వందకు పైగా ఎంపీలు… బందులూ..అయినా…?

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందీ అంటే దానిని ఎవరూ ఆపలేరు. ఏదైనా అద్భుతం జరగాలే తప్ప మోడీ సర్కార్ తమ డెసిషన్ ని వెనక్కు తీసుకున్న దాఖలాలు ఇప్పటికైతే…

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒకసారి ఒక నిర్ణయం తీసుకుందీ అంటే దానిని ఎవరూ ఆపలేరు. ఏదైనా అద్భుతం జరగాలే తప్ప మోడీ సర్కార్ తమ డెసిషన్ ని వెనక్కు తీసుకున్న దాఖలాలు ఇప్పటికైతే పెద్దగా లేవు.

ఇక విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఎంతటి క్లారిటీతో ఉందో ఉక్కు మంత్రి పార్లమెంట్ వేదికగా చెప్పేశారు, కుండబద్ధలు కొట్టేశారు. సొంత గనుల వాదనకూ ఆన చెల్లుచీటీ రాసేసారు.

ఇక సెంటిమెంట్లూ ఆయింట్మెంట్ల రోజులు ఎపుడో పోయాయి కాబట్టి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినా కుదిరే పరిస్థితి అయితే లేదు, మరో వైపు చూస్తే విశాఖ ఉక్కు కోసం భూములు ఇచ్చిన వారి సంగతేంటి, వేలాది మంది ఉపాధి కధ ఏంటి అంటే అన్నీ మేమే చూసుకుంటామని అంటోంది కేంద్రం.

ప్రైవేట్ బాటన పట్టించి లాభాలను తెప్పిస్తామని, ఇంతకంటే మంచిగా విశాఖ ఉక్కు ఉంటుంది చూడండి అని సవాల్ చేసే విధంగానే కేంద్ర పెద్దలు మాట్లాడుతున్నారు. మరి ఈ సమయంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి విజయసాయిరెడ్డి అయితే 120 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖలను కేంద్రానికి పంపుతామని అంటున్నారు. ప్రధాని మోడీకి విశాఖ ఉక్కు ప్రైవేట్ పరం చేయవద్దు అని ఎంపీల సంతకాలను జతపరుస్తామని చెబుతున్నారు.

ఇంకో వైపు ఈ నెల 28న విశాఖ బంద్ ని చేసేందుకు ఉక్కు ఉద్యమకారులు సిద్ధపడుతున్నారు. మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ బాటన పడుతున్న విశాఖ ఉక్కుని ఆపగలవా. కేంద్ర పెద్దల మనసు మార్చగలవా. ఏమో చూడాలి. ప్రయత్నం చేయడం వరకూ విశాఖ ఉద్యోగులు, ప్రజా సంఘాలు సక్సెస్ అయ్యాయి. మరి కేంద్రం వీటిని తోసిరాజని ముందుకే వెళ్తామంటే మాత్రం ఎవరూ ఏమీ చేయలేరంతే.