జనసేనాని పవన్‌కల్యాణ్‌కు ప్రచారం కల్పించేందుకు ఎల్లో మీడియా అఇష్టంగా వుంది. అయితే టీడీపీకి రాజకీయంగా ప్రయోజనం కలిగించేలా పవన్‌కల్యాణ్ నడుచుకుంటారనే ఏకైక కారణంతో వారాహి యాత్రకు ప్రచారం కల్పించడానికి ముందుకొస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి ఈ నెల 14న పవన్‌కల్యాణ్ వారాహి యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈ నేపథ్యంలో మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. ఒక రోజు ముందుగానే పవన్ అన్నవరం చేరుకోనున్నారు. ఇప్పటికే అన్నవరంలో జనసేన హడావుడి మొదలైంది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ సామాజిక వర్గం బలంగా వుంది. దీంతో అక్కడి నుంచే వారాహి యాత్ర మొదలు పెట్టడం మంచిదనే ఉద్దేశంతో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
వారాహి యాత్రకు సంబంధించి ఎల్లో మీడియా ఆచితూచి ప్రచారం ఇవ్వడానికి నిర్ణయించినట్టు సమాచారం. ఇంత కాలం పవన్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలనివ్వననే నినాదంతో ముందుకెళ్లడం చూస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు దఫాలు చంద్రబాబుతో పవన్ భేటీ అయ్యారు. పొత్తులపై చర్చించారు. జనసేన గౌరవానికి భంగం వాటిల్లకుండా సీట్లు కేటాయిస్తేనే పొత్తు వుంటుందని ఇప్పటికే పవన్ బహిరంగంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో సోషల్ మీడియాలో జనసేనకు కేవలం 20 సీట్లు మాత్రమే ఇస్తారనే ప్రచారాన్ని నమ్మొద్దని పవన్ చెప్పారు.
టీడీపీ- జనసేన మధ్య పొత్తు ఖాయమని తేలింది. అయితే సీట్లపైనే చర్చంతా. జనసేనకు నామమాత్రంగా సీట్లు కేటాయించి, పవన్ సామాజిక వర్గీయులతో పాటు అభిమానుల మద్దతు పొంది రాజకీయంగా అత్యధికంగా ప్రయోజనం దక్కించుకోవాలని టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నట్టు 20 సీట్లు మాత్రమే టీడీపీ ఇస్తామంటే, పొత్తు కుదరకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.
అందుకే పవన్‌కు ఊరికే ప్రచారం కల్పించడం వల్ల చేజేతులా కొత్త సమస్యను సృష్టించుకున్నట్టు అవుతుందనే భయం ఎల్లో మీడియాను వెంటాడుతోంది. మరోవైపు లోకేశ్ పాదయాత్ర సాగుతున్న క్రమంలో దాన్ని డామినేట్ చేయకుండా పవన్‌కు ప్రచారం కల్పించాలని ఎల్లో మీడియా భావిస్తోంది. మొత్తానికి పవన్ వారాహి యాత్రపై పచ్చ బ్యాచ్‌లో ఎక్కడో అసంతృప్తి, అసహనం దాగి ఉన్నాయి. అది ఎంత మేరకనేది రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది.