తగ్గేదేలే…వదిలేదెలే…!

తగ్గేదేలే …వదిలేదెలే అంటున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. కొంతకాలం కిందట కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం మీద, ప్రధాని మీద ఫైర్ అవుతున్న కేసీఆర్ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలైతే…

తగ్గేదేలే …వదిలేదెలే అంటున్నారు తెలంగాణా సీఎం కేసీఆర్. కొంతకాలం కిందట కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్రప్రభుత్వం మీద, ప్రధాని మీద ఫైర్ అవుతున్న కేసీఆర్ ఇంకా దాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అసలైతే హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయం నుంచే కేంద్రం మీద, ప్రధాని మోడీ మీద కేసీఆర్ దాడి మొదలైంది. హుజూరాబాద్ లో ఓడిపోయాక తగ్గుతాడేమో అనుకున్నారు. కానీ తగ్గలేదు.

వరి ధాన్యం గొడవ లేవదీశారు. అది కొన్నాళ్ళు నడిపారు. పార్లమెంటులోనూ టీఆర్ఎస్ ఎంపీలు గొడవ చేశారు. ఒకప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి అలసిపోయిన గులాబీ పార్టీ అధిపతి చాలా కాలం సైలెంటుగా ఉండి కొత్తగా పీపుల్స్ ఫ్రంట్ నినాదం అందుకున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేసితీరాలని కంకణం కట్టుకున్నారు. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఫలితాలకు ముందు మాహారాష్ట్రకు వెళ్లి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేను, శరద్ పవార్ ను, జార్ఖండ్ వెళ్లి అక్కడి సీఎం హేమంత్ సొరేన్ ను కలిశారు.

అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మట్టి కరుస్తుందని కేసీఆర్ కలలు కన్నారు. అందుకే అప్పట్లో మంచి దూకుడు మీద ఉన్నారు. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా దేశ రాజకీయాలకు గుండెకాయలా భావించే యూపీలో మరోసారి బీజేపీ విజయఢంకా మోగించింది. దీంతో కేసీఆర్ కలవరపడ్డారు. ఇదేమిటీ కథ అడ్డం తిరిగిందని అనుకున్నారు. ఇక కేసీఆర్ వెనక్కు తగ్గుతారేమో, నీరుగారిపోతాడేమో అనుకున్నారు. కానీ మోడీ, బీజేపీ వ్యతిరేకతను వదులుకోదల్చుకోలేదు.

ముచ్చింతల్ లోని చినజీయర్ ఆశ్రమంలో రామానుజ విగ్రహాన్ని ప్రారంభించడానికి మోడీ వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్లని సంగతి తెలిసిందే. ఆ తరువాత నుంచి ముచ్చింతల్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. పనిలోపనిగా రాష్ట్ర గవర్నర్ తమిళిసైని కూడా అవమానించారు. ఆమె మేడారం జాతరకు వెళ్ళినప్పుడు స్వాగతం పలకలేదు. బడ్జెట్ సమావేశాలకు ఆమెను పిలవలేదు. కారణం ఆమె బీజేపీ మనిషి కాబట్టి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని, కూటమి ఏర్పాటు చేయాలనే లక్ష్య సాధన కోసం ఆయన మళ్ళీ సిద్ధమవుతున్నారు. 

మళ్ళీ వరి ధాన్యం కేంద్రం కొనాలని గొడవ లేవదీశారు. అంతకు ముందు బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ కేవలం ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేయాలనే కేసీఆర్ ఆలోచనకు చుక్కెదురైంది. కాంగ్రెస్ లేకుండా బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటయ్యే అవకాశం లేదని ఆయన కలిసిన కొందరు నాయకులు చెప్పారు. కానీ అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయింది. కాంగ్రెస్ లేని ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రాంతీయ పార్టీల అధినేతలను ఒప్పిస్తారేమో మరి. కేసీఆర్ తొందరలోనే మళ్ళీ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరబోతున్నారు.

ఉగాది తరువాత ఆయన ఆ పని పెట్టుకుంటారు. ఆయన ప్రధానంగా ఢిల్లీ వెళ్లి ఆప్ అధినేత, పంజాబ్ లో తన పార్టీని అధికారంలోకి తెచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కలుసుకుంటారు. ఇప్పుడాయన యాదాద్రి ఉద్ఘాటన కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. ఈ నెల 28 న జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. యాదాద్రి కార్యక్రమాల తరువాత ఉగాది వస్తోంది. ఈసారి ఉగాదిని ప్రభుత్వం తరపున ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ప్రభుత్వం తరపున ఉగాదిని నిర్వహించక మూడేళ్లయింది.

2019 లో లోక్ సభ ఎన్నికలు వచ్చాయి. తరువాతి రెండేళ్లు కొవిడ్ గొడవే సరిపోయింది. అందుకే ఈసారి ఘనంగా నిర్వహించాలని అనుకుంటున్నారు. దాని తరువాత కేసీఆర్ మళ్ళీ జాతీయ రాజకీయాలపై విజృంభిస్తారు. రాష్ట్రాలు తిరిగి బీజేపీ కూటమి గురించి చర్చలు జరుపుతారు. కేసీఆర్ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.