ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుల సంఖ్యాపరంగా ఇప్పుడు కాస్త బలంగానే కనిపిస్తుంటుంది. అయితే అందులో సగం మంది తెలుగుదేశం పార్టీ కోవర్టులు అనే సంగతి అందరికీ తెలిసిన సంగతే.
ఇప్పుడు ఆ పచ్చ కోవర్టులందరూ తమ గళం పెంచే అవకాశం కనిపిస్తోంది. రకరకాల కారణాల వల్ల చాలా మంది తెలుగుదేశం నాయకులు గత కొన్నేళ్లుగా బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. వారిలో కొందరు అడపా దడపా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. జగన్, కేంద్రంలోని పెద్దలతో సన్నిహితంగా మెలగినప్పుడు వాళ్లు కాస్త సైలెంట్ అయిపోయేవారు. ఇలా పాపం జగన్ ను తిట్టాలో తిట్టకూడదో మీమాంసలో ఉండేవాళ్లు. మొత్తానికి వారంతా చంద్రబాబు స్కెచ్ ప్రకారం కమలదళంలోనే కొనసాగుతూ వచ్చారు.
ఇప్పుడు వారందరికీ ఒక్కసారిగా సంకెళ్లు తెంచేసినట్లు అయింది. జెపి నడ్డా, అమిత్ షా ఇద్దరూ తమ తమ బహిరంగసభల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి పాలన మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన నేపథ్యంలో వారందరికీ జోష్ వచ్చింది. నెమ్మదినెమ్మదిగా ఎవరి స్థాయిలో వాళ్లు జగన్ సర్కారు మీద విరుచుకుపడడానికి సిద్ధం అవుతూ వచ్చారు.
చంద్రబాబునాయుడు ప్లాంట్ చేసిన కోవర్టులుగా చాలా మంది పచ్చ నాయకులు కాషాయదళంలో చేరారు. చంద్రబాబునాయుడు స్కెచ్ మేరకు వారిలో చాలా మంది ఇప్పటిదాకా సైలెంట్ గానే ఉంటూ వచ్చారు. ఇప్పుడు వారికి నోరు పెగలుతోంది.
చాలా కాలం వరకు తెలుగుదేశంలో ఉండి విచ్చలవిడి విమర్శలతో ఆకట్టుకుంటూ వచ్చి హఠాత్తుగా బిజెపిలో చేరి కొంతకాలంగా ఆ పార్టీలో ఉన్న యామినీశర్మ సుదీర్ఘకాలం సైలెన్స్ తరువాత ఇప్పుడు జగన్ సర్కారు మీద విరుచుకుపడుతున్నారు.
కడుపులో బిడ్డ మొదలు, గర్భిణులు, బాలింతలకు అండగా ఉంటూ కేంద్రం పథకాలు ప్రవేశపెట్టి 60-70 శాతం నిధులు కేటాయిస్తోంటే వైసీపీ ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడుతోందని భాజపా మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి సాధినేని యామినీశర్మ ఆరోపిస్తున్నారు. కేంద్రం పథకాలకు జగన్ తన స్టిక్కర్లు అంటించుకుని మురిసిపోతున్నారని అంటున్నారు. యామినీశర్మ ఒక ఉదాహరణ మాత్రమే.
చంద్రబాబునాయుడు వ్యూహానికి అనుగుణంగా.. ప్రస్తుతం బిజెపిలో ఉన్న పచ్చ నాయకులు అందరూ యాక్టివేట్ అయితే.. జగన్ సర్కారు మీద మరిన్ని నిందలు వేస్తూ.. బిజెపి జగన్ సర్కారును టార్గెట్ చేస్తున్నట్టుగా ప్రజల్లో భావన కలిగించడానికి ప్రయత్నించబోతున్నారని సమాచారం.
అమిత్ షా, నడ్డాల అడుగుజాడల్లోనే తాము నడుస్తున్నామని పైకి చెప్పుకుంటూ చంద్రబాబు వ్యూహాన్ని వారు అమలు చేయబోతున్నారు. ఎన్నికలు వచ్చే సమయానికి ఈ పచ్చనాయకులు అందరూ బిజెపి టికెట్లు పుచ్చుకుని బరిలోకి దిగాలనే పథక రచనతో ఇలా జరుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు.