డ్రగ్స్ కేసు.. నిర్మాత కేపీ చౌదరి అలా దొరికిపోయాడు!

అనూహ్యంగా టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ రాకెట్ వ్యవహారంతో తెరపైకొచ్చింది. టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి)ని అత్యంత చాకచక్యంగా వల పన్ని అరెస్ట్ చేశారు స్పెషల్ టాస్క్ పోలీసులు. ఏకంగా డ్రగ్స్…

అనూహ్యంగా టాలీవుడ్ మరోసారి డ్రగ్స్ రాకెట్ వ్యవహారంతో తెరపైకొచ్చింది. టాలీవుడ్ నిర్మాత సుంకర కృష్ణప్రసాద్ చౌదరి (కేపీ చౌదరి)ని అత్యంత చాకచక్యంగా వల పన్ని అరెస్ట్ చేశారు స్పెషల్ టాస్క్ పోలీసులు. ఏకంగా డ్రగ్స్ ప్యాకెట్లతో కేపీ చౌదరి పట్టుబడ్డాడంటే, పోలీసులు ఎంత తెలివిగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. ఇంతకీ కేపీ చౌదరి ఎలా దొరికిపోయాడు?

కొన్ని రోజుల కిందటి సంగతి..

హైదరాబాద్ లో డ్రగ్స్ ఎక్కువయ్యాయనే విషయం బహిరంగ రహస్యం. దీంతో పోలీసులు మరింత యాక్టివ్ అయ్యారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలో ఈమధ్య ఓ డ్రగ్స్ ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఎన్నో కాంటాక్టుల్ని కూడా సేకరించారు.

కట్ చేస్తే, అంతకు ముందే.. గోవా హిల్ టాప్ యజమాని డిసౌజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు నైజీరియన్లు కూడా హైదరాబాద్ లో పట్టుబడ్డారు. వీళ్లందరీ కాల్ డేటాలో కామన్ గా కనిపించిన కాంటాక్ట్ కేపీ చౌదరి.

దీంతో అతడిపై ప్రత్యేకంగా నిఘా పెట్టారు మాదాపూర్ పోలీసులు. అతడ్ని పట్టుకునేందుకు ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటుచేశారు. తరచుగా గోవా వెళ్లి వచ్చే చౌదరి, ఈసారి కూడా మామూలుగానే హైదరాబాద్ వచ్చారు. సరిగ్గా ఈ సమయం కోసమే ఎదురుచూసిన పోలీసులు.. రాజేంద్రనగర్ లోని కిస్మత్ పూర్ లో ఉన్న అతడి నివాసం వద్ద చౌదరిని అదుపులోకి తీసుకున్నారు.

ఇతగాడు ఎంత అడ్డంగా దొరికాడంటే, పోలీసులు అరెస్ట్ చేసే టైమ్ కు ఇతడి దగ్గర 82 గ్రాముల కొకైన్ ఉంది. నిజానికి ఇతడు గోవా నుంచి వంద గ్రాముల డ్రగ్స్ తో వచ్చాడంట. వస్తూవస్తూనే కొంత అమ్మేశాడు. మిగిలిన స్టఫ్ తో పట్టుబడ్డాడు.

కేపీ చౌదరి నుంచి  2 లక్షల రూపాయల నగదుతో పాటు.. 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతడికి నైజీరియన్ గ్యాంగ్ తో కాంటాక్ట్స్ ఉన్నట్టు ప్రాధమికంగా నిర్థారించారు పోలీసులు.