ఇక అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను మ‌రిచిపోవాల్సిందే!

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను మ‌రిచిపోవాల్సిందే అని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన లాజిక్ ఆలోచింప‌జేసేలా వుంది. అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్…

క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను మ‌రిచిపోవాల్సిందే అని వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చెప్పిన లాజిక్ ఆలోచింప‌జేసేలా వుంది. అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇవ్వ‌డాన్ని స‌వాల్ చేస్తూ, వివేకా కుమార్తె డాక్ట‌ర్ న‌ర్రెడ్డి సునీత సుప్రీంకోర్టులో వేసిన పిటిష‌న్‌పై ఇవాళ విచార‌ణ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

విచార‌ణ‌కు సీబీఐ హాజ‌ర‌య్యేలా ఆదేశించాల‌ని డాక్ట‌ర్ సునీత కోర‌డంపై సుప్రీంకోర్టు బెంచ్ అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది. అది త‌మ ప‌ని కాద‌ని తేల్చి చెప్పింది. విచార‌ణ చేయాలా? వ‌ద్దా? అనేది సీబీఐ చూసుకుంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయాలా? వ‌ద్దా? అనేది సీబీఐ చూసుకుంటుంద‌ని ధ‌ర్మాస‌నం పేర్కొంది. ఈ నేప‌థ్యంలో ర‌ఘురామ‌కృష్ణంరాజు సీబీఐ విచార‌ణ‌, అవినాష్‌రెడ్డి అరెస్ట్‌పై ఘాటు వ్యాఖ్య‌లు చేశారు.

గ‌త నెలాఖ‌రులో అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయ‌గా, రెండు వారాలైనా సుప్రీంకోర్టును సీబీఐ ఎందుకు ఆశ్ర‌యించ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ఇదే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీ‌నివాసుల‌రెడ్డి కుమారుడికి ఢిల్లీ హైకోర్టు లిక్క‌ర్ కేసులో మ‌ధ్యంత‌ర బెయిల్ ఇవ్వ‌గా, ఈడీ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తిని ఆయ‌న గుర్తు చేశారు. ఒక‌వేళ ఈ నెల 19న డాక్ట‌ర్ సునీత‌కు సుప్రీంకోర్టులో ఊర‌ట ల‌భించినా, అదంతా సాంకేతిక అంశంగానే ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఎట్టి ప‌రిస్థితుల్లోనూ సీబీఐ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని తేల్చి చెప్పారు. అందుకే తెలంగాణ హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను సీబీఐ స‌వాల్ చేయ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ఇంత‌కాలం అవినాష్‌రెడ్డిని ఇదిగో, అదిగో అరెస్ట్ చేయ‌డానికి కేంద్ర బ‌ల‌గాలను సీబీఐ దింపుతోంద‌ని గోల చేసిన వాళ్లంతా ఇప్పుడు అదేం లేద‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.