దేశం యింత అధ్వాన్నంగా వుండడానికి కారణం అత్తలే అని ఎవరైనా కనిపెట్టి నిరూపిస్తే వారికి డాక్టరేటు యివ్వడానికి నేను రెడీ. ‘అత్తల బాధితుల సంఘం’ అని పెట్టి, అత్తలను అణచు అరవై విధానములను ఆరువారాల్లో ఉచితంగా నేర్పుతామంటూ ఎవరైనా వస్తే ‘నన్ను మహారాజపోషకుడిగా తీసుకో స్వామీ’ (వచ్చినవాడి పేరు స్వామి కాకపోయినా సరే) అంటాను నేను. ఇది విని అత్తగారి శనిగ్రహం పాలబడిన దశమగ్రహాల్లో నేనొకణ్ని అనుకుంటే తమరు కాస్త కాలికింద చూసుకోవాలి. ఖచ్చితంగా పప్పు వుంటుంది.
ఎందుకంటే నాకింకా పెళ్లే కాలేదు. తల్లీతండ్రీ లేని పిల్ల జమీందారుగానే జీవితాన్ని లాగించేయదలచుకున్న శాల్తీని నేను. కాలిమీద కాలు వేసుకుని బతికేటంత యిచ్చిపోయిన పెద్దలు ఆ కాలు వేసిపెట్టే మనిషిని ఏర్పాటు చేసిపెట్టకపోవడంతో ఆ పని నేనే నా నెత్తిన వేసుకుని అచలపతి అనే సహాయకుడు, సచివుడు, సఖుడు.. వగైరా ఆల్-యిన్-ఒన్ని పెట్టుకున్నాను. అతను మేధావి అన్నమాట నిజమే కానీ, అతను ఆదుకోకపోతే నేను గంతుగంతుకీ గోతుల్లో పడుతూ వుండేవాణ్ననే లోకుల మాటలు నమ్మకండి.
ఇంతకీ నా కోపం ఎవరిమీద అంటే – మేనత్తల మీద. మా పెద్ద మేనత్త మాంకాళి గురించి తర్వాత ఎప్పుడైనా చెప్తాను కానీ చిన్న మేనత్త ఉషారత్తయ్య గురించి చెప్పడానికి యి వేదికను ఉపయోగించుకుంటున్నాను. తన అసలు పేరు ఉష. కానీ సినారె లాగ అన్నిట్లో హుషారె కాబట్టి ఉషారత్తయ్య అని మాబోంట్లచే పిలవబడుతుంది. ఇంత హుషారైనావిడంటే నాకెందుకు కోపమో యీ కథ పూర్తయేసరికి మీకే తెలుస్తుంది. అప్పుడు మీరే ‘అనంతూ, ఎలా భరించావయ్యా యిన్నాళ్లూ యిలాటి మేనత్తను..’ అని నా గురించి చాలా యిదై పోతారు.
‘పోస్ట్’ అంటూ పోస్ట్‌మ్యాన్ ఉత్తరం పడేసి వెళ్లాడు’ – అనే వాక్యంతో పాతకాలం కథలు ఎలా ప్రారంభమయ్యావో అలాగే ‘ఫోన్’ అని అచలపతి నాకు ఫోన్ అందించడంతో యీ కథ ప్రారంభమవుతోంది. ‘హలో’ అని నేననడం తరువాయి, ‘ఏరా బడుద్ధాయ్, నిద్ర లేచావా? అక్కడికీ నీ బారసాల నాడు మీ నాన్నకు నేను చెబుతూనే వున్నాన్రా ‘అనంతశయనం’ అని పేరు పెట్టవద్దని.. అయినా విన్నాడు కాదు. చెవిలో మీ అమ్మ ఏం వూదిందో ఏమో, బియ్యంలో అదే రాసేశాడు. ఆ పేరు బలం అలాటిది, ఎప్పుడు చూసినా వెధవ నిద్రా నువ్వూనూ. ‘బారెడు పొద్దెక్కింది, చిన్నత్తయ్య ఫోన్ చేస్తుందేమో’ అని లేచి రెడీగా ఫోన్ దగ్గర వుండవలసిన పని లేదూ..!?’’ అని దండకం చదివింది ఉషారత్తయ్య.
