వారాహి యాత్ర.. నిర్మాతలకు డబుల్ ఖర్చు?

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సెట్ లో దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్…

ఉస్తాద్ భగత్ సింగ్ కోసం హైదరాబాద్ లో భారీ సెట్ వేస్తున్నారు. ఆర్ట్ డైరక్టర్ ఆనంద్ సాయి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సెట్ లో దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక కాలిపోయిన హరిహర వీరమల్లు సెట్ ను మళ్లీ పునరుద్ధరించారు. భారీగా ఖర్చు చేసి సెట్ ను తిరిగి తీర్చిదిద్దారు. అటు అల్యూమినియం ఫ్యాక్టరీలో ఓజీ సినిమా కోసం కూడా పెద్ద సెట్ వేశారు. అందులో ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ చేశారు.

ఇప్పుడీ సెట్స్ అన్నీ పక్కన పడేయబోతున్నారు. పవన్ కోసం మరోసారి ఫ్రెష్ గా సెట్స్ వేయబోతున్నారు. కొన్ని సినిమాల షెడ్యూల్స్ మార్చబోతున్నారు. దీనికి కారణం వారాహి యాత్ర.

పవన్ వారాహి యాత్ర మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పవన్ ను కలిసేందుకు, అతడితో సినిమాలు చేస్తున్న నిర్మాతలంతా మంగళగిరి వచ్చారు. నిజానికి ఇలా ఎప్పుడూ జరగలేదు. పవన్ కోసం నిర్మాతలు మంగళగిరికి రావడం తక్కువ. ఉన్నఫలంగా ఇలా నిర్మాతలంతా పవన్ వారాహి యాత్ర సందర్భంగా రావడం, యాగంలో పాల్గొనడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అసలు మేటర్ ఇప్పుడు బయటపడింది.

పవన్ వారాహి యాత్రకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆయన నటిస్తున్న సినిమాల షూటింగ్స్ అన్నింటినీ మంగళగిరి, విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మేరకు నిర్మాతలందరి నుంచి ప్రకటనలు కూడా వచ్చాయి. ఇన్నాళ్లూ ఏపీలో రాజమండ్రి, మారేడుమిల్లి ప్రాంతాల్లో షూటింగ్స్ చేశామని, ఇకపై గుంటూరు, మంగళగిరి, విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్స్ చేస్తామని అంతా ముక్తకంఠంతో ప్రకటించారు.

తాజా ప్రకటనతో హైదరాబాద్ లో వేసిన సెట్స్ అన్నీ పనిచేయకుండా పోయాయి. అలాంటి సెట్ నే గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో వేస్తారా లేక ఆ సెట్స్ ను అలానే ఉంచి.. ఫ్రెష్ గా మరో షెడ్యూల్ ను ఏపీ లో స్టార్ట్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది.

పవన్ వారాహి యాత్రతో యూనిట్స్ అన్నీ ఇప్పుడు మరోసారి తమ షెడ్యూల్స్ మార్చుకునే పనిలో పడ్డాయి. అయితే ఇక్కడే మరో చిక్కు ఉంది. పగలంతా పవన్ వారాహిలో పర్యటిస్తే, రాత్రి షూటింగ్ చేస్తారా..? లేక ఒక రోజు పర్యటన, మరో రోజు షూటింగ్ టైపులో షెడ్యూల్స్ ప్లాన్ చేస్తారా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా నిర్మాతలకు అదనపు ఖర్చు తప్పేలా లేదు.