యువగళం పాదయాత్ర ఎట్టకేలకు ఇవాళ్టికి రాయలసీమలో లోకేశ్ పూర్తి చేసుకోనున్నారు. నెల్లూరు మీదుగా లక్ష్యం దిశగా ఆయన అడుగులు పడనున్నాయి. తాజాగా లోకేశ్ విమర్శలపై కడప ఎంపీ అవినాష్‌రెడ్డి అదిరిపోయే పంచ్ విసిరారు. తాను కూడా సీమ వాసినే అని లోకేశ్ చెప్పడంపై అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.
వైఎస్సార్ జిల్లా బద్వేలులో నిర్వహించిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ తనలో ఉన్నదీ సీమ రక్తమే అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలన్నారు. సవాల్ చేయాలంటే చరిత్ర వుండాలన్నారు. అడ్డుకోవాలంటే దమ్ముండాలని లోకేశ్ చెప్పారు. ఈ రెండూ వైసీపీ నేతలకు లేవన్నారు. లోకేశ్ కామెంట్స్‌పై అవినాష్‌రెడ్డి ఫైర్ అయ్యారు.
రాయలసీమలో పాదయాత్ర చేస్తే తప్ప లోకేశ్‌కు తాను ఈ ప్రాంత వాసి అని గుర్తు రాదా? అని ప్రశ్నతో కూడిన పంచ్ విసిరారు. చంద్రబాబునాయుడి వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వైసీపీపై అబద్ధాలు, అసత్యాలు చెబుతున్నాడని ధ్వజమెత్తారు. 14 ఏళ్లు అధికారంలో గుర్తుకు రాని రాయలసీమ ఇప్పుడే గుర్తు కొచ్చిందా? అని అవినాష్‌రెడ్డి నిలదీశారు. లోకేశ్ మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఆయన చెప్పుకొచ్చారు.
రాయలసీమపై విషం చిమ్మడమే లక్ష్యంగా చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ రాజకీయ విమర్శలు చేయడం తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంత ప్రజల అభిమానాన్ని చూరగొనడానికి తాను కూడా సీమ వాసినే అని లోకేశ్ చెప్పుకోవాల్సి రావడం దయనీయం. తమకు తాముగా సీమ వాసులుగా చంద్రబాబు, లోకేశ్ సర్టిఫికెట్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితిని వారు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మనిషిగా సీమ వాసే అయినప్పటికీ, ఆయన మనసంతా ఇతర ప్రాంతాలపైన్నే. ఎందుకంటే రాయలసీమలో కేవలం 52 అసెంబ్లీ స్థానాలే ఉన్నాయి. కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో 123 అసెంబ్లీ సీట్లు వుండడంతో, సీమను వారికి వ్యతిరేకం చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందవచ్చని ఇంత కాలం విషం చిమ్ముతూ వచ్చారు. అయితే ఆ ప్రాంతవాసుల్లో కూడా చంద్రబాబుపై నమ్మకం సడలుతోంది. ముఖ్యంగా తన సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే అమరావతిలో రాజధాని ఏర్పాటు చేశారని మూడు ప్రాంతాల వాసులు బలంగా నమ్ముతున్నారు.
తాను కూడా సీమ వాసినే అని గర్వంగా చెబుతున్న లోకేశ్, పుట్టి, పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కనీసం రాయలసీమలో తండ్రీతనయులకు సొంత నివాస సముదాయం కూడా లేదు. నారావారిపల్లెలో వారసత్వంగా లభించిన ఇల్లు తప్ప, ఈ ప్రాంతంపై మమకారంతో చంద్రబాబు సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేదు. ఇటీవల విమర్శలు వెల్లువెత్తడంతో కుప్పంలో సొంతింటి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అది కూడా అనేక అడ్డంకులతో ముందుకు సాగడం లేదు. లోకేశ్‌ను అవినాష్‌రెడ్డి ప్రశ్నించిన అంశం చర్చనీయాంశమైంది.