సంక్రాంతి విన్నర్ గా నిలిచిన క్రాక్ సినిమా త్వరలోనే ఓటీటీలో కూడా ప్రత్యక్షం కాబోతోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే క్రాక్ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకున్న ఆహా యాప్.. రిపబ్లిక్ డే కానుకగా క్రాక్ ను స్ట్రీమింగ్ కు పెట్టాలనే ఆలోచనలో ఉంది.
ఆహా చరిత్రలో అతిపెద్ద డీల్ క్రాక్. దాదాపు 10 కోట్ల రూపాయలకు ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్ ను దక్కించుకుంది ఆహా. అయితే ఠాగూర్ మధుకు ఈ ఎమౌంట్ మొత్తం చేరడం లేదు. రకరకాల ఆబ్లిగేషన్లు, మరికొన్ని ప్రాజెక్టులకు లింక్ పెట్టి.. క్రాక్ డీల్ ను లాక్ చేశారు అల్లు అరవింద్. అంతేకాకుండా.. థియేటర్లలోకి వచ్చిన 3 వారాలకే ఓటీటీలో పెట్టుకునేలా అగ్రిమెంట్ ఫిక్స్ చేశారట.
ఇందులో భాగంగా క్రాక్ ను వీలైనంత త్వరగా స్ట్రీమింగ్ కు తీసుకురావాలని భావిస్తున్నారు అరవింద్. జనవరి 26న క్రాక్ ను ఆహాలో పెడితే ఎలా ఉంటుందనేది ఓ ప్రతిపాదన. వీకెండ్స్ తో పాటు వాలంటైన్స్ డే కలిసొచ్చేలా ఫిబ్రవరి 12వ తేదీ కూడా పరిశీలనలో ఉంది. అయితే ఎక్కువమంది మాత్రం ఈ నెలలోనే స్ట్రీమింగ్ కు తీసుకొస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఈ సంక్రాంతి సీజన్ క్రాక్ సినిమాతోనే స్టార్ట్ అయింది. ఆర్థిక సమస్యలు, కోర్టు కేసుల వల్ల కాస్త ఆలస్యంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా సిసలైన సంక్రాంతి విజేతగా నిలిచింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ క్రాక్ ను మరిపించలేకపోయాయి.