‘నాటు-నాటు’ వెనక సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

నాటు నాటు సాంగ్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ ఊపు తీసుకొచ్చిన పాట. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో, అందులో హీరోలిద్దరూ కలిసి వేసిన స్టెప్ అంతకంటే పెద్ద హిట్టయింది. ఆ స్టెప్ లో…

నాటు నాటు సాంగ్.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓ ఊపు తీసుకొచ్చిన పాట. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో, అందులో హీరోలిద్దరూ కలిసి వేసిన స్టెప్ అంతకంటే పెద్ద హిట్టయింది. ఆ స్టెప్ లో సింక్ కోసం చాలా కష్టపడ్డామని, ప్రమోషన్స్ లో చరణ్-తారక్ కూడా చెప్పుకొచ్చారు. కాళ్లు నొప్పి పెట్టాయని, ఓ రోజంతా రెస్ట్ తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.

స్టెప్ లో సింక్ కోసం రాజమౌళి తమను బాగా ఇబ్బంది పెట్టారని కూడా ఓపెన్ గానే చెప్పారు హీరోలిద్దరు. మరి ఆ సింక్ కోసం రాజమౌళి ఎందుకు అంత పట్టుబట్టాడు. ఆ సీక్రెట్ ను తాజాగా రివీల్ చేశాడు జక్కన్న. సినిమాలో ఎమోషన్ కు, ఆ సింక్ స్టెప్ కు లింక్ ఉందని వెల్లడించాడు.

“ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. ఇవి అసలు సాధ్యమేనా అన్నట్టు హీరోలిద్దరూ యాక్షన్ సీన్స్ చేస్తుంటారు. ఇద్దరూ కలిసి సింక్ లో యాక్షన్ చేస్తుంటే.. చూసిన ప్రేక్షకుడు తనకు తెలియకుండానే దాన్ని అంగీకరిస్తాడు. ఎందుకంటే, నాటు నాటు పాటలో ఇద్దరూ చాలా సింక్ లో డాన్స్ చేశారు కాబట్టి, ఫైట్ లో కూడా అదే సింక్ ఉంటుందని ప్రేక్షకుడు మనసులో అనుకుంటాడు. ఫైట్స్ చేస్తున్నప్పుడు రామ్-భీమ్ పాత్రలు రెండూ చాలా సమన్వయంతో ఫైట్ చేస్తాయి. ఇద్దరి మధ్య ఆ సింక్ ఉందని ప్రేక్షకుడు ఒప్పుకోవాలంటే, నాటు-నాటు పాటలో సింక్ చూపించాల్సిందే. అందుకే ఆ సింక్ స్టెప్ కోసం వాళ్లిద్దరూ చాలా కష్టపడ్డారు.”

ఇలా సింక్ స్టెప్ వెనక సీక్రెట్ ను బయటపెట్టాడు రాజమౌళి. కేవలం కమర్షియల్ ఎలిమెంట్ కోసం నాటు నాటు సాంగ్ ను పెట్టలేదంటున్నాడు ఈ దర్శకుడు. సినిమాలో ఆ పాట కూడా ఓ చిన్న స్టోరీ చెబుతుందంట.

“కమర్షియల్ గా చూసుకుంటే మంచి డాన్స్ నంబర్ ఉండాల్సిందే. కాకపోతే కథలో అలాంటి డాన్స్ నంబర్ పెట్టాలంటే సందర్భం రావాలి. సినిమాలో ఇద్దరి మధ్య మంచి సింక్ ఉందని చెప్పే ప్రయత్నం అది. దాని కోసమే నాటు నాటు సాంగ్ ను ఉపయోగించుకున్నాను. రిలీజ్ చేసిన సాంగ్ లో వాళ్లిద్దరూ సింక్ లో డాన్స్ చేయడం మాత్రమే చూపించాను. కానీ ఆ పాటలో ఓ ఎమోషన్ ఉంది. ఆ పాట కూడా ఓ చిన్న స్టోరీ చెబుతుంది.”

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.