నిన్న రాత్రి ద్రవం పూర్తిగా దిగిపోయిందని హామీ యిచ్చాక సమస్య ఏమిటో చెప్పింది. మా అత్తయ్యకు బాగా డబ్బుండడంతో పాటు పనీ పాటా లేకపోవడం వలన తమిళంలో ‘కుంకుమం’ అనే పత్రికను చూసి ‘పసుపు’ అనే పత్రిక పెట్టింది. (ఎల్లో మీడియా అని ‘సాక్షి’ వాళ్లు ఎద్దేవా చేస్తారని చెప్పినా వినలేదు. ఫ్రీ పబ్లిసిటీ వచ్చి కనీసం టిడిపి వాళ్లయినా కొంటారంది) ఆ పత్రిక నడపాలన్నా, సేల్సు పెంచాలన్నా డబ్బు కావాలి. అత్తయ్య ఇనప్పెట్టి తాలూకు తాళం చెవి మావయ్య చేతిలో వుంది. ఆయన పేరు మరోటి వున్నా అత్తయ్య ‘సింగరాజు లింగరాజు’ అని మా దగ్గర తిడుతూ వుంటుంది. వరశుల్కమో, ఏమో అదేదో నాటకంలో లోభి పాత్ర పేరట అది. ఏం చేసినా ఆ పత్రిక అమ్మకాలు పెరగవని, ఆ బూడిదలో పన్నీరు పోయనని మామయ్య భీష్మించాడని అత్తయ్య కన్నీరుమున్నీరవుతూ చెప్పింది.
‘‘..పోస్తే ఏం పోయింది? సువాసన విబూది అని పొట్లాలు కట్టి అమ్మవచ్చుగా..’’ అన్నాను మధ్యమధ్యలో ఏదో ఒకటి అనాలని. కన్నీరు లావా అయి నన్ను ముంచెత్తింది. ‘‘ఒరేయ్, తింగరి వెధవా, నిజంగా పన్నీరు పట్టుకు వచ్చి పోయడ్రా.. అది ఒక ఉపమానం. తెలుగు రాని వాళ్లంతా ముఖ్యమంత్రులవుతారని ఆశ పెట్టుకోకురా. ఇప్పటికైనా నేర్చుకో..’’
ఇలా యింకో ఇరవై, ముప్ఫయి తిట్ల తర్వాత చెప్పిన విషయం ఏమిటంటే – శేషమణి అనే ఓ రచయిత్రి వుందిట. ఆవిడ ఏళ్ల తరబడి సాగే టీవీ సీరియల్స్ రాయడంతో ‘సశేషమణి’గా పేరు బడిందట. ఆవిడ తన పత్రికకు సీరియల్ రాస్తే తన మహిళా పాఠకురాళ్లందరూ ఆ జీడిపాకానికి అతుక్కుపోతారనీ, అమ్మకాలే అమ్మకాలని వూరించి, అత్తయ్య మావయ్యని ఒప్పించి వాళ్ల వూరికి అతిథులుగా పిలిచింది. సశేషమణి తన భర్త రాజారావుతో, మావగారు రంగారావుతో కలిసి వచ్చింది. అత్తయ్య ఆతిథ్యం, వాళ్ల వంటవాడు భీమారావు వంటకాలతో కరిగి ఆవిడ ఓ లక్ష రూపాయలిస్తే సీరియల్ రాస్తానంది.
‘‘..కానీ మా సింగరాజు ఏభైకి మించి విదల్చనంటాడు. అందుకే నిన్ను రమ్మనమంటున్నాను.’’ అంది అత్తయ్య. ‘‘నేను వచ్చి ఏం చేస్తానత్తయ్యా? మావయ్య చెయ్యి గట్టిగా పట్టుకుని రెండు సార్లు విదిల్చి రెండు యాభైలు రాల్చాలా?’’ అడిగి చూశా అయోమయంలోనే. ‘‘చెయ్యీ వద్దు, కాలూ వద్దు. నా దగ్గర ఓ ఉపాయం వుంది. ఫోన్లో చెప్పేది కాదు. నువ్విక్కడకి వస్తే చెప్తా. శనాదివారాలు యిక్కడ వుండేట్లు రా.’’ అని ఫోన్ పెట్టేసింది అత్తయ్య. అలా పెట్టేసిందంటే అది సుగ్రీవాజ్ఞే అన్నమాట. ఇక్కడ కావాలనే ఆ మాట వాడాను. ఎందుకంటే అత్తయ్య నిజంగా కిష్కింధావాసే. కాలేజీలో వుండేటప్పుడు తెగ డేరింగ్‌గా అల్లరి చేసేదట.
