బీజేపీది గోరంత…గాలి తీసేసిన మంత్రి

ఏపీకి ఎంతో చేశాం, లక్షల కోట్లు ఇచ్చామని నిన్న కాక మొన్న కేంద్ర పెద్ద, బీజేపీ అగ్ర నేత అమిత్ షా విశాఖ నడి బొడ్డున నుంచి గొప్పగా చెప్పుకున్నారు అయితే బీజేపీ ఏపీకి…

ఏపీకి ఎంతో చేశాం, లక్షల కోట్లు ఇచ్చామని నిన్న కాక మొన్న కేంద్ర పెద్ద, బీజేపీ అగ్ర నేత అమిత్ షా విశాఖ నడి బొడ్డున నుంచి గొప్పగా చెప్పుకున్నారు అయితే బీజేపీ ఏపీకి ఏమిచ్చినా మిగిలిన రాష్ట్రాల మాదిరిగానే ఇచ్చింది తప్ప ప్రత్యేకంగా ప్రేమ చూపించినది ఏదీ లేదని వైసీపీ మంత్రులు అంటున్నారు.

ఏపీలో తాము ఇచ్చిన నిధులతో పధకాలు అమలు చేస్తూ జగన్ ఫోటో పెట్టుకుంటున్నారు అని అమిత్ షా తో పాటు ఆ పార్టీ జాతీయ ఆధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దానికి మంత్రి గుడివాడ అమరనాధ్ కౌంటర్ ఇచ్చారు. మోడీ బియ్యం అని అంటున్నారు. కోటిన్నర మందికి ఏపీలో ఉచిత బియ్యం ఇస్తున్నాం, అందులో కేంద్రం ఇచ్చే బియ్యం తొంబై లక్షల మందికే అయితే అదనంగా మరో అరవై లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొమ్ముతోనే ఉచిత బియ్యం ఇస్తున్నామని లెక్క చెప్పారు.

రైతులకు భరోసా కింద కేంద్రం ఇచ్చే వాట గోరంతేనని తామే కొండంత చేర్చి ఇస్తున్నామని కేంద్రం వాటా నాలుగు వందల కోట్లు అయితే పదిహేను వందల కోట్ల రూపాయలు అని మరో లెక్క చెప్పారు. ఏపీలో అమలవుతున్న ప్రతీ పధకం వెనక రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఉందని, డైరెక్ట్ గా నగదు బదిలీ పధకం కింద రెండూ పది లక్షల కోట్ల రూపాయలను కేవలం వైసీపీ ప్రభుత్వమే ఇచ్చిందని గుర్తు చేశారు.

ఏపీకి కేంద్రం ఇవ్వాల్సింది కొండంత ఉంటే దాని గురించి మాట్లాడడం మానేసి ఈ విమర్శలు ఏంటి అని గుడివాడ ఫైర్ అవుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరానికి పూర్తి స్థాయిలో నిధులు లేవని విశాఖ స్టీల్ ప్లాంట్ ని  ప్రైవేట్ పరం చేస్తున్నారని మండిపడ్డారు. వెనకబడిన జిల్లాలకు ఏడాదికి ఇచ్చే మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడంలేని గుడివాడ ప్రశ్నిస్తున్నారు.