అపశకునం పవన్.. తస్మాత్ జాగ్రత్త!

శాస్త్రోక్తంగా సేద్యం చేస్తే కుక్కమూతి పిందెలు కాశాయని సామెత. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మూడురోజుల పాటు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూర్ణహుతిలు.. పనిలో పనిగా రకరకాల ఆధ్యాత్మిక…

శాస్త్రోక్తంగా సేద్యం చేస్తే కుక్కమూతి పిందెలు కాశాయని సామెత. పవన్ కల్యాణ్ వారాహి యాత్ర పరిస్థితి కూడా అలాగే ఉంది. మూడురోజుల పాటు యజ్ఞాలు, యాగాలు, హోమాలు, పూర్ణహుతిలు.. పనిలో పనిగా రకరకాల ఆధ్యాత్మిక వేషధారణల్లో ఫోటోలు ఇవన్నీ చేసి.. శుభమా అని పూజాదికాల తర్వాత వారాహి యాత్రను, బహిరంగసభలను నిర్వహించడానికి పూనుకుంటే.. పవన్ కల్యాణ్ కు తొలి అడుగు పడకముందే అపశకునం ఎదురైంది. 

కత్తిపూడి బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్న పవన్ అభిమాని ఒకరు లైట్ సిస్టమ్ ఏర్పాటుచేసిన టవర్ మీదికి ఎక్కి విద్యుదాఘాతానికి గురై తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ప్రమాదంతో ఒక్కసారిగా అసలు పవన్ కల్యాణ్ తొలి బహిరంగ సభ అల్లకల్లోలం అయింది.

పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు పోలీసుల అనుమతులు కూడా లభించాయి. ఆయన చాలా దిగ్విజయంగా అన్నవరం దేవస్థానంలో పూజలు అన్నీ పూర్తి చేసుకున్నారు. తొలిరోజు వారాహి యాత్రలో భాగంగా.. కత్తిపూడిలో బహిరంగసభ నిర్వహించాలనేది షెడ్యూలు! అన్నవరం నుంచి పవన్ కత్తిపూడికి బయల్దేరారు. ఈలోగానే ఈ అపశకునం ఎదురైంది. పవన్ అభిమాని వేదికవద్దనే ప్రమాదానికి గురికావడం జరిగింది.

పవన్ కల్యాణ్ ఈనెల 23 వ తేదీ వరకు పదిరోజులపాటు కొనసాగే యాత్రలో తొమ్మిది నియోజకవర్గాలను కవర్ చేసేలా ప్రణాళికను రూపొందించుకున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ మీద విరుచుకుపడడానికి అనే అస్త్రశస్త్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు.  

అద్భుతమైన వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. ఎక్కడెక్కడ బసచేయాలి, ఎక్కడ జనవాణి కార్యక్రమాలు నిర్వహించాలి, ఎక్కడ కార్యకర్తలతో భేటీ కావాలి వంటి వన్నీ బాగానే ప్లాన్ చేసుకున్నారు. అయితే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏం జాగ్రత్తలు తీసుకున్నారో మాత్రంతెలియదు.

పవన్ కల్యాణ్ యాత్రగా వస్తే.. ఆయన వెంట అభిమానులు వెల్లువలా వస్తారనేది ఎవ్వరైనా ఊహించగలిగిన సంగతి. ఆయన ఎలాంటి అధికారిక సమాచారం లేకుండా అన్నవరం వస్తున్నారని తెలియగానే, అక్కడి ఈవో ఆజాద్ జిల్లా ఎస్పీని సంప్రదించి.. జనం వెల్లువలా వస్తారు గనుక.. ఏ ఇబ్బందులు రాకుండా పోలీసు భద్రత కావాలని అడిగారు. ఆ మాత్రం ఇంగితంన జనసైనికులకు, వ్యూహకర్తలకు లేకుండాపోయినట్టుంది. వారి ఏర్పాట్ల వైఫల్యం వల్లనే ఇవాళ ఒక జనసైనికుడు, అభిమాని ప్రమాదానికి గురయ్యారని ప్రజలు అంటున్నారు.