అత్తయ్యది ఎంత కుట్రపూరితమైన కుట్రో మీక్కూడా తెలుస్తుంది కాస్సేపట్లో. అసలు నాకు రచయిత్రులంటేనే భయం. కాటన్ చీర కట్టుకుని, కళ్లజోడు ముక్కుమీద, చెయ్యి గడ్డం కింద పెట్టుకుని, కలాన్ని వేళ్ల మధ్య యిరికించి, దీర్ఘంగా ఆలోచిస్తూన్నట్టు కనబడుతూంటారని నా ఫిర్యాదు. అలాగే వుండే రచయిత్రికి బవిరిగడ్డం వేసుకుని పిచ్చిచూపులు చూసే ఓ చిత్రకారుడితో పెళ్లి చేయండి. ఆ మొగుడికి తెల్లగడ్డం, లోతుకళ్లు వున్న లావు చిత్రకారుణ్ని నాన్నగా చేయండి. ఆ ముగ్గుర్ని కలిపి ఓ సెట్టుగా తయారుచేసి ఓ సాయంత్రం మునిమాపు వేళ మీ మీదకు వదిలితే ఎలా ఫీలవుతారు? ఇంత ఘోరం చేసినా నేను అత్తయ్యను ‘‘అత్తయ్యా’’ అని పలకరించాను.
పరిచయాలవుతూండగానే ఆ బవిరిగడ్డం మొగుడు ‘‘మీరు జేబులో పిల్లిని పెట్టుకుని తిరుగుతారా?’’ అని అడిగాడు. లేదన్నాను. ‘‘వెంట్రిలాక్విజం నేర్చుకుంటున్నారా?’’ అన్నాడు. అదీ లేదన్నాను. మరి పిల్లి చేసే మ్యావ్ శబ్దం ఎక్కణ్నుంచి వస్తోందన్నాడు. పుస్తకాల్లో మాత్రమే పిల్లులు అలా అంటాయని, నిజం పిల్లులు య వత్తు సరిగ్గా పలకలేక, మావ్ అంటాయని, చైనాలో మాత్రం బెంగాలీ భాష ప్రభావం వలన, స్థానిక రాజకీయ వాతావరణం వలన ‘మావో’ అంటాయని వివరించాను.
ఇంత జ్ఞానాన్ని అతనికి ఉచితంగా అందించినా అత్తయ్య సంతోషించలేదు. విడిగా పిలిచి పిల్లుల్ని గురించి రాజారావుతో చర్చించడమే తప్పని తిట్టిపోసింది. ఈ పిల్లుల పిచ్చి వలనే పిల్లలు పుట్టలేదని సశేషమణి కన్నీళ్లతో అత్తయ్యకు విన్నవించిందట. పెళ్లికి ముందు దాకా బాగానే వుండేవాడట. తర్వాతే యిలా, అదోరకంగా తయారయ్యాడట. దానికి కారణం యిదే అంటూ ఓ పెద్ద పెయింటింగు చూపించింది అత్తయ్య. ‘నిరాకరణ’ అని దాని పేరు. విశ్వామిత్రుడు ‘నాకు వద్దు’ అన్నట్టు తల తిప్పుకుని వెళ్లిపోతున్నాడు. ఊర్వశి బార్ గుమ్మం పక్కనుండే సుందరిలాటి అమ్మాయి ‘నాకూ వద్దు’ అన్నట్టు ఆకాశానికి ఎగిరిపోతోంది. ఓ మూల ఓ పసిపాప నేలమీద పడి వుంది. ‘‘అత్తయ్యా, నాకో అనుమానం. దేవతలు కనీసం దేవతా వస్త్రాలైనా వేసుకోవాలి కదా. ఈవిడ అవీ వేసుకోలేదేమిటి?’’ అడిగాను.
