విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాలలో ఉందని కేంద్రం తొలిసారి చాలా వివరణాత్మకంగా స్పష్టం చేసింది. దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయల నష్టం ఈ రోజుకు వచ్చిందని కూడా పేర్కొంది. ఇలా నష్టాల బారిన పడిన కర్మాగారాన్ని మోయడం మా వల్ల కాదు అని తెగేసి చెబుతోంది.
విశాఖ ఉక్కు ఉత్పాదన కూడా తక్కువ అని కొత్త విషయం చెప్పుకొచ్చింది. నిజానికి విశాఖ ఉక్కు ఉత్పత్తి కెపాసిటీని ఎంత వీలు అయితే అంత దాకా పెంచుకోవచ్చు. కానీ కేంద్రం మాత్రం ఈ విషయాన్ని కూడా మైనస్ గా చూపిస్తోంది. అదే టైం లో సొంత గనులు లేవు కాబట్టే నష్టాలు వస్తున్నాయన్న ఏపీ వాదనను పూర్తిగా కొట్టిపారేస్తూ సొంత గనులు ఇచ్చినా ఉక్కు కర్మాగారం లాభాల బాట పట్టదని నిర్ధారించేశారు.
మొత్తానికి చూస్తే విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం పూర్తిగా క్లారిటీతో ఉందని, ఎటువంటి శషబిషలు పెట్టుకోవాల్సిన పని లేదని చల్లని నీళ్ళు మరోసారి జల్లి మరీ ఏపీకి చాటి చెప్పిందని అంటున్నారు. విశాఖ ఉక్కు విషయం మీద రాజమండ్రీ ఎంపీ మార్గాని భరత్ ఈ రోజు పార్లమెంట్ లో ప్రశ్నను అడిగారు. విశాఖ ఉక్కు ఒక సెంటిమెంట్ అని ఆయన చెప్పుకొచ్చారు.
వేలాది ఎకరాలు ప్రజలు ఉదారంగా భూములను ఇచ్చారని గుర్తు చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధిని కల్పించే కల్పతరువు లాంటి విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేయవద్దు అని ఆయన డిమాండ్ చేశారు.
లాభాల బాటన ఉక్కు నడిచే మార్గాలను తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సరికే కేంద్రానికి లేఖ రూపంలో రాశారని గుర్తు చేశారు. ఇలా ఎన్నో విషయాలు విశాఖ ఉక్కు విషయంలో వెనక్కి తలొగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేయడమే ఇక్కడ విశేషం.
అన్ని రకాలుగా ఆలోచించే నష్టాల బాటన ఉన్న విశాఖ స్టీల్ ని ప్రైవేట్ పరం చేద్దామని నిర్ణయించామని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి రామచంద్ర ప్రసాద్ సింగ్ జవాబు ఇవ్వడం అంటే విశాఖ స్టీల్ మీద పూర్తిగా ఆశలు వదుకోవడమే అని అర్ధమవుతోంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప విశాఖ ఉక్కు ప్రైవేట్ బాటన నడవక తప్పదనే అంటున్నారు.