దర్శకుడు రాజమౌళి కొత్త ట్రెండ్ కు తెరతీసారు. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ సినిమాకు చేసినన్ని ఇంటర్వూలు మరే సినిమాకు జరగలేదు. ఏ సినిమాకైనా ఇంటర్వూలు ప్రమోషన్ కోసం చేయడం అన్నది కామన్. కానీ అది ఏ మీడియాకు ఆ మీడియానే చేసుకుంటాయి. కానీ రాజమౌళి ఆ ట్రెండ్ ను పక్కన పెట్టారు.
ఇండస్ట్రీలో ఎంత మందిని వాడగలరో అంతమందిని వాడేసి, తమకు తామే ఇంటర్వూలు చేయించేసుకున్నారు. ఇది అయితే బెటర్ కదా..అక్కరలేని ప్రశ్నలు ఎదురుకావు. తమకు కావాల్సినవే అడిగించుకోవచ్చు. సమాధానాలు చెప్పుకోవచ్చు. మీడియా జనాలైతే ఏవేవో అడుగుతారు. మంత్రి నానిగారితో సంబంధాలు ఎలా వున్నాయి అని ఎన్టీఆర్ ను అడిగినా అడుగుతారు.
అందుకే ఈ బాధ అంతా ఎందుకు అని వరుసపెట్టి ఇంటర్వూల మీద ఇంటర్వూలు తామే చేయించేసుకున్నారు. అనిల్ రావిపూడి, కీరవాణి, రానా, సందీప్ వంగా, సుమ, గీతా భగత్ ఇలా ఒకటి కాదు రెండు కాదు…అవే ఇంటర్వూలు. రాజమౌళి తమను ఎంత కష్టపెట్టాడు. ఎంత గొప్ప ఫెర్ ఫెక్షనిస్టు అని వీళ్లు….అసలు చరణ్ ఎంత గొప్ప నటుడు..తనకు ఎంత నటన వచ్చో తనకే తెలియదు, అలాగే ఎన్టీఆర్ నటన అమోఘం అంటూ ఈయన…
మొత్తం మీద సినిమా గురించి చెప్పిందే..చెప్పిందే..చెప్పిందే చెబుతూ ఇంటర్వూలు కానిచ్చేసారు. ఇక మిగిలింది సమీక్షలు మాత్రమే.
చూస్తుంటే రాజమౌళి డైరక్షన్ గురించి హీరోలు, హీరోల నటన గురించి దర్శకుడు సినిమా విడుదల కాగానే సమీక్షలు కూడా రాసేసేలా వున్నారు. లేదా మీడియా సమీక్షలు రాస్తే ఏదోదో రాస్తుంది..అవి కూడా మనమే రాసి వదిలేద్దాం అని ఆ దిశగా కొత్త ప్రయత్నం చేసేస్తారేమో?