నేటి అసెంబ్లీ సమావేశాలు సంచలనానికి వేదిక కానున్నాయా? అంటే ఔననే సమాధానం వస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ముగింపు దశకు వచ్చాయి. రేపటితో బడ్జెట్ సమావేశాలు పూర్తి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీలక అంశాలపై చర్చకు అసెంబ్లీ వేదిక కానుంది.
మూడు రాజధానులు అంశంపై కీలక చర్చ జరగనుంది. అలాగే శాసన-న్యాయ అధికారాల పరిధిపై చర్చించే అవకాశం ఉంది. వైసీపీ సీనియర్ సభ్యుడు ధర్మాన ప్రసాదరావు ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాసిన లేఖపై సభలో చర్చించనున్నారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థ, శాసన వ్యవస్థ అధికారాలు, వాటి పరిధులపై సభ్యులు ఎలాంటి కామెంట్స్ చేస్తారోననే ఉత్కంఠ నెలకుంది.
మూడు రాజధానులపై ఇటీవల హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజధాని ఎంపిక హక్కు శాసన వ్యవస్థకు లేదని తీర్పు ఇవ్వడంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు న్యాయ వ్యవస్థపై ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ధర్మాన ప్రసాదరావు రాసిన లేఖ చర్చనీయాంశమైంది.
“అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ ఇచ్చిన తీర్పుపై నేను ఎటువంటి వ్యాఖ్య చేయదలుచుకోలేదు. కానీ గౌరవ హైకోర్టు వారు శాసన సభకు రాజధాని మార్చడానికి గాని లేదా రెండు మూడు రాజధానులుగా విభజించుటకు గాని శాసన అధికారం లేదనే వ్యాఖ్య నన్ను తీవ్రంగా ఆలోచింపజేస్తున్నది. శాసన వ్యవస్థ హక్కును, బాధ్యతను కాదనడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని నేను భావిస్తున్నాను.
శాసనసభ, న్యాయ వ్యవస్థ, కార్యనిర్వహక వర్గం వాటి వాటి పరిధులు, బాధ్యతలు, అధికారాలపై చర్చ జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి ఈ మూడు విభాగాల మధ్య రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా “Speration of Powers” పై చర్చించటానికి వీలుగా శాసన సభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాను” అంటూ సీఎంకు ధర్మాన లేఖ రాసిన నేపథ్యంలో ఇవాళ చర్చ చేపట్టే అవకాశం ఉంది.
చట్టసభ వెలుపల ఇప్పటికే తీర్పుపై అధికార పార్టీ నేతలు సీరియస్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో… అదే అంశంపై అసెంబ్లీలో ఏం మాట్లాడ్తారనే చర్చ జరుగుతోంది. తినబోతూ రుచి చూడడం ఎందుకనే సామెత చందాన… కాసేపట్లో అసెంబ్లీ చర్చనే వీక్షిస్తే సరిపోతుంది కదా!