విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కట్టుబడి ఉన్నామని మరోసారి కేంద్ర ప్రభుత్వం లోక్‌సభ వేదికగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జనసేనాని పవన్‌కల్యాణ్ కింకర్తవ్యం ఏంటి? మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం ఆంధ్రా సెంటిమెంట్‌ను తుంగలో తొక్కడంపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతుగా నిర్వహించిన సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ పాల్గొని మాటల తూటాలు పేల్చారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు జగన్ సర్కార్‌దే బాధ్యతని విమర్శించి అభాసుపాలయ్యారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు జగన్ ప్రభుత్వమే నాయకత్వం వహించి, అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం పవన్ డెడ్‌లైన్ కూడా విధించి కామెడీ పండించారు. ఆ తర్వాత మరోసారి ఒక రోజు దీక్ష చేపట్టారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ విషయంలో వెనుకంజ వేయలేదు. తాజాగా మరోసారి తన వైఖరిని సుస్పష్టం చేసింది.
లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో వైసీపీ ఎంపీ మార్గాని భరత్, టీడీపీ ఎంపీలు కె.రామ్మోహన్నాయుడు, కేశినేని నాని అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ స్పందిస్తూ….విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించాలన్న నిర్ణయం సరైందేనని స్పష్టం చేశారు.ఆ ప్లాంట్ మేలు కోసం తీసుకున్న నిర్ణయంలో పునరాలోచనే లేదన్నారు. ప్రభుత్వం దానికే కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఎంతో మంది ప్రాణాలు అర్పించారు. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఉద్యమించి సాధించుకున్నారు. అలాంటి స్టీల్ ప్లాంట్‌ను మోదీ సర్కార్ ప్రైవేటీకరించడంపై తెలుగు సమాజంలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బీజేపీకి మిత్రపక్షంగా జనసేనాని వుండడం, విశాఖ స్టీల్ పోరాటానికి మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో పవన్‌కల్యాణ్ ప్రశ్నలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న ప్రాంతంలో పోటీ చేసిన పవన్‌కల్యాణ్ గెలవని సంగతి తెలిసిందే. తనను గెలిపించి వుంటే విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ఇవాళ ఈ దుస్థితి వచ్చేది కాదని గతంలో పవన్ అన్నారు. ఏది ఏమైనా తన మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరణకు శరవేగంగా అడుగులు వేస్తున్న తరుణంలో పవన్ మనసులో ఏముందో తెలియాల్సి వుంది.