మీకో నీతి, జ‌గ‌న్‌కో నీతా లోకేశ్‌!

ఒక్కో రాజ‌కీయ పార్టీకి, ఒక్కో వ్య‌క్తికి ఒక్కో నీతి వుంటుంద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లోకేశ్ చెబుతున్నారు. తాము అధికారంలో ఉండ‌గా వ‌ర్తించ‌ని నిబంధ‌న‌లు, ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌కు మాత్రం వ‌ర్తిస్తాయ‌ని చెప్ప‌డం…

ఒక్కో రాజ‌కీయ పార్టీకి, ఒక్కో వ్య‌క్తికి ఒక్కో నీతి వుంటుంద‌ని టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎమ్మెల్సీ లోకేశ్ చెబుతున్నారు. తాము అధికారంలో ఉండ‌గా వ‌ర్తించ‌ని నిబంధ‌న‌లు, ప్ర‌త్య‌ర్థి జ‌గ‌న్‌కు మాత్రం వ‌ర్తిస్తాయ‌ని చెప్ప‌డం లోకేశ్‌కే చెల్లించింది. క‌నీసం న‌వ్వు కుంటార‌నే స్పృహ కూడా లేకుండా లోకేశ్ మాట్లాడ్డం విడ్డూరంగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మూడు రాజ‌ధానుల‌పై శాస‌న‌మండ‌లిలో లోకేశ్ మాట్లాడారు.

మూడు రాజధానులు కావాలంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పార్లమెంట్ సవరణ చేయాలన్నారు. ఈ అంశంలో  శాసన సభలకు ఎలాంటి అధికారం లేదని హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయ‌న గుర్తు చేశారు. అయిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వం మొండిగా ముందుకెళుతోంద‌ని విమ‌ర్శించారు. పరిపాలన ఒకే చోట ఉండాలని.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలనేది చంద్రబాబు నినాదం అని లోకేశ్ చెప్పుకొచ్చారు.  

2014లో అధికారంలో టీడీపీ ఉండ‌గా ఏ పార్ల‌మెంట్‌లో రాజ‌ధానిపై తీర్మానం చేశారో లోకేశ్ చెప్పాలి. రాష్ట్రాన్ని విభ‌జించిన పార్ల‌మెంట్‌కే రాజ‌ధాని ఎంపిక హ‌క్కు ఉంటుంద‌నేది లోకేశ్ అభిప్రాయ‌మైతే, నాటి యూపీఏ-2 ప్ర‌భుత్వం నియ‌మించిన రాజ‌ధాని ఎంపిక క‌మిటీని కాద‌ని, మంత్రి నారాయ‌ణ నేతృత్వంలో చంద్ర‌బాబు కొత్త కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారో చెప్పాల్సిన బాధ్య‌త టీడీపీపై ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 

త‌మ వ‌ర‌కూ వ‌స్తే కేంద్రానికి సంబంధం లేద‌ని చెప్ప‌డం, ఇత‌రుల‌కైతే అంతా కేంద్ర‌మే అని చెప్ప‌డం లోకేశ్‌కే చెల్లింద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.