బాబునే న‌మ్మ‌ని సీమ‌…లోకేశ్‌ను?

చంద్ర‌బాబునే న‌మ్మ‌ని రాయ‌ల‌సీమ‌, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ను విశ్వ‌సిస్తుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. రాయ‌ల‌సీమ‌లో త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. 125 రోజుల పాటు రాయ‌ల‌సీమ‌లో…

చంద్ర‌బాబునే న‌మ్మ‌ని రాయ‌ల‌సీమ‌, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్‌ను విశ్వ‌సిస్తుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. రాయ‌ల‌సీమ‌లో త‌న తండ్రి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కుప్పంలో నారా లోకేశ్ పాద‌యాత్ర మొద‌లు పెట్టారు. 125 రోజుల పాటు రాయ‌ల‌సీమ‌లో లోకేశ్ న‌డ‌క సాగించారు. అనంత‌రం నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరులో ప్ర‌వేశించారు. రాయ‌ల‌సీమను దాటుకుని నెల్లూరులో అడుగు పెడుతూ …క‌రవు నేల‌ను ముద్దాడుతూ ఫొటోల‌కు పోజులిచ్చారు.

రాయ‌ల‌సీమ స‌మాజాన్ని ఉద్దేశించి లోకేశ్ ప‌దేప‌దే అన్న మాట‌… ఈ ప్రాంతం వైఎస్ జ‌గ‌న్‌కి 49 సీట్లు ఇచ్చిందని, అయినా ఏం అభివృద్ధి జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌గ‌న్‌కు ఇచ్చిన‌న్ని సీట్లు ఇస్తే, సీమ స‌త్తా ఏంటో దేశానికి చూపిస్తామ‌ని న‌మ్మ‌బ‌లికారు. అలాగే మిష‌న్ రాయ‌ల‌సీమ పేరుతో ప్ర‌ణాళిక విడుద‌ల చేసి, ప్ర‌జాద‌ర‌ణ పొందేందుకు ప్ర‌య‌త్నించారు. పెళ్ల‌యితే పిచ్చి కుదురుతుంద‌ని అంటుంటారు. కానీ పిచ్చి కుదిరితే క‌దా పెళ్లి అయ్యేద‌ని పెద్ద‌లు ప్ర‌శ్నిస్తుంటారు. ఈ రీతిలో లోకేశ్ మాట‌లున్నాయ‌ని సెటైర్స్ విసురుతున్నారు.

అస‌లు రాయ‌ల‌సీమ‌లో టీడీపీని ఎందుకు ఆద‌రించ‌లేదో లోకేశ్ ఆత్మావ‌లోక‌నం చేసుకోవాలి. సీమ వ్య‌తిరేక పార్టీగా టీడీపీ న‌డుచుకుంటోంద‌నేది ప‌చ్చి నిజం. రాయ‌ల‌సీమ క‌రవు పీడిత ప్రాంతం. అంతేకాదు, టీడీపీ పీడిత ప్రాంతంగా పేరు తెచ్చుకుంద‌నే చేదు నిజాన్ని లోకేశ్ గ్ర‌హించాలి. రాయ‌ల‌సీమ‌లో పుట్టి, అక్క‌డి నుంచే ప్రాతినిథ్యం వ‌హిస్తూ కూడా త‌న తండ్రి క‌రవును పోగొట్టేందుకు ఎలాంటి ప్ర‌య‌త్నం చేయ‌లేద‌న్న వాస్త‌వాన్ని గ్ర‌హించాలి.

ఎంత‌సేపూ జ‌గ‌న్‌కు 49 సీట్లు ఇచ్చార‌ని, త‌మ‌కెందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించ‌డం కాదు, ఎందుకు ఆద‌రిస్తున్నారో అర్థం చేసుకోవాలి. రాయ‌ల‌సీమ‌ను స‌స్య‌శ్యామలం చేసేందుకు కృష్ణా నీటిని తీసుకొచ్చేందుకు దివంగ‌త వైఎస్సార్ త‌న హ‌యాంలో భ‌గీర‌థ ప్ర‌య‌త్నం చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ సామ‌ర్థ్యాన్ని పెంచి, త‌ద్వారా కృష్ణా నీటిని రాయ‌ల‌సీమ‌కు త‌ర‌లించేందుకు ఇటు స్వ‌ప‌క్షం, అటు ప్ర‌తిప‌క్ష నేత‌ల‌తో ఫైట్ చేశారు. ఇవ‌న్నీ సీమ ప్ర‌జానీకం గుర్తించింది. అందుకే వైఎస్సార్ కుటుంబానికి సీమ స‌మాజం అండ‌గా నిలుస్తోంది.

సీమ‌కు కృష్ణా నీటిని రాకుండా అడ్డుకునే వారికి ఒత్తాసు ప‌లికిన త‌న తండ్రికి ఆ ప్రాంతం ఎలా అండ‌గా నిలుస్తుంద‌ని లోకేశ్ అనుకుంటున్నారో అర్థం కావ‌డం లేదు. సీమ స‌మాజం రాజ‌కీయంగా ఆద‌రించాలంటే, ముందు వారి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోవాలి. టీడీపీని అధికారంలోకి తెచ్చుకుంటే కోస్తా ప్రాంతానికి ఊడిగం చేస్తార‌నే నెగెటివ్ ప్ర‌చారం నుంచి బ‌య‌ట‌ప‌డాలి. త‌మ‌కు కూడా ప్ర‌యోజ‌నం క‌లిగిస్తార‌నే న‌మ్మ‌కాన్ని సంపాదించుకునేందుకు చేత‌ల‌కు ప‌ని చెప్పాలి.

అప్పుడే సీమ స‌మాజం ఆద‌రిస్తుంది. మిష‌న్ రాయ‌ల‌సీమ అంటూ ఏవో హామీలిస్తే న‌మ్మేంత అజ్ఞానంలో సీమ స‌మాజం లేదు. ఎందుకంటే న‌మ్మ‌కం అనే ప‌దానికే అర్థం లేకుండా త‌న తండ్రి చంద్ర‌బాబు సీమ విష‌యంలో చేశార‌ని లోకేశ్ అర్థం చేసుకోవాలి. చంద్ర‌బాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్న‌ప్పుడు తాను పుట్టి పెరిగిన‌, ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హిస్తున్న ప్రాంతానికి ఏం చేశారో చెబితే, నేడు ఆద‌రించాల‌ని దేబ‌రించాల్సిన అవ‌స‌రం టీడీపీకి వ‌చ్చి వుండేది కాదు.