ఈ కామెడీలే కాస్త తగ్గించుకోవాలి లోకేష్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై వాడివేడిగా జరిగే పొలిటికల్ కామెంట్స్ మధ్య జనాలకు కాస్త వినోదం అందిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ మాత్రమే. ఆయన స్థాయికి, ఆయన మాట్లాడే మాటలకు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంపై వాడివేడిగా జరిగే పొలిటికల్ కామెంట్స్ మధ్య జనాలకు కాస్త వినోదం అందిస్తున్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నారా లోకేష్ మాత్రమే. ఆయన స్థాయికి, ఆయన మాట్లాడే మాటలకు అస్సలు పొంతన ఉండదు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి, ఏకంగా ముఖ్యమంత్రిపై ఆరోపణలు, విమర్శలు చేస్తుంటాడు. ఇంతకంటే పెద్ద కామెడీ ఇంకేం కావాలి.

ఈ విషయం తెలిసి కూడా కామెడీ పండించడమే లోకేష్ స్టయిల్. జనాలతో పాటు తన పార్టీకి చెందిన నేతలు కూడా నవ్వుకుంటున్నారనే విషయం తెలిసి కూడా సిగ్గులేకుండా రోజుకో స్టేట్ మెంట్ తో వార్తల్లోకి వస్తున్న నారా లోకేష్ తెగింపును, ఆయనపై ఆయనకున్న అతి విశ్వాసాన్ని మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడిదంతా ఎందుకంటే.. నారావారి బాబు మరో భారీ స్టేట్ మెంట్ తో ముందుకొచ్చారు కాబట్టి.

ఏ అంశం దొరక్క మద్యపాన నిషేధం, కల్తీసారా మరణాలు అనే టాపిక్ ఎత్తుకుంది టీడీపీ. దీనిపై అసెంబ్లీలో గందరగోళం సృష్టించింది. కానీ లోకేష్ కు అసెంబ్లీలో అడుగుపెట్టే అర్హత లేదాయె. మరి ఏం చేయాలి? అందుకే అంత నోరేసుకొని మీడియా ముందుకొచ్చేశారు. జబర్దస్త్ ను తలదన్నే కామెడీ పండించేశారు. మద్యనిషేధంపై ప్రజాఉద్యమం చేస్తామని తనకుతాను ప్రకటించుకున్నారు లోకేష్.

ఇంతకంటే కామెడీ ఉంటుందా?

లోకేష్ ఇచ్చిన ఆ స్టేట్ మెంట్ లోనే బోలెడంత కామెడీ ఉంది. అసలు మద్యపాన నిషేధం గురించి మాట్లాడే అర్హత తనకు, తన పార్టీకి ఉందా అనే ఆలోచన కూడా చేయకుండా లోకేష్ ప్రజాఉద్యమం అనే పెద్ద పదం వాడేశారు. గతంలో దివంగత ఎన్టీఆర్ మద్యపాన నిషేధం తీసుకొస్తే, ఆ స్ఫూర్తికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు.

అంతెందుకు.. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు చేసిన పని ఏదైనా ఉందంటే.. అది బెల్టు షాపులకు అనుమతి ఇవ్వడమే. ఊరువాడా అనే తేడాలేకుండా అనుమతులు ఇచ్చేశారు. ప్రతి ఊరిలో గుడి ఉండదేమో కానీ, బెల్టుషాపు మాత్రం ఉండేది. ఆ స్థాయికి ఏపీకి దిగజార్చారు.

అలాంటి దారుణమైన పరిస్థితుల్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొచ్చారు జగన్. వేల సంఖ్యలో బెల్టుషాపులు మూసేశారు. కొత్త అనుమతులు క్యాన్సిల్ చేశారు. పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేశారు. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు రేట్లు సైతం పెంచారు. ఓవైపు ప్రభుత్వం ఇంత చేస్తుంటే.. మరోవైపు లోకేష్, మద్యపాన నిషేధంపై ప్రజా ఉద్యమం చేస్తానంటూ సినిమా డైలాగులు కొడుతున్నారు

ట్విట్టర్ ఉద్యమం బెటరేమో

నిజానికి లోకేష్ ఏం చేసినా ట్విట్టర్ లో చేయడం బెటర్. అది ప్రజాఉద్యమం అయినా సరే. ఎందుకంటే అతడు ట్విట్టర్ లో ఉంటేనే సేఫ్. తన టీమ్ తో అక్షరదోషాలు లేకుండా ట్వీట్లు పెట్టించుకుంటేనే మంచిది. 

బయటకొస్తే, ఇలానే లేనిపోని డైలాగులు చెప్పి తన పరువు, తన పార్టీ పరువు బజారున పెట్టుకుంటారు. అయితే సామాన్య ప్రజలు మాత్రం లోకేష్ బయటకు రావాలనే కోరుకుంటున్నారు. డైలాగులు కొట్టాలనే డిమాండ్ చేస్తున్నారు. అది వాళ్లకు వినోదం మరి.