‘‘నా మొహం, దేవతా వస్త్రాలంటేనే అంత! ఈ పెయింటింగ్ రంగారావు వేశాడు. ఇది అతనికి ప్రాణప్రదమట. కొడుకుకి పెళ్లికానుకగా యిచ్చాడు. వాళ్ల డైనింగ్ హాల్లో తగిలించాడు. కానీ కొడుక్కి అది నచ్చలేదు. ఆ అప్సరస కొలతలు సరిగ్గా లేవంటాడు. అలా అని తండ్రికి చెప్పి ఆయన హృదయాన్ని గాయపరచలేడు. రోజూ భోజనం చేసేటప్పుడు ఆ బొమ్మ చూస్తూ, తిండి సయించక, మనసు పరిపరివిధాల పోయి, చివరకి అదోరకమైన తిక్కమనిషి అయిపోయాడు. లేనిపోనివన్నీ వూహించుకుంటాడు. ముఖ్యంగా పిల్లుల్ని…’’
‘‘ఈయనా పెయింటరన్నావు కదా, ఈయన స్టాండర్డ్ ఏమిటో!?’’
‘‘ఇదిగో యి పక్కనున్నది ఆయనదే..’’ అంది అత్తయ్య. అదీ మొదటిదానిలాగే వుంది. ఓ ఋషి, ఓ ఎగిరిపోతున్న దేవత (అదే బ్రాండ్ దేవతావస్త్రాలతో..) పక్కన ఓ పాప. దీని పేరు ‘శిశు జననం’. ఆ ఋషి చేతిలో త్రిశూలం వుంది కాబట్టి శివుడట. ఆ దేవత జగన్మోహినట. ఆ పాప అయ్యప్పట. ఆ ఊర్వశి కొలతలకీ, ఈ జగన్మోహిని కొలతలకీ పెద్ద తేడా కనబడలేదు నాకు. ఈ భాగ్యానికి అన్నం మానేయడం దేనికో నాకు తెలియలేదు. ఆర్టిస్టులు చాలా సెన్సిటివని, నా వంటి బభ్రాజమానాలకి అలాటివి తెలియవనీ అత్తయ్య సెలవిచ్చింది. అయితే నా వంటి బభ్రాజమానాన్ని పనిమాలా రప్పించిన కారణమేమిటని నిలదీశాను. అప్పుడు అత్తయ్య తన ప్లాను వివరించింది.
నేను అవేళ రాత్రి ఆ ‘నిరాకరణ’ పెయింటింగుని ఫ్రేమ్‌లోంచి చాకుతో కోసేసి చుట్టచుట్టి నా గదికి పట్టుకెళ్లి కాల్చేసి బూడిద చేసేయాలట. ఆ బొమ్మ నాశనం అయిపోతే రాజారావు పిచ్చి ఆటోమెటిక్‌గా తగ్గిపోతుందట. ఈ ఉపకారం చేసిపెడితే సశేషమణి ఏభైకి కాదు, నలభైకే సీరియల్ రాసి పెడతానందిట. బొమ్మ మాయం అయినందుకు నామీద అనుమానం రాదట. ఎందుకంటే ఈ చుట్టుపట్ల ఓ పెయింటింగు దొంగల ముఠా ఆపరేట్ చేస్తోందట. జమీందార్ల యిళ్లల్లో తగిలించుకున్న పాత పెయింటింగులను ఎత్తుకుపోయి విదేశాల్లో అమ్మేస్తున్నారట. ఇది కూడా వాళ్ల పనే అనుకుంటారట. కిటికీ తలుపు తీసి వుంచితే చాలట.
చాలదన్నాడు అచలపతి. కిటికీ అద్దం పగలకొడితేనే అసలు సిసలైన దొంగలనుకుంటారట. చప్పుడవదూ? అన్నాను నేను. ఓ బ్రౌను పేపరు తీసుకుని పంచదార పాకం పూసి అద్దానికి అతికించి, అరచేయి బిగించి వాటంగా గుద్దితే చప్పుడు చేయకుండా పగులుతుందట. కావాలంటే ఆ సాయం చేసి పెడతానన్నాడు. అత్తయ్య పదునైన చాకు యిచ్చి తన వంతు సహాయం చేసింది. అర్ధరాత్రి నేను చాకు పదును చూసుకుంటూండగా అచలపతి వచ్చి ‘‘అంతా సిద్ధం. కిటికీ అద్దం పగలకొట్టడం పూర్తయింది. ఇక మీ పని మీరు చేయవచ్చు’’ అని చెప్పాడు. అస్సలు చప్పుడు రాకుండా పని పూర్తి చేసుకుని వచ్చినందుకు అతన్ని అభినందిస్తూ పెయింటింగులున్న హాల్లోకి వెళ్లాను. ఆ మసక వెలుతురులోనే నా చాకుకి పని చెప్పాను. పావుగంటలో దాన్ని చుట్టి చంకలో పెట్టుకుని మేడమీది నా గదిలోకి తెచ్చాను. అచలపతి అంతలోనే స్టవ్ వెలిగించి వుంచాడు.
