మాజీ మంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ డాక్టర్ సునీత సర్వోన్నత న్యాయస్థానం మెట్లు ఎక్కి, ఇవాళ వార్నింగ్‌కు గురి కావాల్సి వచ్చింది. సుప్రీంకోర్టులో డాక్టర్ సునీతకు ఒకింత షాక్‌కు గురయ్యే పరిణామాలు ఎదురయ్యాయి. సునీత వ్యక్తిగత పంతాలు, పట్టింపులకు పోయి, ఎలాగైనా అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనే సామాన్య ప్రజానీకం అభిప్రాయమే ఇవాళ సుప్రీంకోర్టులో ప్రతిబింబించింది.
అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్ విచారణలో భాగంగా సుప్రీంకోర్టులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి సునీత కోరుకున్నట్టు ఏమీ జరగలేదు. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ ఎ.అమానుల్లా నేతృత్వంలోని బెంచ్ విచారించింది. తానే వాదనలు వినిపిస్తానని డాక్టర్ సునీత కోర్టును అభ్యర్థించింది. అయితే నష్టపోతావని, సీనియర్ అడ్వొకేట్ సిద్ధార్థ లుథ్రా సాయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించడం గమనార్హం.
ప్రస్తుతం పిటిషన్ వెకేషన్ బెంచ్ విచారించాల్సినంత అత్యవసరం ఏముందని సునీతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగే అరెస్ట్ చేయాలా? వద్దా? అనేది సీబీఐ చూసుకుంటుందని ధర్మాసనం హితవు చెప్పింది. ఈ కేసులో చాలా సాంకేతిక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఇంటరాగేషన్ సంగతిని సీబీఐ చూసుకుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ కేసులో తొందరపడి వ్యక్తిగతంగా వాదనలు వినిపించాలనుకుంటే నష్టపోతారని, మీరు న్యాయశాస్త్రంలో నిష్ణాతులు కాకపోవచ్చని, పిటిషన్‌ను డిస్మిస్ చేస్తే.. తర్వాత వచ్చే లాయర్‌కు సమస్య ఎదురవుతుందని సుప్రీంకోర్టు సున్నితంగా వార్నింగ్ ఇచ్చింది. సెలవుల తర్వాత ఈ కేసును పరిశీలిద్దామా? అని అడిగింది.
సీనియర్ లాయర్ లుథ్రా: ఈ నెలాఖరులోపు దర్యాప్తు ముగింపునకు సీబీఐకి ఇచ్చిన గడువు ముగుస్తుందని సీనియర్ లాయర్ లుథ్రా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పుడు కోర్టు ఘాటుగా స్పందించింది. మీరు సమస్యలు సృష్టిస్తున్నారని సీరియస్ కామెంట్ చేసింది. వాదనలు వద్దంటున్నా, మీరు తలదూర్చాలనుకుంటున్నారని, ఈ కోర్టులోనే ఒక బెంచ్ విధించిన గడువుపై మళ్లీ ఉత్తర్వులు ఇవ్వాలా? అని బెంచ్ నిలదీసింది.
డాక్టర్ సునీత జోక్యం చేసుకుంటూ విచారణకు హాజరు కావాలని సీబీఐని ఆదేశించాలని కోరారు. ఆ విధంగా తాము ఎలా ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రశ్నించింది. విచారణకు రావాలా? వద్దా? అనేది సీబీఐ ఇష్టమని వ్యాఖ్యానించడం గమనార్హం. మీరు ఆరోపిస్తున్న నిందితుడు మీ కజినా? అని జడ్జి ప్రశ్నించారు. తనకు సెకెండ్ కజిన్‌గా సునీత పేర్కొన్నారు. కేసును ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు వెకేషన్ బెంచ్ పేర్కొంది.