రాజకీయాల్లో మిత్రులు, శత్రువులు ఎవరూ శాశ్వతం కాదు. రాజకీయ సమీకరణలన్నీ అనుకున్నట్టు జరగకపోతే మిత్రువులు కాస్త ప్రత్యర్థులు అవుతారు. నిన్నటి వరకూ పరస్పరం దూషించుకున్న వాళ్లు దగ్గరవుతారు. ఈ నేపథ్యంలో జనసేన, బీజేపీ మధ్య పొత్తు ఎంత కాలం సాగుతుందనే చర్చ జరుగుతోంది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ ప్రసంగం విన్న తర్వాత తాము చెప్పినట్టు వింటాడని బీజేపీ నమ్ముతుందని అనుకోలేం.
ఈ నేపథ్యంలో రెండేళ్లు ముందుగానే జనసేనాని రాజకీయంగా తన వైఖరి బయట పెట్టుకోవడంపై బీజేపీ ఒకింత సంతోషపడుతోంది. పవన్ నిజ స్వరూపమేంటో నెమ్మదిగా బయట పడుతుండడం వల్ల అప్రమత్తం అయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రానున్న రోజుల్లో తమను కాదని జనసేనాని తోక జాడిస్తే, ఏం చేయాలనే అంశంపై బీజేపీ ఓ నిర్ణయానికి వచ్చినట్టే కనిపిస్తోంది. అందుకు తగ్గట్టు అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ కసరత్తు చేస్తోంది.
ప్రధానంగా జనసేనతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం వెనుక సామాజిక సమీకరణలే ఎజెండా. పవన్‌కల్యాణ్ వెనుక మెజార్టీ కాపు సామాజిక వర్గం ఉంటుందని బీజేపీ నమ్ముతోంది. దీనికి తోడు సినీ అభిమానుల బలం ఎన్నికల్లో కలిసి వస్తుందని బీజేపీ అంచనా. ఒకవేళ ఏదైనా కారణంతో జనసేనాని తమను కాదని టీడీపీ కలిసి వెళ్లే పక్షంలో ఏం చేయాలో ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా కాపు సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు తెలివిగా బీజేపీ రిజర్వేషన్ అంశాన్ని పదేపదే తెరపైకి తెస్తోంది. తాము అధికారంలోకి వస్తే లేదా కొన్ని స్థానాల్లోనైనా ఎంపీలుగా గెలిపిస్తే కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పిస్తామనే బలమైన హామీని తెరపైకి తేనుంది. అందుకే రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్‌లో కాపుల రిజర్వేషన్‌పై ప్రశ్నించారు.
రాష్ట్ర ఓబీసీ జాబితాలో ఏ సామాజిక వర్గాన్ని చేర్చడానికైనా రాష్ట్రపతి ఉత్తర్వులు అవసరం లేదని కేంద్ర సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి ప్రతిమా భౌమిక్ తెలిపారు. తగిన ప్రక్రియను అనుసరించి రాష్ట్ర ఓబీసీ జాబితాకు సవరణలు చేపట్టే పరిధి రాష్ట్రానికి ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్‌పై టీడీపీ, జనసేన గట్టిగా మాట్లాడే పరిస్థితి ఉండదు.
ఒకవేళ ఆర్థిక వెనుకబడిన అగ్రవర్ణాల వారికి కేంద్రం కల్పించిన (ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్) 10 శాతం రిజర్వేషన్లో ఐదు శాతం కాపులకు ఇస్తామంటే, మిగిలిన వారి ఓట్లు పోతాయనే భయం టీడీపీ, జనసేనను వెంటాడక తప్పదు. కానీ బీజేపీ ఆ విషయంలో భయపడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎటూ ఆ పార్టీకి ఏపీలో బలం లేదు. కనీసం 30 శాతం ఓటు బ్యాంక్ కలిగిన కాపుల్లో మెజార్టీని దక్కించుకుంటే చాలనే ఆలోచన బీజేపీలో ఉంది.
కాపు రిజర్వేషన్‌ను అడ్డు పెట్టుకుని టీడీపీ, జనసేనలతో పొలిటికల్ గేమ్ ఆడాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. రానున్న రోజుల్లో కాపులపై దృష్టి కేంద్రీకరించి బీజేపీ రిజర్వేషన్ల అంశాన్ని బలంగా వినిపించే అవకాశం ఉంది. తద్వారా ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు టీడీపీ, జనసేనలను కట్టడి చేయొచ్చనేది బీజేపీ ఎత్తుగడ. మున్ముందు ఏమవుతుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.