రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవని అంటారు. 9 ఏళ్ల వయసున్న జనసేన పార్టీది కూడా ఆత్మహత్యా సదృశ్యమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నట దిగ్గజం ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని హస్తగతం చేసుకుని రికార్డు సృష్టించారు. వర్తమాన అగ్రహీరో పవన్‌కల్యాణ్ జనసేనను స్థాపించి 9 ఏళ్లైంది. ప్రశ్నించడానికే పార్టీని స్థాపించిన రీల్ హీరో, రాజకీయ తెరపై మాత్రం జీరో అయ్యారు.
పవన్‌కల్యాణ్ స్వీయ తప్పిదాలే జనసేన పతనానికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జనసేన అద్భుతాలు సృష్టిస్తే కదా… అది పతనమైందని చెప్పడానికి అనే వాళ్లు లేకపోలేదు. జనసేనాని విద్వేష మనస్తత్వమే ఆయన పార్టీని దహించి వేస్తోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు కేజ్రీవాల్‌ను తీసుకుంటే, ప్రత్యామ్నాయ శక్తిగా ఆప్ రూపంలో వచ్చి, అందుకు తగ్గ ఫలితాలు సాధించారు.
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయ కూటమిగా, వాటికి దూరంగా ఉంటూ తన మార్క్ రోల్‌మెడల్‌ను దేశానికి ఆచరణలో చూపారు. అందుకే ఇవాళ ఆయన దేశానికే ఓ ఆశాదీపం అయ్యారు. దివంగత ఎన్టీఆర్, కేజ్రీవాల్ లాంటి ఆదర్శ నాయకులతో పవన్‌ను పోల్చడం అంటే, వారిని అవమానించడమే అని పౌర సమాజం అభిప్రాయపడుతోంది. తన వ్యక్తిగత ఈర్ష్యా అసూయలను జనంపై రుద్దాలనే తపనే తనను రోజురోజుకూ బలహీనపరుస్తోందని పవన్ గుర్తించడం లేదు.
ఒకవేళ గుర్తించినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అక్కసు, అలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ప్రేమ అనే బలహీనతలు పవన్ ఎదుగుదలకు ప్రతిబంధకాలయ్యాయి. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో కలిసి ముందుకెళ్లాలని భావిస్తున్న జనసేనాని పవన్‌కల్యాణ్ చివరికి తన పార్టీని కుదించడానికి కూడా సిద్ధమయ్యారా? అంటే …ఔననే సమాధానమే వస్తోంది. జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆ పార్టీ అధినేత సినీ అభిమానులంతా పవన్‌కల్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు.
అదేంటోగానీ, పవన్ మాత్రం చంద్రబాబు సీఎం కావాలని కోరుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక్కడే పవన్ సామాజిక వర్గం తీవ్ర అసహనం, ఆగ్రహానికి గురి అవుతోంది. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ ఆవేశంతో ఊగిపోతూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చనని స్పష్టం చేశారు. పవన్ వైఖరిపై మిత్రపక్షమైన బీజేపీ మండిపడుతోంది. సీఎం అభ్యర్థిగా పవన్‌క ల్యాణ్‌ను ముందు పెట్టి, రానున్న ఎన్నికల్లో తలపడాలని భావిస్తున్న బీజేపీకి మిత్రుడి అంతరంగం మింగుడు పడడం లేదు.
పవన్‌కల్యాణ్ మాత్రం టీడీపీ కోసం చివరికి తన పార్టీని బలి పెట్టేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. దీనికి ముద్దుగా మదింపు అనే పేరు పెట్టారు. కానీ ఆయన చేసేది జనసేన కుదింపు అని ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, కాపు సామాజికవర్గ నేతలు మండిపడుతున్నారు. ఉగాది తర్వాత జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ నియోజకవర్గాల వారీగా పార్టీ ప్రగతిపై సమీక్షిస్తారని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.
రెండో విడత క్రియాశీల సభ్యత్వ నమోదుతో పాటు పలు అంశాలు చర్చిస్తామని ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులు, ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షుల మదింపు వుంటుందని నాదెండ్ల కీలక వ్యాఖ్యలు చేయడంపై జనసేనలో తీవ్ర చర్చకు తెరలేపింది. నాయకుల పనితీరు అంచనా వేసేందుకు సభ్యత్వ నమోదు ప్రాతిపదికగా తీసుకుంటామని నాదెండ్ల చెప్పడం వెనుక కుట్ర లేకపోలేదని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
స్వయంగా జనసేనానే తన శ్రేణులకు సరైన రోడ్‌మ్యాప్ ఇవ్వని నేపథ్యంలో పార్టీ ఎలా బలోపేతం అవుతుందని నాయకులు ప్రశ్నిస్తున్నారు. మదింపు అంటే… పవన్‌కల్యాణ్ పనితీరుపై మొదటగా రివ్యూ చేపట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. సినిమాల షూటింగ్‌లు లేని రోజుల్లో మాత్రమే వచ్చి ట్వీటో లేక వీడియోనో విడుదల చేస్తే… పార్టీ బతికి బట్ట కడుతుందా? అని ప్రశ్నిస్తున్నారు.
ఉగాది తర్వాత తన సామాజిక వర్గం బలంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలను ఎంచుకుని, మిగిలిన వాటిని టీడీపీకి ధారాదత్తం చేయడానికి రంగం సిద్ధమైందని జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గతానుభవాల దృష్ట్యా ఈ ప్రచారాన్ని ఎవరూ కొట్టి పారేయలేని పరిస్థితి.
ఎక్కడైనా, ఎవరైనా ఓడిపోతే ఆత్మపరిశీలన చేసుకుని, తప్పులు సరిదిద్దుకుంటారు. ఇదేం విచిత్రమో తెలియదు కానీ, పవన్‌కల్యాణ్ మాత్రం మరో పార్టీ అధినేత ఉన్నతి చూసి సంతృప్తి చెందాలనుకుంటున్నారు. తన ప్రయోజనాల కోసం జనసేన కార్యకర్తలు, నాయకులు, కాపు సామాజిక వెంట నడుస్తుందని నమ్మడంలోనే పవన్ వైఫల్యం ఉంది. పవన్ ఇదే రకమైన పంధాతో వెళితే మాత్రం … రాజకీయ తెరపై ఎప్పటికైనా విలనే తప్ప, హీరో అయ్యే ప్రశ్నే వుండదు.