ఏపీ బీజేపీలో అలకల పర్వం. కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి పార్టీ తీరుపై అలకబూనారు. ఇటీవల కడపలో సీమభేరి సభ జరిగింది. ఈ సభలో బైరెడ్డి రాజశేఖరరెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. రాయలసీమ ప్రగతి కోసం రాజకీయ జీవితాన్ని త్యాగం చేసిన తనకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, కేవలం అధికార పార్టీని రెచ్చగొట్టే ప్రసంగాలకే బీజేపీ పరిమితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సీమ ఉద్యమంలో సుదీర్ఘ అనుభం కలిగిన బైరెడ్డి రాజశేఖరరెడ్డికి సభలో మాట్లాడే అవకాశం ఇవ్వనందుకు బాధ్యత వహిస్తూ పార్టీ తో పాటు వ్యక్తిగతంగా తాను క్షమాపణలు చెబుతున్నట్టు సోము వీర్రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంతటితో బైరెడ్డి సంతృప్తి చెంది, తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని ఆ పార్టీ నాయకత్వం భావించింది. కానీ బైరెడ్డిలో కోపం చల్లారలేదు.
ఈ నెల 20,21 తేదీల్లో కర్నూలులో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశాలకు బైరెడ్డి గైర్హాజరయ్యారు. బీజేపీ దక్షిణాది రాష్ట్రాల ఇన్చార్జ్ సుప్రకాశ్, రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ దియోధర్, మధుకర్, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్న ఈ సమావేశానికి బైరెడ్డి హాజరు కాకపోవడంపై చర్చనీయాంశమైంది.
ఇదే సభలో బైరెడ్డి తనయ శబరి మాట్లాడేందుకు మైక్ తీసుకున్న సందర్భంలో రెండు నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించాలని అదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు అనడం కొత్త వివాదానికి దారి తీసింది.
ఇది తమ కుటుంబాన్ని అవమానపరచడమే అని బైరెడ్డి తనయ శబరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ నుంచి తమను వెళ్లగొట్టేందుకు కొందరు పొమ్మనకుండా పొగబెడుతున్నట్టు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, తనయ శబరి సన్నిహితుల వద్ద అంటున్నారని తెలిసింది. వ్యక్తిగతంగా శబరి మంచి వ్యక్తిగా అని పేరు.
బీజేపీ సమావేశాలకు బైరెడ్డి వెళ్లొద్దని నిర్ణయించుకున్నా, తాను వెళుతున్నానని, కనీసం దాన్నైనా గమనంలోకి తీసుకోకుండా బీజేపీలోని కొందరు నేతలు అవమానిస్తున్నారని శబరి వాపోతున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో బీజేపీలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి, శబరి కొనసాగడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.