అసెంబ్లీలో చిడతలు వాయించి, విజిల్స్ వేసి రచ్చ రచ్చ చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు, శాసన మండలిలోనూ అదే తీరు కొనసాగించారు. కనీసం పెద్దల సభ అనే గౌరవం కూడా లేకుండా ప్రవర్తించారు. మండలిలో టీడీపీ ఎమ్మెల్సీల ప్రవర్తనపై చైర్మన్ మోషెన్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభా గౌరవాన్ని కాపాడే బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. భజన చేయడం మంచి పద్ధతి కాదని, అసలు సభలోకి విజిల్స్, చిడతలు ఎందుకు తెచ్చారని అడిగారు వెల్ లోకి వచ్చి మాట్లాడే హక్కు సభ్యులకు లేదన్నారు మండలి చైర్మన్.
ఏడుగురిపై సస్పెన్షన్ వేటు…
ఓ దశలో టీడీపీ ఎమ్మెల్సీల ఆగడాలు మరీ శృతి మించడంతో ఏడుగురిపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు అశోక్ బాబు, అర్జునుడు, దీపక్ రెడ్డి, రామ్మోహన్ , రామారావు, రవీంద్రనాథ్, ప్రభాకర్ ని సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సస్పెన్షన్ ప్రకటన రాగానే.. దీపక్ రెడ్డి పోడియంపైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. మార్షల్స్ ఆయనను అడ్డుకున్నారు.
సస్పెన్షన్ చేసిన తర్వాత కూడా ఈ దౌర్జన్యం ఏంటని చైర్మన్ ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్సీలు మరింతగా రెచ్చిపోయారు. ఏకంగా చైర్మన్ పైనే ప్లకార్డులు విసిరేసి బయటకు వెళ్లిపోయారు.
బిచ్చగాళ్లు, చిల్లరగాళ్లు..
మండలిలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కన్నబాబు. టీడీపీ సభ్యులు మరీ దిగజారిపోయారని, బిచ్చగాళ్లలా, చిల్లర గలాటా చేస్తున్నారని మండిపడ్డారు. మండలి చైర్మన్ పట్ల నారా లోకేష్ అమర్యాదగా ప్రవర్తించడం సరికాదన్నారు కన్నబాబు.
చంద్రబాబు బయటే ఉండి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారని, టీడీపీ చెబుతున్న బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనే వచ్చాయని, అవి జె-బ్రాండ్లు కావని, సి-బ్రాండ్లు అని ఎద్దేవా చేశారు.