చాలా సార్లుగా అక్కడ నలభై వేల ఓట్లకు తగ్గని మెజారిటీతోనే గెలుస్తూ వచ్చారు. 2019లోనే ఆయన హవాకు వైసీపీ గండి కొట్టింది. కేవలం 30 వేల ఓట్ల మెజారిటీతో గట్టున పడ్డారు. కేవలం కుప్పంలో దక్కే ఓట్ల మెజారిటీతో చిత్తూరు ఎంపీ అభ్యర్థిని కూడా ప్రతిసారీ గెలిపించుకునే అలవాటు ఉన్న తెలుగుదేశం ఈసారి అక్కడ బోల్తా కొట్టింది.

ఆ తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ కుప్పంమీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టింది. అక్కడ తమ బలాన్ని పెంచుకుంటూ వచ్చింది. కుప్పంలో పలు అభివృద్ధి పనులకు, అక్కడి ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేసింది. వీటన్నింటి ఫలితంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో గరిష్టంగా వారు సీట్లు దక్కించుకున్నారు. అలాగే తెలుగుదేశానికి వణుకు పుట్టించేలా కుప్పం మునిసిపాలిటీని కూడా చేజిక్కించుకున్నారు. 

చంద్రబాబునాయుడును అక్కడ ఓడించి తీరాలని వైసీపీ చాలా గట్టిగా పనిచేస్తోంది. అక్కడ మునిసిపల్ ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన నాయకుడికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి జగన్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడినుంచి తాను గెలవగలనా అనే భయం చంద్రబాబులో మొదలైనట్టుంది. అందుకే లక్ష ఓట్ల మెజారిటీ అనే సరికొత్త డ్రామాకు తెరతీశారని అంతా అంటున్నారు.

ఓటమి భయంతోనే.. లక్ష టార్గెట్ అనే ప్రహసనం నడిపిస్తే.. కార్యకర్తలతో ప్రమాణాలు చేయిస్తే .. కనీసం గెలుపు వరకు తథ్యంగా దక్కుతుందనే వ్యూహంతో చంద్రబాబు ఉన్నట్టుంది. కానీ ఇప్పటికే కుప్పంలో చంద్రబాబుకు పలుచేదు ఫలితాలు అందించిన స్థానికులు 2024లో ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.