సహజీవనంలో విడాకులు.. ఇదో వింత కేసు

ఏడడుగులు నడిచి, పెళ్లి చేసుకొని, తర్వాత ఒకరంటే ఒకరికి పడకపోతే విడాకులు తీసుకోవడం సహజం. మరి కొన్నేళ్లు సహజీవనం చేసి, ఏకంగా పిల్లల్ని కని, ఆ తర్వాత ఒకరంటే ఒకరికి నచ్చకపోతే విడాకులు తీసుకోవడం…

ఏడడుగులు నడిచి, పెళ్లి చేసుకొని, తర్వాత ఒకరంటే ఒకరికి పడకపోతే విడాకులు తీసుకోవడం సహజం. మరి కొన్నేళ్లు సహజీవనం చేసి, ఏకంగా పిల్లల్ని కని, ఆ తర్వాత ఒకరంటే ఒకరికి నచ్చకపోతే విడాకులు తీసుకోవడం సాధ్యమేనా..? దీనిపై కేరళ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది.

సహజీవనాన్ని చట్టప్రకారం వివాహంగా గుర్తించలేమని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఏదైనా వ్యక్తిగత చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కాకుండా కేవలం ఒప్పందం ద్వారా ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నప్పుడు, వారు దానిని వివాహమని క్లెయిమ్ చేయలేరని, అలాంటప్పుడు విడాకుల ప్రస్తానవే రాదని కేరళ న్యాయస్థానం అభిప్రాయపడింది.

ఇంతకీ కేసు ఏంటి..?

అతడో హిందువు, ఆమె క్రిస్టియన్.. ఇద్దరి మనసులు కలిశాయి, కలిసి జీవిద్దామని నిర్ణయించుకున్నారు. కానీ వాళ్లు పెళ్లి చేసుకోలేదు. సహజీవనం మాత్రం ప్రారంభించారు. గమ్మత్తైన విషయం ఏంటంటే.. తమ సహజీవనానికి సంబంధించి వాళ్లు వ్యక్తిగతస్థాయిలో ఓ చిన్నపాటి అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు.

ఈ సహజీవనానికి గుర్తుగా వాళ్లకు సంతానం కూడా కలిగింది. ఇదంతా 2006 నాటి సంగతి. ఇప్పుడు వీళ్లిద్దరికీ పడడం లేదు, విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. సరిగ్గా ఇక్కడే తిరకాసు వచ్చింది. చట్టప్రకారం వివాహం చేసుకోలేదనే కారణంతో, వీళ్లకు విడాకులు మంజూరు చేసేందుకు ఫ్యామిలీ కోర్టు నిరాకరించింది.

దీంతో ఈ జంట, కేరళ హైకోర్టును ఆశ్రయించింది. డిక్లరేషన్ ద్వారా ఇరుపక్షాలు తమ సంబంధాన్ని వివాహం చేసుకున్నట్లు అంగీకరించినప్పుడు, అది వివాహం కిందకే వస్తుందని, పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ వాదనను కేరళ హైకోర్టు తోసిపుచ్చింది.

ఏదైనా వ్యక్తిగత చట్టం లేదా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం కాకుండా కేవలం ఒప్పందం ద్వారా కలిసి జీవించాలని రెండు పక్షాలు నిర్ణయించుకున్నప్పుడు, అది వివాహమని క్లెయిమ్ చేయరాదని హైకోర్టు విస్పష్టంగా తెలిపింది. కాబట్టి విడాకులు కోరే అర్హత పిటిషనర్లకు లేదని తేల్చి చెప్పింది.