నేను ఆ పెయింటింగుని స్టవ్ మీద పడవేయబోతూ వుంటే అడ్డుపడ్డాడు. ‘ఒకేసారి పడేస్తే స్టవ్ ఆరిపోతుంది. ముక్కలు ముక్కలుగా కత్తిరించి పడేద్దాం.’’ అంటూ తోటలోకి వెళ్లి మొక్కలు కత్తిరించే కత్తెర తెచ్చాడు. ఈ లోపున అత్తయ్య దిగబడింది. పని పూర్తయిందని తెలిసి మురిసిపోయింది. తను కాలేజీలో చదివే రోజుల్లో చేసిన ఘనకార్యాలను గుర్తు చేసుకుని కథలు చెప్పడం మొదలెట్టింది. కథలు వింటూనే నేను పెయింటింగుని ముక్కలు చేసి అచలపతి చేతికివ్వడం, అతను దాన్ని స్టవ్ మీద కాల్చి బూడిద చేయడం అంతా హ్యాపీగా జరిగిపోతోంది. అత్తయ్య కథలో స్విమ్మింగ్ పూల్‌లో దిగిన అమ్మాయిల వస్త్రాపపహరణం సీను వచ్చేసరికి నేను కత్తెర అచలపతి చేతిలో పెట్టి అత్తయ్యకే అంకితం అయిపోయాను. ఆ క్షణంలో అచలపతి మెత్తగా దగ్గాడు, దుశ్శాలువా మింగేసినవాడు దగ్గినంత మెత్తగా ! మిన్ను విరిగి మీద పడినప్పుడు మాత్రమే అతనలా దగ్గుతాడు.
‘‘సర్, ఈ చిత్రాన్ని గీసిన ఆర్టిస్టు పేరు రంగారావు అని చెప్పినట్టు గుర్తు…’’ అని అర్ధోక్తిలో ఆగాడు. ‘‘అవును రంగారావే..’’ అంది అత్తయ్య అంతరాయానికి విసుక్కుంటూ. ‘‘..మరి రాజారావు అని సంతకం పెట్టాడేం? అది ఆయన కలంపేరా?.. క్షమించాలి.. కుంచెపేరా?’’ అన్నాడు అచలపతి.
కెవ్వుమని తూలిపడబోయాం మేం. మేధావిని కాబట్టి జరిగినది అర్థం చేసుకోవడానికి నాకైదు నిమిషాల కంటె ఎక్కువ పట్టలేదు. తండ్రి రంగారావు బొమ్మ కత్తిరించి తెచ్చేబదులు కొడుకు రాజారావు బొమ్మను కత్తిరించి తెచ్చాను నేను. రెండు ఒకలాగే ఏడవడంతో వచ్చిన యిబ్బంది యిది. కింద సంతకం చూసినా ఒకటి రెండు అక్షరాలే తేడా కాబట్టి గుర్తు పట్టలేకపోయేవాణ్ని. అత్తయ్య మళ్లీ దండకం మొదలుపెట్టింది. ఇప్పుడు రెండు అనర్థాలు వచ్చాయట. ఆ దిక్కుమాలిన ‘నిరాకరణ’ బొమ్మ స్థిరంగా వుండిపోవడం, ఈ ‘శిశు జననం’ దగ్ధమై పోవడం. రాజారావు పూర్తి పిచ్చివాడవడం ఖాయం, సశేషమణి శివాలెత్తడం ఖాయాతిఖాయం అంది.
నేను ఒప్పుకోలేదు. నే తెచ్చినదే కరక్టు బొమ్మ అని వాదించాను. కావాలంటే కిందకెళ్లి చూసి కన్ఫమ్ చేసుకుంటానని బయలుదేరాను. అలాగైనా అత్తయ్య తిట్ల దాడి తప్పించుకుందామని నా ప్లాను. మెట్లు దిగుతూండగా నాకో బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. అచలపతి ఎలాగూ కిటికీ అద్దం పగలకొట్టి వుంచాడు. దాన్లోంచి బయటకు దూకేసి, అదే పోత పోయి మా వూరు చేరితే తర్వాతి సంగతి తర్వాత చూసుకోవచ్చు అనుకున్నా. కానీ నా ప్రణాళికకు అంతరాయం కలిగింది – ఒక స్థూలకాయుడి రూపంలో! ఆ కాయం ఓ చేతిలో చాకుని, మరొక చేతి చంకలో ఓ పెయింటింగు చుట్టని ధరించి నన్ను ఢీ కొంది. ఇద్దరం కలిసి నేలమీద పడ్డాం.
