డీఎస్ అంటే ఎవరో ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. ఆయన అసలు పేరు ధర్మపురి శ్రీనివాస్ అయినా డీఎస్ గానే పాపులర్. నిజామాబాద్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్). రాష్ట్ర కేబినెట్‌లో మంత్రి పదవులు చేపట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గా చేసిన అనుభవం ఆయన సొంతం. డీఎస్ పీసీసీగా ఉన్న రెండుసార్లు పార్టీ అధికారంలోకి రావటంలో కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పిన నేతగా పేరుంది.
ఆయన రాజ్యసభ పదవీ కాలం మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈయన గులాబీ పార్టీ నుంచి రాజ్యసభకు వెళ్లినా కాలక్రమంలో కేసీఆర్ తో చెడిన సంగతి తెలిసిందే. వాళ్లిద్దరూ ఇప్పటివరకు శత్రువులుగానే ఉన్నారు. పదవీ కాలం అయిపోయాక డీఎస్ టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు వెళ్లాడని అందరికీ తెలుసు. పదవీ కాలం ముగిశాక డీఎస్ ఏ పార్టీలోకి వెళతారు అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ విషయం నిజామాబాద్ జిల్లా పొలిటికల్ సర్కిల్ లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. డీఎస్‌కు రెండు రాష్ట్రాల్లో మంచి పేరుంది. వివాదాలకు దూరంగా ఉంటాడని అంటారు. సీనియర్ లీడర్ మాత్రమే కాదు, బీసీ సామాజికవర్గంలో బడా లీడర్ డీఎస్.
అయితే ఆయన పెద్ద కుమారుడు, మాజీ మేయర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరనున్నారనే ప్రచారం జోరుగా నడిచింది. సంజయ్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలవటంతో డీఎస్ కాంగ్రెస్ చేరటం పక్కా అని భావించారు. కానీ ఆ కథ ఇప్పటివరకు ముందుకు కదలలేదు. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డి (టీపీసీసి అధ్యక్షుడు అయ్యాక) డీఎస్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించాడు కూడా. డీఎస్ కూడా సుముఖత వ్యక్తం చేశాడు. తాను కాంగ్రెస్ ను విడిచి తప్పు చేశానని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
కానీ రాష్ట్రంలో కానీ, దేశంలోకానీ ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. గతంలో ఒకసారి డీఎస్ ఢిల్లీలో సోనియా గాంధీని కూడా కలిశారు. ఇక కాంగ్రెస్‌లో ఎంట్రీకి ముహూర్తమే తరువాయి అనుకున్నారంతా. కానీ ఆగిపోయింది. కాంగ్రెస్‌తోనే తన రాజకీయ శేషజీవితం ముగియాలన్న డీఎస్ కోరికపై సోనియా సానుకూలంగా స్పందించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అతనికి వ్యతిరేక సెగ ఎదురుకావడంతో కథ అడ్డం తిరిగింది. డీఎస్ రాకను రాష్ట్ర పార్టీ నేతలతో పాటు నిజామాబాద్ జిల్లా నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండడంతో.. డీఎస్ ఎంట్రీకి కాంగ్రెస్ అధిష్టానం నో చెప్పినట్టుగా ప్రచారం సాగుతోంది.
డీఎస్‌ను తిరిగి పార్టీలో చేర్చుకోవడం వల్ల పార్టీకి పెద్దగా ప్రయోజనం ఉండదన్నది రాష్ట్ర కాంగ్రెస్ నేతల వాదనగా తెలుస్తోంది. డీఎస్ రీ ఎంట్రీకి పార్టీ నేతల నుంచి వ్యతిరేకత రావడంతో.. రాహుల్‌గాంధీ కూడా వారి అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలుస్తోంది. ఒకే ఫ్యామిలీ నుంచి వేర్వేరు పార్టీల్లో ఉండడం కుదరదని, ఒకవేళ డీఎస్ చేరాలనుకుంటే ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్‌లో చేరితేనే స్వాగతించాలని రాహుల్ కూడా సూచించినట్టు సమాచారం. దాంతో కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్న డీఎస్ ఎంట్రీ ప్రయత్నాలకు ఎండ్ కార్డు పడినట్టు తెలుస్తోంది.
ఆ తరువాత డీఎస్ మదిలో ఏముందన్నది ఆయన అభిమానులకు, అనుచరులకు అంతుచిక్కడం లేదు. డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు చిన్న కుమారుడు ఎంపీ అరవింద్ బీజేపీలో తక్కువ సమయంలోనే టాప్ లీడర్‌గా ఎదిగారు. పార్టీలో కీ రోల్ పోషిస్తున్నారు. బీజేపీ లో రాష్ట్రస్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అరవింద్. కేంద్రం పెద్దలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. డీఎస్ బీజేపీలోకి చేరుతారన్న ప్రచారం కూడా జరిగింది.
డీఎస్ మాత్రం ఏ పార్టీ లోకి వెళతారు అన్నదానిపై క్లారిటీ ఇవ్వటం లేదు. అటు డీఎస్ పెద్ద కొడుకు సంజయ్ కూడా తండ్రి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. తండ్రి డీఎస్ ఏ పార్టీలో ఉంటే ఆయన వెంటే నడుస్తారు సంజయ్. అయితే డీఎస్ పొలిటికల్ అనుభవం పార్టీలకు ఎంతో కలిసొస్తుందని ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ భావిస్తున్నాయి. కానీ డీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారో అన్న దానిపై క్లారిటీ మాత్రం లేదు. డీఎస్ పొలిటికల్ ప్యూచర్ ప్లాన్ ఎలా ఉండనుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడక తప్పదు.