ఓవైపు మూడో దశ ప్రయోగాలు పూర్తి కాకముందే అనుమతిచ్చేశారంటూ వస్తున్న విమర్శలు, మరోవైపు కొవాక్సిన్ తమకి వద్దంటూ బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వస్తున్న డిమాండ్లు, తాజాగా ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యులు తమకు కొవాక్సిన్ టీకా వేయొద్దంటూ చేసిన నిరసన.. వెరసి భారత్ బయోటెక్ పరువు బజారున పడింది.
హడావిడిగా భారత్ బయోటెక్ తయారీ కొవాక్సిన్ కి అనుమతులిచ్చేయడం వెనక ఏదో పొలిటికల్ లాబీయింగ్ ఉందనే విషయంపై సీరియస్ గా చర్చ నడుస్తోంది. దీంతో భారత్ బయోటెక్ నష్టనివారణ చర్యలు చేపట్టింది. తమ వ్యాక్సిన్ సురక్షితమేనంటూ ప్రకటించింది.
తమ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్స్ట్ వస్తే పూర్తి బాధ్యత తమదేనంటూ స్పష్టం చేసింది భారత్ బయోటెక్. కొవాక్సిన్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తాయని నిర్థారణ అయితే వైద్యం అందించడానికి సిద్ధమేనంటూ ప్రకటించింది.
అసలెందుకీ గొడవ..
దేశవ్యాప్తంగా ఒకేసారి రెండు వ్యాక్సిన్లకూ కేంద్రం అనుమతిచ్చింది. పూర్తి స్థాయి ప్రయోగాలు పూర్తి చేసుకున్న కొవిషీల్డ్ తో పాటు, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాని కొవాక్సిన్ ని కూడా ఒకే గాటన కట్టడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.
కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో కూడా పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ అసంతృప్తిని వెలిబుచ్చాయి. చత్తీస్ ఘడ్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు తమకు కొవాక్సిన్ వద్దని ఖరాఖండిగా చెప్పేశాయి. ఏపీలో కూడా తొలిరోజు కొవాక్సిన్ ని వినియోగించలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అటు తెలంగాణలో మాత్రం అంగీకార పత్రం రాసిస్తేనే కొవాక్సిన్ టీకా అంటున్నారు. అంటే తమపై జరుగుతున్న క్లినికల్ ట్రయల్స్ కి పూర్తిగా తమదే బాధ్యత అంటూ లబ్ధిదారులు రాసి సంతకం పెట్టాలనమాట. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన రాగానే కొవాక్సిన్ నాణ్యతపై పలు సందేహాలు మొదలయ్యాయి. సామాన్య ప్రజలకు కూడా కొవాక్సిన్, కొవిషీల్డ్ కి మధ్య తేడా స్పష్టంగా తెలిసొస్తోంది.
ఈ నేపథ్యంలో విమర్శలు తీవ్రతరమవుతున్న వేళ భారత్ బయోటెక్ రంగంలోకి దిగింది. తమ టీకా వేసుకున్నవారి ఆరోగ్యానికి తమదే భరోసా అంటూ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వైద్య సదుపాయం కల్పిస్తామని అంటోంది.
అయితే ఈ ప్రకటనతో మరింత గందరగోళం నెలకొనే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు. ఒకరకంగా తమ టీకా సామర్థ్యంపై భారత్ బయోటెక్ కి కూడా నమ్మకం లేదనే అనుమానం ప్రజలకు కలుగుతుందని చెబుతున్నారు.
తమ టీకా సురక్షితం అని బలంగా ప్రచారం చేసుకోడానికి బదులు, విఫలం అయితే నష్టపరిహారం ఇస్తాం అని చెప్పడంలో లాజిక్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా భారత్ లో జరుగుతున్న వ్యాక్సినేషన్, క్లినికల్ ట్రయల్స్ ని తలపిస్తోందనే ప్రచారం మొదలైతే మన దేశానికే చెడ్డపేరు వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు.