జనసేనాని మూడు పడవల ప్రయాణం

కొందరు ఒక పడవలో ప్రయాణం చేయకుండా రెండు పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. దీన్నే రెండు పడవల్లో కాళ్ళు పెట్టడం అంటారు. అంటే ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేయడమన్న మాట.  Advertisement కొందరికి…

కొందరు ఒక పడవలో ప్రయాణం చేయకుండా రెండు పడవల్లో ప్రయాణం చేస్తుంటారు. దీన్నే రెండు పడవల్లో కాళ్ళు పెట్టడం అంటారు. అంటే ఒకే సమయంలో వివిధ రకాల పనులు చేయడమన్న మాట. 

కొందరికి ఒక పనే సరిగా చేసే సామర్ధ్యం ఉండదు. అయినప్పటికీ తాము అన్ని పనులు చేయగలమన్న అతి ధీమాతో రెండు పడవల్లో కాళ్ళు పెడుతుంటారు. ఇలాంటివారు చివరకు ఏ పనీ సరిగా చేయలేరు. ఇప్పటివరకు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న పని ఇదే. ఆయన సినిమా రంగం, రాజకీయాలు అనే రెండు పడవల్లో కాళ్ళు పెట్టి ప్రయాణిస్తున్నారు. 

సినిమా హీరోగా ఆయనకు ఇప్పటికీ ఆదరణ ఉండటం ఆయన అదృష్టం. కానీ ఆయన రాజకీయాలే ఒక దశ దిశా లేకుండా సాగుతున్నాయి. ఆయన రాజకీయ సినిమా ఫ్లాప్ మూవీ కింద లెక్కే. ఇందుకు గత ఎన్నికలే తార్కాణం. 

ఆ ఎన్నికల్లో పార్టీయే కాకుండా, తాను కూడా రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయినా దాని నుంచి ఆయన పాఠాలు నేర్చుకోలేదు. ఏపీలో వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నప్పటికీ ఇప్పటి నుంచే ఎన్నికల వాతావరణం నెలకొంది. అధికార వైసీపీ, టీడీపీ ఆల్రెడీ ఎన్నికల మూడ్ లోకి వచ్చేశాయి. 

ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ఇప్పటినుంచే సర్వ శక్తులు కూడగట్టుకుంటున్న సంగతి చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ జనసేనానిలో పెద్దగా కదలిక కనబడటం లేదు. ఆయన కట్టుదిట్టంగా మిలట్రీ వాహనంలా తయారుచేయించుకున్న వారాహి వాహనం రోడ్డెక్కలేదు. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలోనూ పోటీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే మూడో పడవలో కాలు పెట్టాడన్న మాట. వాస్తవానికి ఇప్పటివరకు తెలంగాణలో ఉనికి, ఊసు లేని జనసేన రాష్ట్రంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందట. 

ఆంధ్రప్రదేశ్ లోనే కాదు.. తెలంగాణలోనూ జనసేన జెండా ఎగురవేసేందుకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారు. ఆంధ్రలో మొదలైన ఊపును ఉద్యమాల గడ్డ తెలంగాణలోనూ చవిచూపించేందుకు రంగం సిద్ధం చేశారు. మంగళగిరిలో చేస్తున్న యాగాల సాక్షిగా తెలంగాణ జనసైనికులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ పోరు తెలంగాణలో బాధ్యులను నియమించి ఇక్కడ కూడా తమ జెండా పాతుతాం అంటూ సంకేతాలిచ్చారు. 

జనసేన పార్టీ బలమైన శక్తిగా మారుతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఉనికిని కాపాడుకుంటూ బలమైన భావజాలానికి కట్టుబడి ఉంటే మంచి రోజులు వాటంతట అవే వస్తాయని అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 1300 మంది ఆత్మబలిదానాలు చేశారు. వాళ్ల ఆకాంక్ష అయిన నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ యువతకు అందకపోతే ప్రత్యేక రాష్ట్రం సాధించి నిష్ప్రయోజమన్నారు. ఊరికి పదిమంది బలంగా నిలబడటం వల్లే ఈ రోజు ప్రత్యేక తెలంగాణ సాకారం అయ్యిందన్నారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 26 నియోజకవర్గాలకు ఇంచార్జులని నియమించారు. వారందరికీ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా  పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “జనసేన పార్టీ యూత్ వింగ్ తో ప్రారంభమై… ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. జనసేన భావజాలానికి ఆకర్షితులైన యువత ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ భావాన్ని పట్టుకొని ముందుకెళితే ఏదైనా సాధించగలం. తెలంగాణ అభివృద్ధి సాధించాలి, ఉద్యమ ఆకాంక్ష నెరవేరాలి అనేది జనసేన ఆకాంక్ష. ఏ రాజకీయ పార్టీలోనూ ఇంతమంది కొత్తవారికి ఆవకాశం ఇవ్వరు. అవకాశాన్ని సరదాగా తీసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని” అన్నారు. 

తెలంగాణా ఎన్నికల్లో పోటీ చేయాలని పవన్ నిజంగానే సీరియస్ గా ఉన్నారా? సీరియస్ గా ఉంటే కనుక ఆయనకు ఎక్కువ సమయం మాత్రం లేదు. ఈ సంగతిని ఆయన గుర్తించారా ?