నేను ముందుగా లేచి అతని చంకలోని చుట్ట లాక్కుని తెరిచి చూశా – ‘నిరాకరణ’! ఈ చిత్రరాజంపై మోజు పడిన దొంగెవరాని తేరిపార చూశా. చంద్రుడు సరిగ్గా ఆ టైముకి కిటికీ దగ్గరకు వచ్చి నాకు సహాయపడ్డాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, రంగారావు! చంద్రుడు అతనికీ సహాయపడ్డాడు – ‘‘నువ్వా, అనంత్! బతికించావ్. మా అబ్బాయి రాజా అనుకున్నాను.’’ అన్నాడు. ఆ తర్వాత మెట్లమీద కూర్చునే ఐదు నిమిషాల్లో కథ చెప్పేశాడు. ఆ బొమ్మ అతనికి ప్రాణం కంటె ఎక్కువట. భార్య పోయిన దగ్గర్నుంచి ఆ బొమ్మలోని మేనకనే (వార్నీ, ఊర్వశి కాదూ, వీళ్ల మొహాలు పట్టించుకోకపోవడంతో గుర్తు పట్టలేకపోయాను సుమా!) చూస్తూ తన జీవితభాగస్వామిగా భావించేవాడట.
అలాటిది కొడుకు పెళ్లివేళ పుత్రవాత్సల్యమైకం కమ్మేసి అతనికి బహుమతిగా యిచ్చేశాడట. దురదృష్టవశాత్తూ ఆ కొడుక్కి కూడా ఆ బొమ్మ విపరీతంగా నచ్చేసి, ఎప్పుడూ దాని ఎదురుగానే కూర్చుని తదేకంగా చూస్తూ ఏదేదో గొణుక్కుంటూ వుండేవాడట. నా బొమ్మ నా కిచ్చేయ్ అని అడగడానికి యితనికి అభిమానం (రెండు రకాలా) అడ్డు వచ్చిందట. ఇక్కడికి వచ్చాక, చుట్టుపట్ల బొమ్మల దొంగలు పడుతున్నారని తెలిసాక ఐడియా వచ్చిందట, దీన్ని కట్ చేసి తన దగ్గర పెట్టేసుకుంటే దొంగలే ఎత్తుకుపోయారని అనుకుంటారని ! ఇప్పణ్నుంచి కొడుక్కి దూరంగా వేరే వూళ్లో యీ బొమ్మను చూస్తూ శేషజీవితం గడుపుతాడట. నేను యిదేమీ కొడుక్కి చెప్పకూడదట.
ఆర్టిస్టులకి కాస్త పైత్యం అంటే ఏమిటో అనుకున్నాను. బొమ్మ నచ్చక కొడుక్కి పిచ్చెక్కితే, నచ్చి పిచ్చెక్కిపోతున్నాడని తండ్రి అనుకుంటున్నాడు. కథ అర్థమయ్యేసరికి నాకు కాస్త తల తిరిగినట్టయింది. మెట్లమీద కూలబడ్డాను. ఇంతసేపు ఆలస్యమెందు కైందంటూ అత్తయ్యా, అచలపతీ వచ్చేశారు. అత్తయ్యను ఛీర్ అప్ చేయడానికి నేను కాస్త హుషారుగానే చెప్పాను, ‘‘మీ సశేషమణి కథ సుఖాంతమే. ఆవిడ భర్తను పట్టి పీడిస్తున్న బొమ్మ మాయమైంది.’’ అని. ‘‘దాని సంగతి సరే, నీ చవటపని వలన తన భర్త వేసిన పెయింటింగు కూడా మాయమైందని గ్రహిస్తుంది కదరా చవట్చవటా!’’ అత్తయ్య చేసిన పునరుక్తి దోషాన్ని గుర్తిస్తూనే తను చెప్పినదానిలో పాయింటుందని గ్రహించాను. అచలపతీ గ్రహించినట్టున్నాడు. సగం దగ్గు దగ్గి ‘‘మేడమ్, దీనికి నాకొక పరిష్కారం తడుతోంది.’’ అన్నాడు. ‘‘చెప్చెప్చెప్పు..’’ అంది అత్తయ్య ఆతృతగా.
‘‘తెల్లవారేసరికి సశేషమణిగారు యి హాల్లోకి వచ్చి చూసేసరికి, కిటికీ అద్దం పగిలి వుంటుంది… రెండు పెయింటింగ్సూ మాయమై వుంటాయి. నేలపై అనంత్‌గారు అచేతనంగా పడి వుంటారు! ఆమె రచయిత్రి. జరిగినది ఊహించుకోగలదు. చిత్రపటాల అంతర్జాతీయ చోరుల ముఠావారు తన కుటుంబసభ్యుల చిత్రపటరాజాలను దొంగిలించడానికి కిటికీ అద్దం పగలకొట్టి వుంటారని, ఆ చప్పుడు విని పెయింటింగ్సును రక్షించడానికి దొంగలతో పోరాడి, ఆ క్రమంలో అనంత్‌గారు క్షతగాత్రులై అచేతనంగా పడి వుంటారని సులభంగానే అర్థం చేసుకుంటారు. అనంత్గారిపై కలిగే కృతజ్ఞతాభావం మీపై కూడా ప్రసరించకపోదు.’’
అత్తయ్య ఎగిరి గంతేసే లోపున నేను అత్తయ్య భుజాన్ని అదిమి పెట్టి‘‘అచలపతీ, మంచి ఫ్లోలో చెప్పావు కానీ, నీ ప్లానులో ఓ ఫ్లా వుంది. నేను అచేతనంగా పడి వుండడం ఎలా సంభవిస్తుంది? అసలు అచేతనం అంటే ఏమిటో నాకు తెలియదు కూడా..’’ అన్నాను. ‘‘..నాకు తెలుసు’’ అంటూ అత్తయ్య మూలనున్న మావయ్య చేతికర్ర పైకి ఎత్తడం మాత్రమే నాకు గుర్తుంది.
నాకు మెలకువ వచ్చేసరికి మర్నాడు మధ్యాహ్నం అయిందట. కళ్లు విప్పి ‘‘నేనెక్కడున్నాను?’’ అనేసరికి అత్తయ్య కసురుకుంది. ‘‘వెధవ పాత సినిమా డైలాగూ నువ్వూను. కొత్తరకంగా అడగలేవురా?’’ అని. తిట్టిందే కానీ నా జుట్టు నిమురుతూ జరిగినది ఒక్క గుక్కలో చెప్పింది. సశేషమణి అచలపతి వూహించినట్టే అనుకుందట. అంతర్జాతీయ ముఠావారు ఎత్తుకుపోయేటంత స్థాయి తన బొమ్మకు వున్నందుకు రాజారావు తెగ సంతోషపడి పిల్లుల గురించి మాట్లాడడం మానేశాడట. రంగారావు తీర్థయాత్రలకు వెళ్లిపోతున్నానని ఉత్తరం రాసి పెట్టి వెళ్లిపోయాడట. సశేషమణికి మామగారి పీడా, ఆయన బొమ్మ పీడా ఒకేసారి వదిలినందుకు సంతోషించి సీరియల్ ముప్ఫయివేలకే రాసి యిస్తానందిట. మామయ్య దగ్గర ఏభై పుచ్చుకుని అత్తయ్య ఆ ఇరవైవేల బ్లాక్‌మనీ స్విస్‌బ్యాంకులో వేస్తుందట. ఖాతా ఎలా తెరవాలని అడిగింది.
‘‘అంతా బాగానే వుంది కానీ, మధ్యలో నా గుండు బద్దలైంది కదా..’’ అన్నాను.
‘‘ఆమ్లెట్టు కావాలంటే గుడ్డు పగలాల్సిందే కదా..’’ అంది అత్తయ్య వేదాంతిలా ముద్ర పట్టి.
‘‘కొటేషన్ బాగుంది. సొంతమేనా..?’’
‘‘..కాదు, అచలపతిది. రాత్రి చేతికర్ర అందిస్తూ చెప్పాడు. భలే కొటేషన్లు కొడతాడురా, ఏం తింటాడో కానీ..’’ అంది అత్తయ్య! – (పి.జి. ఉడ్‌హౌస్ రాసిన ‘‘జీవ్స్ మేక్స్ యాన్ ఆమ్లెట్’’ కథ ఆధారంగా)
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2022)