నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టకు సంబంధించి ఆ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అడ్డంగా బుక్కైంది. దేశంలో, తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని ఉందంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రులు, ఆ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. అయితే బోధన్ ఘటనలో శివసేనతో కలిసి టీఆర్ఎస్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మావతి భర్త, కౌన్సిలర్ కూడా అయిన శరత్‌రెడ్డి కుట్రలకు తెగబడ్డారని పోలీసులు నిగ్గు తేల్చారు.
దీంతో మత విద్వేషాలకు పాల్పడుతున్నదెవరని బీజేపీ నేతలు విమర్శలకు పదును పెట్టారు. బోధన్ పట్టణంలో శనివారం రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ నేతలు శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఈ చర్య బోధన్‌లో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. సామరస్యంగా విగ్రహాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించుకున్న తర్వాత, రాత్రికి రాత్రే దుశ్చర్యకు పాల్పడాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
శివాజీ విగ్రహ ప్రతిష్టపై ఓ వర్గం నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగించాలని పట్టుపట్టారు. సదరు స్థలం వద్దకు ఇటు అటు వైపుల నుంచి భారీ గా జనం రావడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. పరస్పరం రాళ్లు దువ్వుకున్నారు. అయితే హిందువులపై దాడికి పాల్పడ్డారనే విమర్శలు కూడా లేకపోలేదు. ఇది రాజకీయ రంగు పులుముకుంది. బోధన్ పట్టణ బంద్‌కు బీజేపీ, శివసేన నాయకులు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. శివసేన జిల్లా నాయకుడు గోపికి బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ పద్మావతి భర్త శరత్‌రెడ్డి నుంచి పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ వెళ్లినట్టు పోలీస్ అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో గోపి పోలీసులకు లొంగిపోయారు. మరింత లోతుగా దర్యాప్తు జరపగా, అసలు విషయాలు వెలుగు చూశాయి.
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కొనుగోలు చేయడం మొదలుకుని, అర్ధరాత్రి వేళ హడావుడిగా విగ్రహం ప్రతిష్టాపన వరకూ శరత్‌రెడ్డి ప్రమేయం ఉందని నిగ్గు తేల్చారు. శరత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం. బోధన్ ఘటనను రాజకీయంగా అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ, టీఆర్ఎస్ పావులు కదిపే క్రమంలో, తెలంగాణ అధికార పార్టీ నేతే పట్టుబడడం గమనార్హం. దీంతో టీఆర్ఎస్ షాక్ తిన్నది.