పాన్ ఇండియా సినిమాకు ప్రచారం ఎక్కడ?

భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్ సినిమా. బడ్జెట్ కు తగ్గట్టే భారీ రేట్లకు సినిమాను అమ్మారు. రెవెన్యూస్ కోసం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు కూడా సవరించారు. ఇన్ని చేస్తున్న యూనిట్, కీలకమైన ప్రచారాన్ని…

భారీ బడ్జెట్ తో తెరకెక్కింది ఆదిపురుష్ సినిమా. బడ్జెట్ కు తగ్గట్టే భారీ రేట్లకు సినిమాను అమ్మారు. రెవెన్యూస్ కోసం తెలుగు రాష్ట్రాల్లో రేట్లు కూడా సవరించారు. ఇన్ని చేస్తున్న యూనిట్, కీలకమైన ప్రచారాన్ని మాత్రం పట్టించుకోలేదు. రిలీజ్ కు సరిగ్గా ఇంకా 2 రోజులు మాత్రమే టైమ్ ఉన్న వేళ, ఆదిపురుష్ నుంచి ఎలాంటి ప్రచారం లేకపోవడం ఆశ్చర్యం.

ఈ సినిమాకు సంబంధించి తిరుపతిలో భారీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టారు. దాదాపు 4 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఆ ఫంక్షన్ చేశారు. అదే టైమ్ లో యాక్షన్ ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక ఆ ఫంక్షన్ నుంచి వరుసపెట్టి ప్రమోషనల్ ఈవెంట్స్ ఉంటాయని అంతా భావించారు. కానీ ఆశ్చర్యంగా యూనిట్ సైలెంట్ అయింది.

తిరుపతి తర్వాత ఖమ్మంలో భారీ ఈవెంట్ అన్నారు, ఆ తర్వాత నార్త్ బెల్ట్ లో కూడా మీడియా ఇంటరాక్షన్స్ ఉంటాయన్నారు. కానీ గ్రౌండ్ ఈవెంట్స్ సంగతి దేవుడెరుగు, కనీసం రెగ్యులర్ గా ఇచ్చే ఇంటర్వ్యూలు కూడా లేవు. మూవీ రిలీజ్ కు ముందు వారం రోజులు, ప్రచారానికి అత్యంత కీలకం. అలాంటి కీలకమైన సమయంలో యూనిట్ లో కీలకమైన సభ్యులెవ్వవరూ కనిపించలేదు. తిరుపతి ఫంక్షన్ తర్వాత ప్రభాస్ మళ్లీ కనిపించలేదు. కృతి సనన్ జాడలేదు.

లోకల్ మూవీస్ కు కూడా చాలా వినూత్నంగా ప్రచారం చేస్తున్న రోజులివి. ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి, చార్టులు వేసుకొని మరీ, పక్కా ప్రణాళికతో ప్రమోషన్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీ ఆదిపురుష్ విషయంలో అలాంటి ప్లానింగ్ ఏదీ కనిపించడం లేదు.

సినిమా వీక్ గా ఉన్నప్పుడే ప్రచారం పీక్స్ లో ఉంటుందంటూ వాదించుకుంటున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఇప్పటికిప్పుడు వాళ్లు తమ వాదనతో నెగ్గొచ్చు. కానీ, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ తో పాటు యూనిట్ సభ్యులు, గిల్ట్ ఫీలవ్వకుండా ఉంటే అదే చాలు. అన్నట్టు ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. తెలంగాణలో ఎర్లీ మార్నింగ్ షోకు కూడా అనుమతి వచ్చేసింది.