కొన్ని గంటల్లో వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో పోలీసుల అనుమతి లేకపోవడంపై జనసేనలో టెన్షన్ నెలకుంది. వారాహి యాత్ర ప్రారంభం రచ్చకు దారి తీస్తుందనే ఆందోళన లేకపోలేదు. ఈ నేపథ్యంలో వారాహి యాత్రపై జనసేన టెన్షన్‌ను జగన్ సర్కార్ పోగొట్టింది. ఎట్టకేలకు వారాహి యాత్రకు అనుమతి ఇస్తున్నట్టు కాకినాడ ఎస్పీ సతీష్‌కుమార్ ప్రకటించారు. దీంతో జనసేన ఊపిరి పీల్చుకుంది.
వారాహి యాత్రను అడ్డుకునేందుకు జగన్ సర్కార్ కుట్రకు తెరలేపిందంటూ జనసేన నేతలు విమర్శలు గుప్పించారు. అసలు తమకు పవన్ యాత్రల్ని అడ్డుకునే ఉద్దేశమే లేదని, ఆయన జనంలో బాగా తిరగాలని కోరుకుంటున్నామని అధికార పార్టీ నేతలు చెబుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు మినిట్ టు మినిట్ పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ ఇవ్వాలని జనసేన నేతల్ని అడిగామని, వారు ఇస్తే సానుకూల నిర్ణయం తీసుకుంటామని కాకినాడ ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఎట్టకేలకు కాకినాడ ఎస్పీ కోరినట్టుగానే వారాహి యాత్రకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను పోలీస్ అధికారులకు జనసేన నేతలు ఇచ్చారు. దీంతో యాత్రకు అనుమతి లభించింది. ఈ సందర్భంగా కాకినాడ ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చట్టానికి లోబడి ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకుని యాత్రకు సంబంధించి పూర్తి వివరాలు అడిగామన్నారు. పవన్ పర్యటనకు ఎలాంటి అభ్యంతరం లేదని కాకినాడ ఎస్పీ తేల్చి చెప్పారు.
జనసేన నాయకులు తమ డీఎస్పీలతో ఎక్కడికక్కడ టచ్‌లో ఉన్నట్టు ఎస్పీ తెలిపారు. జనసేన నాయకులు, పవన్ అభిమానులు శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా వారాహి యాత్ర నిర్వహించాలని ఎస్పీ సూచించారు. కాకినాడ జనసేన నాయకుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ వారాహి యాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారని స్పష్టం చేశారు. బుధవారం ఉదయం వారాహికి ప్రత్యేక పూజలు చేసి, అన్నవరం స్వామిని పవన్ దర్శించుకుంటారన్నారు. కత్తిపూడిలో మొదటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.